అక్షరాలునేర్చి ఆశ్చర్య పడునాడు - తెలుయునెంత గలదొ తెలుసుకొనగ - వింతతరగదయ్య విఙ్ఞానికెన్నడూ - అప్రమేయ వరద హరిముకుంద (పరాక్రి)

14, జులై 2013, ఆదివారం

పరాక్రి పదనిసలలో.... నూటికి వస్తాదు 2

  ఈ కథను మూడు భాగాలుగా చేసి ప్రచురించడం జరిగింది. కాబట్టి వరుస క్రమాన్ని పాఠించండి.

పరాక్రి పదనిసలలో.... నూటికి వస్తాదు

పరాక్రి పదనిసలలో.... నూటికి వస్తాదు 2  (you are here)

పరాక్రి పదనిసలలో.... నూటికి వస్తాదు 3  

             పరాక్రి పదనిసలలో.... నూటికి వస్తాదు 2

                        అంటూ నూటికొస్తాదుని తీసుకుని ఇల్లుచేరిందా ఇల్లాలు. ఉదయాన్నే ఇంటితలుపు తట్టాడు మంత్రి. ఆవలిస్తూ తలుపు తీసిన ఆవిడకి బారెడు పొద్దెక్కడం మంత్రి దర్శనం ఒక్కసారే ఎదురయ్యాయి. ఏమ్మా నిన్న రాజుగారు చెప్పక... చెప్పక... ఒక పని చెప్తే మీ ఆయన ఎక్కడికీ వెళ్ళకుండా ఇలా పడుకోడం బాగుందా, కనీసం నేనొచ్చాననైనా లేవకుండా ఉంటే మీకు దివాణంలో నౌకరీ ఊడినట్టే గదమాయింపుగా అన్నాడు మంత్రి. అంతే స్వరంతో చూడండి మంత్రిగారూ మా ఆయన నూటికొస్తాదు, యిరవై మంది దొంగలో లెఖ్ఖా.... ఎప్పుడో చంపి పడేసారు. రాత్రి రెండు, మూడు గంటలప్పుడనుకుంటాను ఇంటికొచ్చి ఇలా నిద్రోతున్నారు. లేపమంటారా. వద్దులేమ్మా నేనే ఆ దొంగలు చచ్చి పడిఉన్న ప్రదేశానికి వెళ్ళి చూసొస్తాను. పడుకోనీ పాపం. రాత్రి అలసిపోయి ఉంటాడు. 

                           మంత్రి నయగారానికి లోలోనే నవ్వుకుంటూ, మంత్రిగారూ మాకిక్కడ దినుసులకేం కొదవలేదుగానీ కొద్దిగా ఖర్చులుంటున్నాయ్ మరి తమరర్థం చేసుకోవాలి. తటపటాయించకుండా కావ్చల్సింది అడిగేసింది వస్తాదు భార్య. దాంతో వెండి మొహరీలు నెలకో వంద చొప్పున వారి కుటుంబానికి అందేవి. దాంతో ఇంట్లో నౌకర్లను కూడా పెట్టుకుని సౌఖ్యవంతమైన జీవితాన్ని అనుభవించడానికి వీలైంది. మన వస్తాదు వర్యుడు కూడా ఒళ్ళంతా నూని పట్టించుకుంటూ అభ్యంగన స్నానాలు చేస్తూ రోజూ కోడి, గొర్రె లాంటివి మేస్తూ చూడగానే వస్తాదు అనిపించేలా తయారయ్యాడు. 

                             అన్నిరోజులూ ఒక్కలా ఉండవు గదా! మరలా వస్తాదుకు పని పడింది.  రాజే స్వయంగా పిలిపించి చెప్పాడు. ఊరిచివర యాతలు ఓ ఎలుగుబంటితో చాలా ఇబ్బంది పడుతున్నారు వాళ్ళ కల్లుకుండలన్నీ అది చిందర వందర చేసేస్తోంది. రాత్రుళ్ళు మరీ దాని ఆగడాలకు అంతులేకుండా ఉందట. మన సైనికులని పది మందిని పంపా కానీ ఏం ప్రయోజనం ఎలుగుబంటి చేతిలో కొందరు చచ్చి కొందరు బతికి వచ్చారు. ఎలాగైనా నువ్వే వెళ్లాలి. నువ్వు వందమంది పెట్టు కదా అదే నా ధైర్యం వెళ్ళి దాన్ని చంపిరా.

                     రాజు ఆదేశానికి విచారంగా నెత్తిన గుడ్డేసుకుని భార్యతో ఇలా అన్నాడు వస్తాదు. ఒసే ఇంకీ దివాణంలో మనకి నూకల్లేవే. మనుషులు కూడా కాదు జంతువుని నేను చంపాలంట. పద ఈ రాత్రికే పారిపోదాం. అమావాస్య, ఆదివారం అని నిర్ఘ్యాలు పెట్టకు. ఉన్నపళంగా కట్టుబట్టలతో పదండి. పెరటిదారిన తాటితోపుల మధ్యగుండా ఒకరిచేయి ఒకరు పట్టుకుని పారిపోదాం. 

                   వాళ్ళు వెళుతున్నారు...... అసలే రాత్రి అందునా అమాస, వస్తాదు ఒకవేపు చేతినే కాకుండా రెండో చేతిని కూడా ఎవరో పట్టుకుని గుంజుతున్నట్ల నిపించి భార్య చేయి వదిలేసి ఎలుగుబంటిని కాగలించుకున్నాడు వస్తాదు. ఏవండోయ్! అది ఎలుగుబంటిలాగుంది పరుగెత్తండంటూ పిల్లలను కాచుకుంటూ ఓ పొదలో దాగింది అతని భార్య. చురకత్తిపై చేయివేసి ఎలుగుబంటిని విడిపించుకుని  పక్కనున్న చెట్టుకు ఎగబాకాడు వస్తాదు. చెట్లెక్కడం ఎలుగుకుమాత్రం రాదా ఏమిటి? .....

                   కానీ అది విచిత్రంగా ఎక్కుతుంది. తలక్రిందులుగా... వస్తాదును సమీపిస్తున్న కొద్దీ.... చెట్టుపైకి పాకడంలో అతని చురకత్తి కాస్తాజారి ఎలుగు ముడ్డిలో దిగబడిపోయింది. నిశ్శబ్ధంగా దబ్బుమనే శబ్ధం తప్ప అతడికేమీ కనిపించలేదు. కిక్కుకిక్కు మని ఘుర్జరిస్తూ  చచ్చింది ఎలుగు. ఓ అర్ధగంట సద్దుమణిగాక మొదటగా తేరుకున్న అతని భార్య ఎలుగు రక్తపు మడుగులో పడి మరణించిందని ధృఢపరుచుకుని భర్తకై కేకలేసింది. నేనిక్కడే చెట్టుమీదే ఉన్నానే.... పర్లేదు దిగండి... అది చంపేస్తుందే... అదే చచ్చి పడింది... మీరు నన్ను చంపక  చెప్పింది చేయండి. ముందా చెట్టు దిగండి. 

                    కొందరికి అదృష్టం ఆతుల్లో పట్టడమంటే ఇదేనేమో ..... భార్యా భర్తలు మరలా దివాణం కేసి అడుగులేసారు. మర్నాడు మంత్రి పిలవడం - రాజసభకు వెళ్ళి వస్తాదు రాత్రి తలగడ పాఠాన్ని తూ.చ తప్పకుండా అప్పగించడం జరిగింది. ఎలుగును చూసిన రాజు పొంగిపోతూ, మన నూటికొస్తాదు ఎంత సూటిగాడోయ్ అమావాస్య రాత్రిలో కూడా కత్తి విసిరాడంటే ఏమనాలి .... ఎక్కడ గుచ్చుకోవాలో అక్కడ గుచ్చుకుంది. ఓ సన్మాన సభ ఏర్పాటుచేసి పులిగోరు పతకంలా... ఎలుగ్గోరు పతకం చేయించి మెళ్ళోవేసి, ఇతనికీ నెలనుంచి వెండి మొహరీలే కాదు బంగారు మొహరీలు కూడా ఇవ్వండని ఆదేశించి ఆ నాటి సభ ముగించాడు. 

                                             .................................సశేషం