అక్షరాలునేర్చి ఆశ్చర్య పడునాడు - తెలుయునెంత గలదొ తెలుసుకొనగ - వింతతరగదయ్య విఙ్ఞానికెన్నడూ - అప్రమేయ వరద హరిముకుంద (పరాక్రి)

24, డిసెంబర్ 2012, సోమవారం

ఆకాశవాణి సమస్యాపూరణలు - 20

20. సమస్య:-   బీరుపట్ట బిడ్డ భీముడగును.
          

      ఆవె||     అక్బరడిగినాడు, అమ్మలేదక్కటా!
                  బిడ్డ పాలకెట్లు? బీర్బలనెను
                ఆవు పాలను మన ఆస్థానమందు క
                  బీరుపట్ట బిడ్డ భీముడగును.||

11, డిసెంబర్ 2012, మంగళవారం

6, డిసెంబర్ 2012, గురువారం

ఆకాశవాణి సమస్యాపూరణలు - 21

 21. సమస్య:- మూడును మూడు మూడు మరి మూడును మూడును మూడుమూడుగన్.
      
 ఉ||  బాడుగ కట్టినాను గత వారమునుండియు బండిలాగి నీ
     తోడిక నమ్ముమయ్య నను దోసము పట్టెదవేల రోజుకున్
     మూడగు రూకలైన యవి మొత్తము లెక్కిడ వారమందునన్
     మూడును మూడుమూడు మరిమూడునుమూడును 
                                                                 మూడుమూడుగన్.||

27, నవంబర్ 2012, మంగళవారం

ఆకాశవాణి సమస్యాపూరణలు - 19

19. సమస్య:-  మనమా! వద్దిక నాదుమాట వినుమా మర్యాద కాపాడుమా!


మ||  స్తనముల్ రెండవి క్షీరపక్వ ఫలముల్ ధ్యానింపమాత్వమే
      ఘన సారంబగు నూరువుల్ గనుమ సంఘావిర్భవా స్థానముల్
      కనుకన్ యేమరి విస్మరింపకుము సౌశీల్యంబె యో జార! కా
      మనమా! వద్దిక నాదుమాట వినుమా మర్యాద కాపాడుమా! ||

23, నవంబర్ 2012, శుక్రవారం

21, నవంబర్ 2012, బుధవారం

ఆకాశవాణి సమస్యాపూరణలు - 18

18. సమస్య:- చట్టమొచ్చె మిమ్ము సంస్కరింప
    

   ఆవె||   మతిని గతిని మార్చు మత్తున చిత్తైన
           బుద్ధిలేనివాడు, బుధవరుండు
           అనెడి బేధమేమి? ఆల్కహాలికులార
           చట్టమొచ్చె మిమ్ము సంస్కరింప  ||

18, నవంబర్ 2012, ఆదివారం

ఆకాశవాణి సమస్యాపూరణలు - 17

17. సమస్య:- భారమ్మనిపించె భార్య భర్తను ప్రేమన్
   

     కం  ||     నారదుడాడిన తులనా
                భారమ్మును సత్య బొందె, భక్తిని పొందెన్
                తా రుక్మిణి, సతులారా!
               భారమ్మనిపించె భార్య భర్తను ప్రేమన్ ||

2, నవంబర్ 2012, శుక్రవారం

గౌరవాభినుతి - శ్రీమతి చెట్టి వెంకటలక్ష్మి యం.పి.డి.వో సబ్బవరం.


contact for సన్మాన పత్రాలు - ఆశీర్వచనాలు
9966455872
                                                                          ------------    పంతుల వెంకట రాధాకృష్ణ (పరాక్రి )
                                                                                                   గ్రేడ్ వన్ తెలుగు పండిట్
medhadakshinamurtyjyotishanilayam.blogspot.in/


30, అక్టోబర్ 2012, మంగళవారం

ఆకాశవాణి సమస్యాపూరణలు - 16

16. సమస్య:- శ్రీ స్థానము మారిపోయి చివరకు చేరెన్ ||


       కం  ||    శ్రీ స్థిరమగు శ్రీహరి వ
                క్షో స్థానము దాచె మౌని, కోపించెను ల
                క్ష్మ్యా స్థేయుని క్రియ, అలకన్
                శ్రీ  స్థానము మారిపోయి చివరకు చేరెన్ ||

10, అక్టోబర్ 2012, బుధవారం

ఆకాశవాణి సమస్యాపూరణలు - 15

15. సమస్య:- "వడ్డీ అసలు కంటె ముద్దు పరికింపంగా ||
       

    కం ||      గుడ్డనడు కొడుకు పనులకు
                 సొడ్డు పనులయిన మనుమడు సొంపగు క్రియలన్
                 యెడ్డెముసేసిన తాతకు
                 "వడ్డి అసలు కంటె ముద్దు పరికింపంగా  ||

8, అక్టోబర్ 2012, సోమవారం

ఆకాశవాణి సమస్యాపూరణలు - 14

14. సమస్య:- "రతిని పెండ్లాడె వారిజ సుతుడు నిజము
    

      గీ ||    వేద వేదాంగ వాఙ్మయ వేదవతిని
              నాద నాట్యాంగ రాగాల నాద నటిని
              వరల సౄష్టికర్త సతి సరస్వతిని సరస
              "రతిని పెండ్లాడె వారిజ సుతుడు నిజము ||

6, అక్టోబర్ 2012, శనివారం

ఆకాశవాణి సమస్యాపూరణలు - 13

13. సమస్య:-"మీ సముతో వియ్యమంద మీ సములయ్యెన్"


     కం ||     రోసముతో కయ్యమగును
               కాసులతో కుదురునయ్య కళ్యాణములున్
               ఈ సరి కయ్యము వియ్యము
              "మీ సముతో వియ్యమంద మీ సములయ్యెన్" ||

4, అక్టోబర్ 2012, గురువారం

ఆకాశవాణి సమస్యాపూరణలు - 12

 12. సమస్య:-"చచ్చినోడి కళ్ళు చారడేసి" ||

      గీ ||  పెద్దవాని పలుకు ముద్దులొలుకుచుండ
              పేదవాని పలుకు పెదవి చేటు
              బ్రతికి చెడ్డవాని వావి వరసలోన
               "చచ్చినోడి కళ్ళు చారడేసి" ||

29, సెప్టెంబర్ 2012, శనివారం

ఆకాశవాణి సమస్యాపూరణలు - 11

11. సమస్య:- "తల్లిదండ్రుల పెండ్లికి తనయులరిగె
       
       గీ ||     అరువదేడుల వారలై యమ్మ నాన్న
                ఆది దంపతులైరి  అత్యాదరమున
                షష్టిపూర్తికి తమతమ సతులతోడ
                "తల్లిదండ్రుల పెండ్లికి తనయులరిగె " ||

27, సెప్టెంబర్ 2012, గురువారం

ఆకాశవాణి సమస్యాపూరణలు - 10

10. సమస్య:- నీరు చాలక- దీపములారిపోయె"


     గీ  ||    మాచి కొండను విద్యుత్ జల మరల నుండి
              ఒడ్డివారలకు మనకు నొప్పుదలగ
              పంపిణీజేత, మిషనరీ ప్రగతి లేక
             "నీరు చాలక- దీపములారిపోయె" ||

25, సెప్టెంబర్ 2012, మంగళవారం

ఆకాశవాణి సమస్యాపూరణలు - 9

9. సమస్య:- "మీరును మీరు మీరు మరి మీరును మీరును మీరలందరున్"
 

ఉ||  చేరిరి నన్ను చూడగను చిప్పిలె నార్ద్రత నాదు కన్నులన్
     నీరది జూచి డెందమున నిర్మలభాషిత వాక్కులందు, నో
     దారుచుటంత చాలు నిది దల్పగ మీపయి మైత్రిభావమే
    "మీరును మీరు మీరు మరి మీరును మీరును మీరలందరున్" ||

22, సెప్టెంబర్ 2012, శనివారం

ఆకాశవాణి సమస్యాపూరణలు - 8

8. సమస్య:- అన్నము సున్నమాయె వదినమ్మలు వండగ తిండి నేడెటుల్" 

 ఉ ||వన్నెకు తక్కువైన మరి వండరె బాలలు కొంత ముచ్చటన్
     కన్నెలుగూడ వంటలను కమ్మగజేతురు నమ్మచూడగన్
    అన్నయ భార్యలయ్యు అహహా! యిది యేమన వచ్చునో గదా
    "అన్నము సున్నమాయె వదినమ్మలు వండగ తిండి నేడెటుల్" ||

21, సెప్టెంబర్ 2012, శుక్రవారం

ఆకాశవాణి సమస్యాపూరణలు - 7

7. సమస్య:- "మత్తునదేలు మానసము మామకభావము పల్లవింపగా

 ఉ ||   అత్తరి జూపి ఒక్కరుడు యాకసమందున చంద్రుడున్నచో
       "హత్తెరి" సూర్యుడేయనుచు అందరి గాదనె, ఒక్కడందులో
        బొత్తిగ తెల్దు నాకనియె బొంకని వాడిక ఊరుకొత్తదై
       "మత్తునదేలు మానసము మామకభావము పల్లవింపగా ||

17, సెప్టెంబర్ 2012, సోమవారం

ఆకాశవాణి సమస్యాపూరణలు - 6

6. సమస్య:- "మువ్వలు గువ్వలై మొలచె మోదము మోహన రాగమయ్యెడిన్"
ఉ|| యవ్వన శోభమీర తనయందము డెందములందు గుందగా
    అవ్వన కేకి పోకడల ఆటకు పాటకు సాటి భళా యీ
    జవ్వని నాట్యకత్తె సరసఙుల దవ్వుల చిందులాడగా
  "మువ్వలు గువ్వలై మొలచె మోదము మోహన రాగమయ్యెడిన్" ||

15, సెప్టెంబర్ 2012, శనివారం

ఆకాశవాణి సమస్యాపూరణలు -5

5. సమస్య:- పోరుట తారకాసురుని పోలిక తప్పదు ముప్పుముందటన్.


 ఉ||   హారము రోదసీ స్థలిని యబ్బురమిచ్చును దేవతాళికిన్
        పారములేని ఆకసమపారమ నంతము భాగరించుచున్
       దారులుగీచి భూజనులు దాటగనెంచుటకై మనస్యతన్
       "పోరుట తారకాసురుని పోలిక తప్పదు ముప్పుముందటన్" ||

14, సెప్టెంబర్ 2012, శుక్రవారం

ఆకాశవాణి సమస్యాపూరణలు - 4

 4. సమస్య:- "వనమున సంచరించుటకు పద్థతులుండవె యెంచి చూడగన్
  చం|| ధనమది ముఖ్యమా మనసు దారుణ హత్యకు పూంచి ప్రాణులన్
   హననము చేయుటందగదు హా ! విపరీతమె గర్భకోశులన్
   తనవశమైన ఆటవిక తత్వముగాదె నిషాద మానవా
  "వనమున సంచరించుటకు పద్థతులుండవె యెంచి చూడగన్" ||

10, సెప్టెంబర్ 2012, సోమవారం

ఆకాశవాణి సమస్యాపూరణలు - 3

                                    -:ఆకాశవాణి  సమస్యాపూరణలు:-

3. సమస్య:- హీన చరిత్రుడే జగతి హెచ్చగు గౌరవమందుచుండెడిన్

    ఉ || వానికి పాదపూజ ధనవంతుడనే కులదీపకుండుగా
       ~గ్ౙానిగ గుర్తు పండితుల మండలిలోన గుణోత్తముండుగా
       తేనెలతేట మాటయట తేకువజేత ప్రపంచ జేతయై
      "హీన చరిత్రుడే జగతి హెచ్చగు గౌరవమందుచుండెడిన్"||

7, సెప్టెంబర్ 2012, శుక్రవారం

ఆకాశవాణి సమస్యాపూరణలు - 2

          -:ఆకాశవాణి  సమస్యాపూరణలు:-

2.  సమస్య:- నిద్దుర పోవువాడు ధరణిన్ ఘనకీర్తి గడించి మించెడిన్
   

    ఉ|| విద్దెలలోన సూరుడయి వి~గ్ౙతయందు ప్రశస్తయుక్తుడై
       హద్దులు దాటిపోని ప్రభుతార్ధము కార్యవిచక్షణా క్రియన్
       ప్రొద్దుల పద్దు బద్ధమయి బోయెడివాడిల చాకచక్యతన్
       "నిద్దుర పోవువాడు ధరణిన్ ఘనకీర్తి గడించి మించెడిన్"||

5, సెప్టెంబర్ 2012, బుధవారం

ఆకాశవాణి సమస్యాపూరణలు - 1

              -:ఆకాశవాణి  సమస్యాపూరణలు:-

 1.సమస్య:- తనయులనమ్ము దండ్రుల విధమ్ములజూడ విషాద హేతువుల్

 చం|| ఘనతర వంశ వర్ధనులు  కారెమదీయ కుమారులంచు తా
      ననయము వారి పోషణకు నమ్మకముంచి మహోత్సవంబుతో
      జనకుడు రక్తమాంసములు చమ్మట చిందిల మోసగించి పో
     "తనయులనమ్ము దండ్రుల విధమ్ములజూడ విషాద హేతువుల్ " ||

4, సెప్టెంబర్ 2012, మంగళవారం

నిషిధ్ధాక్షరి:-


  శ్రీ రాంభట్ల పార్వతీశ శర్మ 
-యువ యవ ధానికి-2010  హనుమంతవాక
నిషిధ్ధాక్షరి:- పరాక్రి.
                    చెప్పుమ రవిపై కందము
                    గొప్పగ జనులందరందు కోరిన విధిలో
                    ఇప్పుడె యువయవధానీ
                    తిప్పలు బడయగ(క) సరిపడు తీరులొనర్పన్//

3, సెప్టెంబర్ 2012, సోమవారం

సమస్యాపూరణలు - 1


శ్రీ గరికపాటి వారికిచ్చిన సమస్య;-2009 

         కం/ /  ’ వేదాలారని గణింప విస్మయ మగురా "
           

   నా పూరణ:-
                                  వేదికి తెలియును పంచమ
                                  వేదంబు వరకు కరతల మోహో ఆయు
                                  ర్వేదం గూడా కలుపుచు
                                  వేదాలారని గణింప విస్మయ మగురా//


గరికిపాటి వారి పూరణ:-

నాదమ్మే వేదమ్మై
పాదము మస్తకము గలుప పంచమ వేదం
బాదిగ సంగీతముతో
వేదాలారని గణించె విస్మయమందన్

________________________________________________________________

 నా శ్రీమతి ఇచ్చిన   దత్తపది.
 2. శ్రీమతి పంతుల జయమహేశ్వరి – ఘనము, మనము, ధనము, జనము – భాగవతార్థంలో

 గరికిపాటి వారి పూరణ:-

శుకుని మహాప్రబోధనము సూనృత వృక్షము లోకరక్షకై
నికరము జేసి నీ మనము నీరజనేత్రునియందు నిల్పు దీ
పిక గొనిజూడు చిద్ఘనము వీథులలో లభియింపబోదు గో
పికలకు చిత్తరంజనము వేదము దాని నిరంజనమ్మనెన్

శ్రీగరికపాటి నరసింహారావుగారి శతావధాన సాహితీక్రతువు – విజయభావన, విజయనగరం.


1, సెప్టెంబర్ 2012, శనివారం

పరివర్తన -విద్యార్థినుల నాటకం

 
పాత్రలు (విద్యార్ధినులు) : 
     రత్నమాల ( చదువు శ్రద్ధగలది )
    ఉష  ( పాటల పిచ్చిది )
    అలక్ నంద ( బొద్దుగా ఉండే తిండిపోతు )
    కవిత  ( పేరుకు తగ్గట్టే కవిత్వాల పేరడీ రాణి )
    జాకీ ( మార్షల్ ఆర్ట్సు పై సుముఖత కలది )
    దొంగ (అవసరాల అకతాయి ) పురుష పాత్ర


  నేపధ్యం :- అది ఒక కాలేజి అమ్మాయిలు చదువు కునే స్టూడెంట్స్ రూం. కుర్రతనం కోంటెతనం పిరికితనం భయం  తొణికిసలాడే వయస్సు వారిది.  సమాజ శ్రేయస్సు కోరే సంస్కర్తలేకాదు, యువతరం కూడా మానవతా  థౄక్పధంతో  తమ మంచి మాటలతో  ఓ దొంగ మనస్సులో పరివర్తన తీసుకువచ్చిన సంఘటనకు రూపకల్పన   ఈ నాటిక.

 రత్నమాల : (గదిలోకి ప్రవేశిస్తూ ) అయ్యయ్యో ! గది తలుపులు తెరచి
వీళ్ళంతా ఎక్కడికెళ్ళిపోయారో, ఈ పుస్తకాలన్నీ ఎలా పడేసారో ,గదంతా చిందరవందర చేసేసారు. ఇది చదువు కోనే విద్యార్ధులుండే గదంటే ఎవరైనా నమ్ముతారా ? నా ఖర్మకొద్దీ ఈ రూమ్మేట్సు దొరికారు.


ఉష : ( పాడుకోంటూ )బోటనీ క్లాసు వుంది-మేటనీ ఆటవుంది -దేనికో ఓటు చెప్పరా ( ఆశ్చర్యం ప్రకటిస్తూ ) హలో....రత్నం ఎప్పుడోచ్చేవే.....
గొణుక్కుంటూ ఎవరినే ఆడిపోసుకుంటున్నావు.... ?

రత్నమాల : మిమ్మల్నే... ఇది చదువుకునే వాళ్ళుండే రూమేనంటావా ? ....పరీక్షలు ముందు పెట్టుకుని-సినీమాలకూ,షికార్లకు పోతారా ?
ఏరే  మన మిగతా మేళం.

ఉష : అబ్బ .... వస్తారులేవే... నువ్వు ఊరినుంచి  తిరిగొచ్చావంటేనే
మాకో పెద్ద  తలనొప్పి. మేమేం ఫేలౌతున్నమా... ఆడుతూ,పాడుతూ,
అంతో,ఇంతో,చదివి అలా రాసి పడేస్తే పోయేదానికి  నువ్వెంత సీరియస్
సీన్లు  సౄస్టిస్తావే..


రత్నమాల : నోరు ముసుకో  చదువంటే నవలాపారాయణం అనుకున్నవా.... సిన్సియారిటీ నేర్చుకోవే...ఊతప్పంలా  మొహం నువ్వూను.


ఉష :  చూడు ఉష మాత్రం నేను. ఊతప్పం నాది కాదు.

అలక్ నంద :ఊతప్పం  నాదీ.

ఉష : అమ్మ తిండి పోతూ  వచ్చిసేవూ  ఊతప్పమేనా ఇంకా ఏమైనా కావాలా.....


అలక్ నంద :( పాడుతూ ఇద్దరి చూట్టూ తిరుగుతూ )నాకు బజ్జీ కావాలి-నాకు బోండ కావాలి-నాకు ఐస్ క్రీం కావాలి-నాకు చాక్లెట్ కావాలి

ఉష : ( వెక్కిరింపుగా ) అడ్డమైన గడ్డి  తెచ్చుకున్నవుగా  మెక్కు


రత్నమాల : ( సిరియస్ గా ) అలక్ నంద మీకు చదువులఖ్ఖరలేదే...

కవితారాణి:  చదువు ఒక  వరం
                  ఇది  సంధ్య కాలం
                  అంటోంది మన తరం
                  ఇది  నిరం తర సత్యం

అలక్ నంద :  చచ్చాం , దీని  కవిత్వం  వినిపించి నన్ను తిండి తిననియ్యదు కాబోలు. సార్ధక  నామధేయురాలివే కవితా రాణి


కవితారాణి: కవిత్వం  ఒక అల్కెమీ  అన్నాడు  శ్రీశ్రీ...
కుక్క పిల్ల అగ్గిపుల్ల సబ్బుబిళ్ళ కాదేది కవితకనర్హం , చెప్పమంటావా తిండి మీద కవిత్వం.
రత్నమాల : అబ్బబా ! అపండర్రా మీ గోల ఇప్పడిదాక తిరిగింది చాలు
కాస్తా పుస్తకాలు తీసి ఏడవండి.
 ( అందరూ ముక్తకంఠంతో ఏడుస్తూ ఊ.....ఊ...ఊ...)
రత్నమాల : హూ.. ఆపండి నోరు ఎత్తారంటే తంతాను.
జాకీ : ( మార్షల్ క్రై చేస్తూ చేతులూపుతూ ) హా..హా..హూ...హూ...
ఉష : ( పాడుతూ, జాకీని గుద్దేస్తూ ) బంచిక్ బంచిక్ చేయి బాగా, వంటికి యోగా మంచిదేగా, లేజీగా వళ్ళు పెంచుకోక, నాజుగ్గా వుంచు తీగలాగ.
జాకీ : అయ్యో ! హా..కొంచెం నీ హేండిచ్చి లేపవే ( లేస్తూ ) రాంగ్ పొజిషన్, ఈ ఏంగిల్ లో ఊపిరి బిగబట్టకుండా మార్షల్ క్రై చేస్తూ పడితే
నడుం బెణికే ప్రమాదం వుంది. ఈ జాకీ అదౄష్టవంతురాలు, జాకీచాన్ ఫేవరెట్ కాబట్టి తౄటిలో ప్రమాదాలు తప్పోతూ ఉంటాయి...
రత్నమాల : నువ్వూ వచ్చేసావా తల్లీ ఇంక నా చదువు సాగినట్టే...
అలక్ నంద : నా బబుల్ గం సాగుతుందే...
కవితారాణి: నీ మొహం ....
                                  సాగేదీ సాగించేదీ దైవం
                                        ఈజీవితమే ఓ నాటకరంగం
                                  యవ్వనమే బ్రతుకున అందం 
                                              మన సరదాల శ్రీగంధం
రత్నమాల : ఆపుతావా నీ కవిత్వం అంత్యానుప్రాసే కవిత్వం అనుకునే నీబోటి వాళ్ళు వీధికి నలుగురుంటారు. కవిత్వం పేరుచెప్పి దెయ్యంలా
 పీడిస్తున్నావు కదే.
అలక్ నంద : అమ్మో! దెయ్యమే ( భయంగా ముఖం పెడుతూ ).
ఉష : ( దెయ్యంలా నడుస్తూ పాడుతూ ) నిను వీడని నీడను నేనే
                                                      కలగా మిగిలే కథ నేనే.
జాకీ : అబ్బా, రాత్రి పూట ఆ దెయ్యం పాటలు పాడకే, దెయ్యాల సినిమలు చూసి ఇప్పటికే భయపడి చస్తున్నాం.
అలక్ నంద : పెద్ద కరాటే ఫైటర్ నంటావ్ అంతా బడాయేనా.
కవితారాణి: పిరికి వాని మదిని బింకమీలాగురా.....విశ్వదాభిరామ విసిని కర్రా.
రత్నమాల :  ఇంక వీళ్ళాపరు ఎమర్జన్సీ పెట్తాల్సిందే .ముందు మీరంతా కూర్చోండే (సాధికారంగా ) ఈ స్టోరీ చెబుతాను నాతో పాటు కంఠస్తం చేయండి. ( ముక్త కంఠంగా అందరూ రత్నమాలను అనుకరిస్తూ ).
లాంగ్ లాంగ్ ఎగో....... లాంగ్ లాంగ్ ఎగో.....
దేర్ వజ్ ఏ కింగ్ .... దేర్ వజ్ ఏ కింగ్ ....
హీ ఈజ్ ఫాండ్ అఫ్ పేరెట్..... హీ ఈజ్ ఫాండ్ అఫ్ పేరెట్.....
గుడ్.. ఇంక అందరూ సైలెంట్ గా చదవండి......
అలక్ నంద : ఔనర్రా.. పెరటి తలుపులు వేసేరూ... ( బుగ్గలు నొక్కుకుంటూ ).
రత్నమాల :  ఆ నోరలా మిల్లాడించకపోతే వెళ్ళి వేసి రారాదూ... 
అలక్ నంద : వమ్మో.. దెయ్యముంటేనో..
రత్నమాల :(హూం..అని నిట్టూరుస్తూ)నీ వల్ల కాదుగానీ...నీపనికానీ
 తిండిపోతా. అమ్మా కవితారాణీ నువ్వెళ్ళి వేసి రారాదూ...
కవితారాణి: నాకేం భయమనుకుంటున్నావా ? ... కానీ నువ్వెందుకెళ్ళ కూడదూ....
రత్నమాల : చదువుకుంటున్నాను కదే...
కవితారాణి: నేను చదవకపోతే... కవిత్వం వ్రాసుకుంటానే.... వెళ్ళనుగాక వెళ్లను.
రత్నమాల : ఉషా... చూడవే ఎలా తప్పించుకుంటోందో.... పోనీ నువ్వెళ్ళవే....
ఉష : ( పాడుతూ ) అయ్య బాబోయ్ నేనేం చేయ్యనోయ్...
                          ఓరి దేవుడోయ్ నాకేం దారిరోయ్....
రత్నమాల : ఆహా.. నీవల్లా కాదా....
ఉష : నా వల్ల కాదుగానీ... హా....హూ.... మన జాకీని పంపుదాం.
జాకీ : అందరూ తప్పుకున్నారు ఆఖరికి నేనా దొరికాను.
రత్నమాల : ఔను నువ్వే కాస్త ధైర్యం కలదానివి వెళ్లవే....
ఉష :  వెళ్లవే....
అలక్ నంద: వెళ్లవే....
కవితారాణి:  వెళ్లవే....
జాకీ : వెళ్తాను తప్పుతుందా...హా..హూ..హా..హూ..(అంటూ వెళ్లి  మరు
నిమిషంలో తిరిగి వస్తూ...) దే...దో....దే...దో....
ఉష :  అదేంటే హా..హూ..అనడం మనేసీ... దే...దో...అంటున్నావు.
రత్నమాల : ఉండవే, అదేదో భయపడింది.
అలక్ నంద:  దెయ్యం పత్తేసిందేమో........
కవితారాణి:  దైవం ప్రకౄతి... దెయ్యం వికౄతి..
                ఈ ప్రకౄతిలో వికౄతి రూపం దెయ్యం .
అలక్ నంద: అమ్మో... ఆగవే...నాకు భయం.
జాకీ : ( తేరుకుంటూ ) దే..దే...దేయ్యం కాదర్రా...దో...దో...దొంగ.
ఎక్కడే ( అందరూ ముక్తకంఠంగా... జాకీ చెయ్యి చూపెడుతున్న దిశగా చూస్తూ )
దొంగ : ( ప్రవేసిస్తూ, గాభరా పడుతూ, చేతిలో కత్తి వణికిస్తూ ) భయపడకండి... భయపడకండి, నేనేం చేయను, నేను కొత్త దొంగను,
కాదుకాదు దొంగతనానికి కొత్తవాడ్ని... మీలా చదువుకున్న వాడినే...
నిరుద్యోగిని... మా అమ్మకు ఒంట్లో బాగోలేదు...డబ్బు కావల్సివస్తే దొంగతనానికి సిద్ధపడ్డాను.( కత్తి క్రింద పారేస్తూ ) దయచేసి అరవకండి.
కవితారాణి: చూసవా నేడు దేశంలో చదువుకున్నవాడి పరిస్థితి... ఈ నిరుద్యోగి దుస్థితి.. ఆకలేసి కేకలేసే అధోగతీ...
రత్నమాల : నోర్మూయ్.. ఉద్యోగం లేకపోతే దొంగతనం చేయ్యాలా... చదువుకున్న సంస్కారం ఇతనిలో ఏమైనా ఉందా....??? వీడు దొంగతనానికి కూడా పనికిరాడు.
ఉష : ( పాడుతూ ) ఎవరో తోడు వస్తారనీ... ఏదో మేలు చేస్తారనీ... నిజం మరచి నిదుర పోకుమా... ఎదురు చూసి మోసపోకుమా...
అలక్ నంద: చూడండి దొంగగారూ... ఎంచక్కా ఏ మిఠాయి కొట్టో...
బన్ బేకరీయో పెట్టుకోవచ్చు కదా...
జాకీ : నువ్వుండవే తిండిపోతా...ముందీ దొంగనీ పోలీసులకప్పగిద్దాం.
దొంగ : అంత పని చేయకండమ్మా.. నా తల్లి ఆరోగ్యం బాలేదు.. కనీసం
మీరు తలో వందా సాయం చేయండి.. 
అలక్ నంద: వీడెవడో... ముష్టి దొంగలా ఉన్నాడే...
రత్నమాల : ఏమయ్యా.. సిగ్గులేదూ...కష్టపడి పనిచేసుకోలేవూ...
ఇంత భయస్తుడివి..ఈ పనికెందుకు పూనుకున్నావ్..
దొంగ : మా పరిస్థితి మీరర్ధం చేసుకోవాలి.. యం.బియ్యే చదువుకున్నాను.. పెద్దపని రాదు... చిన్నపని లేదు...
రత్నమాల : అబద్ధం.... నీకు పనిచేయడానికే బద్ధకం....
దొంగ : ఏం....చెయ్యమంటారో చెప్పండి...
( అందరూ ) మేం చెప్పింది చేస్తావా.... 
దొంగ :  డబ్బులిస్తారా... ఒక్కొక్కరూ చెప్పండి చేసి పెడతాను...
కవితారాణి: (ఆట పట్టిస్తూ) నా కవిత్వం విని...ఆ మాటలప్పచెబితే నీకు
వందరూపాయలిస్తాను... విను...
      సుందర మందమంద శిత సాంద్రము నైనను స్తుత శీతలా
      నంద మరంద మాధురికి నాందిగ పుష్ప లతాశ్రితానమై
     పొందుగ నందునిందు పరువొందెడు వాయువు మాలలందునన్
     జెందెగ గంధవాసనలు జెందును యందరి ముందుముందరన్// 
దొంగ : అమ్మో.. ఇన్ని...ం...దా..లే , మీ వందకో నమస్కారం ....
అలక్ నంద: ( కవితని వెనక్కి పొమ్మని సైగ చేస్తూ ముందడుగేసి) చూడండి దొంగగారూ... కాఫీలో బోర్నవీటా... టీలో హార్లిక్స్...అవి రెండూ కలిపిన గ్లాసులో నిమ్మకాయ రసం పిండి ఉప్పూ కారం  కలిపిస్తే  తాగిపెడతారా....
దొంగ : ఏంటమ్మా... కాఫీలో బోర్నవీటావా... టీలో హార్లిక్సా... నిమ్మకాయ రసం ఉప్పూకారం పిండుతావా...ఏం అర్ధం కావటం లేదు,
నేను తాగాలా... మరలా ఇంటికెళతానా...వద్దమ్మా..వద్దు నీ వందకో దండం...
ఉష :  పోనీ నాతో అంత్యాక్షరీ ఆడగలవా... ఏసినిమాలో ఏ పాటుందో చెప్పగలవా....
జాకీ : పోనీ భరతనాట్యంలో బ్రేక్ డేన్స్... కూచిపూడిలో డిస్కో.... జాకీచాన్ ఫైట్సూ రీమిక్స్ చేయగలవా....
 దొంగ : వామ్మో...వామ్మో... ( అంటూ కింద పడిపోతాడు )
రత్నమాల : చూసారర్రా... మీ ఆగడాలకు ఎలా పడిపోయాడో....
ఇక చస్తే జీవితంలో దొంగతనానికి పోడు...
అలక్ నంద:  చచ్చి పోయాడేమో... దెయ్యమైపోతాడేమో.... నేనెళిపోతాను  బాబూ...
కవితారాణి: ..... ఆగవే నేనూ వస్తానూ....
ఉష : పోలీసులొచ్చారంటే అందరమూ ఇరుక్కుపోతాం....పదవే జాకీ...
జాకీ : పాపం దెయ్యమైపోతాడేమో...  పదవే...పదవే....
రత్నమాల : ( వెళిపోతూన్న వారిని చూస్తూ ) మనుషుల్ని పీక్కుతినే మీకంటే దెయ్యాలెవరూ... మీ మాటలకు పాపం కళ్ళుతిరిగి పడిపోయినట్టున్నాడు.... ( అంటూ.. జగ్గులో నీళ్ళు చిలకరిస్తుంది )
దొంగ :(లేస్తూనే ) అమ్మా... ఈ పోటీలు నేను భరించలేను పారిపోతాను
( ఆ ప్రయత్నంలో )
రత్నమాల : ఆగుబాబూ... చాలా అవసరంలో ఉన్నట్లున్నావు... ఇంద
ఈ డబ్బు తీసుకో... మనిషన్నవాడు దొరలా బతకాలి కానీ... దొంగలా మారకూదదు...
దొంగ : ఉంటారమ్మా...ఉంటారు...మనుషుల్లో కూడా దేవతలుంటారు..
అనడనికి మీరే నిదర్శనం... నాక్కావల్సింది డబ్బేకాదు... మీలాటి మంచి మనుషుల మంచిమాట... వజ్రాల మూట...వస్తానమ్మా... నాకు మంచి పరివర్తన కలిగింది.

                              ----------  పరాక్రి

31, ఆగస్టు 2012, శుక్రవారం

శివరామశర్మ - సన్మానపత్రం (సబ్బవరం)


contact for సన్మాన పత్రాలు - ఆశీర్వచనాలు
9966455872
                                                                          ------------    పంతుల వెంకట రాధాకృష్ణ (పరాక్రి )
                                                                                                   గ్రేడ్ వన్ తెలుగు పండిట్
medhadakshinamurtyjyotishanilayam.blogspot.in/30, ఆగస్టు 2012, గురువారం

వంటకో మనిషి (హాస్య నాటిక)

వంటకో మనిషి హాస్య నాటిక ఆధారంగా సింగపూర్ లోని వేవ్సు సంస్థ వారు ప్రదర్శించినందుకు కృతఙ్ఞతలు
full video click here : http://youtu.be/nkrRECPeWks

పాత్రలు   :
సునంద :  ( అక్క )

మధు  :  (తమ్ముడు )

అత్తయ్యగారు   : ( పక్కింటావిడ  )

పార్వతి  :   (  కుకింగ్ స్పెషలిష్టు )

నలబీం  : ( వంటవాడు  )

ధర్మరావు  : ( తండ్రి  )

                                                         

నేపథ్యం  :  ఉద్యోగస్తులైన ఓ అక్క తమ్ముడు ఇంటిపనులు , వంట పనులు  పంచుకున్నారు. బద్ధకస్తుడైన తమ్ముడు ,అక్కకో                 వంటలక్కను కుదర్చాలని  చెసే ప్రయత్నంలో   ......, " ఈ  వంటకో మనిషి"  (హాస్య  నాటిక).
                                  ----------1-----------

మధు :   అక్కా!   అక్కా!   అక్కా!

సునంద :  నన్నిక్కడే   పెట్టుకుని  ఏమిటిరా  ఆ  చిందులు ....

మధు :   ఇక్కడే  ఉన్నావా , మరి పలకవేం!

సునంద :   నీలా  ఉరుకులు  పరుగులు నా వల్ల  కాదుగానీ , ఇంతకీ  ఏమిటి   విషయం.

మధు :  నువ్వు  అర్జెంటుగా   పెళ్ళి  చేసేసుకోవే !

సునంద :    ఎంత అభిమానంరా ,  నీకు  !  సంబంధమేదైనా  చూసావా ,   అలాగైతే   చెప్పు  ,  నాన్నకి  వేంటనే   ఉత్తరం   రాస్తాను.

మధు :  ఒద్దులే ...... ఒద్దులే .....  నేనే   చూడ గలిస్తే  ఇంత అవమానం   జరిగుండేదా   ?

సునంద :  ఏం  జరిగిందిరా .....

మధు :   అదే !  బ్రహ్మచారి  ముదిరినా , బెండకాయ  ముదిరినా  పనికి   రాదంటేను .....

సునంద :  ఆ  సామెత  ఆడవాళ్ళకు  వర్తించదురా ..  బహుశా అన్నవాళ్ళు  నీ గురించే   అని ఉంటారు.

మధు :  అన్నది  నాగురించే , అనుకో   -  కాని  నీ పెళ్ళి కానిదే  నేనెట్లా  చేసుకుంటాను ?

సునంద  : ఒరే  ఒరే   ఒరే   !  ఇదా నీ దురాలోచన. అర్జంటుగా  పెళ్ళి చేసుకోమంటే  ,మా తమ్ముడికి  నా  మీద ఎంత అభిమానం .. అనుకన్నాను.

మధు :    అది కాదే ...... .

సునంద : ఏది కాదురా ? నువ్వు నన్నేం  పోషిస్తున్నావా, నావుద్యోగం, నాసంపాదనా నాకుంది.అట్టే  మాట్లాడితే ..... నువ్వు ఉద్యోగం   చేసి సంపాదిస్తున్నా, తిండికి  నా మీదే ఆధారపడుతున్నావు. జాగ్రత్త  !!! 

మధు : అదేంటే  అలా ఆంటావు. ఖర్చులు సరి సమానంగా భరిస్తున్నాం   కదా!  నా జీతమంతా బేంకులో   దాచేసుకుంటున్నానా  ?

సునంద  : ఇంట్లో చాకిరీ ఎవరు చేస్తారోయ్ , వండిపెట్టద్దూ. దర్జాగా        ఆఫీసు  టైమయ్యేదాకా దుప్పటీ   ముసుగు కూడా తీయవు .

మధు :    వంటచేస్తే సరిపోతుందా... చేయడానికి సరుకులు నువ్వు       కొనితెస్తున్నావా ?

సునంద  : ఆ ...తెస్తున్నావు మాచెడ్డ నెలకొక్క రోజు. రోజూ నేనే కూరలు  కొనుక్కోవాలి.

మధు :     నేనేం తేనన్నానా.... తెస్తే చచ్చువంటావ్ పుచ్చువంటావ్ .

సునంద  : ఓ వస్తువైపోతే  తెమ్మంటే గుర్తే వుండదు పై పెచ్చు.... ఆమాత్రం తెచ్చుకోలేవా ... అంటూ  రాగాలు తీస్తావ్ .

మధు :    అక్కా ఎక్కువ మాట్లాడకు, వినే వాళ్ళేమనుకుంటారు.

సునంద  : ఆ ఏమనుకుంటారేం.....

మధు :    అక్కడికేదో .....నీసొమ్ము  శ్రమశక్తి దోచేస్తున్నట్టు.

సునంద  : కాదా!

మధు :  ముమ్మాటికీ కాదు .లెక్కలు చూసుకుంటే , చాలా లెక్కలు   పెట్టాలి. ప్రతీ పండక్కీ నాడబ్బుతోనే  బట్టలు కొంటున్నాను.

సునంద  : అప్పచెల్లెలుకి  బట్టలు  పెట్టడం  కూడా  లెక్క కడుతున్నావన్నమాట .

మధు : నువ్వు తమ్ముడికి భోజనం వండి పెట్టడం లెక్కకట్టలేదా....మరి.

సునంద  :  ఛీ ,నీతో వాదించడం  శుద్ధ దండగ .

మధు :   నేనేం వాదించమనలేదు , చక్కగా ఎవరైనా నిరుద్యోగిని చూసి  పెళ్ళిచేసుకో అన్నాను.

సునంద  : మళ్ళీ... పెళ్ళంటావ్ , అందులో.... నిరుద్యోగిని   చూసి           పెళ్ళిచేసుకో   మనడంలో  నీ దురుద్దేశం  ఏమిటిరా?

మధు :     ఉద్దేశ్యం ఏమీ లేదక్కా .... నీ ఫ్రెండ్  సరోజ చూడు.... తను      ఉద్యోగం చేస్తోందికదా. కాబట్టి  నిరుద్యోగిని  పెళ్ళిచేసుకుంది .ఏ పనీ లేదు కాబట్టి ఆ మహానుభావుడు-అదే సదరు భర్తగారు  ఎంచక్కా  పెళ్ళానికి వండి పెడుతున్నాడు.
       
సునంద  :  నీ....మొహం.....తగలెయ్యా.... నీక్కావల్సింది బావగారు        కాదు, వంటవాడు.

మధు :     నేను... అలా....అనలేదే...

సునంద  : ఎలా అన్నా నీవుద్దేశ్యం బోధపదుతూనే వుంది.

మధు : నువ్వు తప్పుగా అర్ధం చేసుకుంటున్నావు అక్కా.... నాదేముంది   ఏ హోటల్లోనైనా తినేసి  కాలం గడిపేస్తాను. నువ్వే ఇంటా బయటా శ్రమ పడిపోతున్నావు....పాపం.

సునంద  :  అందుకని ఓ వంటవాణ్ణి చూసి కట్టుకోమంటావా ?

మధు :    అదుగో మళ్ళీ కోప్పడుతున్నావ్ .... నీకు పెళ్ళైతే.... నేనేం నీ    ఇంట్లో తిష్ట వేసుక్కూర్చోను బావగారి సేవలు నీకే పరిమితం.

సునంద  : మహ  చెప్పొచ్చావులే .... ఆ వచ్చే బావగారు నాకేదో  బ్రహ్మా రథం పట్టేస్తారన్నట్లు.... ఈ రోజుల్లోమగ మహారాజులకి ..  పెళ్ళాం.... అందంగా ఉండాలి.... చదువుకోవాలి.... ఉద్యోగం చేయాలి. ఇంట్లో ఊడిగమూ చేయాలి. ఆడ జాతికి యీ కష్టాల  లిస్టు రాసిపెట్టి ఉన్నదే.

మధు :      నువ్వన్నదీ నిజమేనే..... నాకొలీగ్స్ కొందరు..... కొందరేమిటి  అందరూ భార్యామణి ఉద్యోగం చేసేదే కావాలంటున్నారు.

సునంద  :   అంతేరా  అంతే..... ఆడపిల్ల ఏం సుఖపడినా పుట్టింట్లోనే.

మధు :    అయితే మన సమస్యకు పరిష్కారం ?

సునంద  : కొంచెం నీలో సంస్కారం

మధు :  నా మీదే విరుచుకు పడాతావ్ ... ఇప్పుడే అన్నావా... ఆడపిల్ల ఏం సుఖపడినా పుట్టింట్లోనే అని... కాబట్టీ ..... ఈ వంట డ్యూటీ అయినా నీకు తప్పించేయాలి.

సునంద  : ఆడవాళ్ళకు అది తప్పదురా .

మధు :    ఎందుకు తప్పదే ? వెంటనే పేపర్లో ఒక ప్రకటన ఇచ్చేస్తాను.

సునంద  : ఏమని ... ఉద్యోగం చేస్తున్న ఓ ఇద్దరు అప్పాతమ్ముళ్ళకు  వంటవాడు కం బావగారు   కావాలనా.....

మధు :     ఏంటక్కా ఎప్పుడూ ఎకసెక్కాలేనా .

సునంద  : మరి నీ వరస అట్లానే ఉంది . మనం చేస్తున్నదే  ఊడిగం  మళ్ళీ మనకు వంట ఊడిగం   చేయడానికి  మరో చిరుద్యోగా.

 మధు :  ఏ మాట నువ్వు చెప్పినా డొంకతిరుగుడే...... ఇక  నీ మాటలు  వినేదిలేదు, ఇప్పుడే వెళ్ళి పేపరు ప్రకటన ఇచ్చి వస్తాను...

సునంద  :  ఒరే ..ఒరే.... కొంచెం అన్నం తినిపోరా.....

 మధు :      కుదరదే .... చస్తే నీ వంట నేనింక తినను.


సునంద  :   వెళ్ళు ....వెళ్ళు..... తెగ ఉరుకుతున్నావ్ , ఏదో రోజు నీతిక్క   కుదరకపోదు.

 అత్త య్య (పక్కింటావిడ ): అమ్మాయ్ సునందా..... సునందా...

సునంద  :     మీరా అత్తయ్యగారు  రండి,రండి .....

అత్త య్య (పక్కింటావిడ ): ఏమిటమ్మా అంతలా  కేకలేసుకుంటున్నారు.... కొంపతీసి తగువా.

సునంద  :  తగువా నాపాడా ... ఇంట్లో ఒక్కపని ముట్టుకోడు. నేను శ్రమ   పడిపోతున్నానుట వంట వాడిని పెడతాడుట..వంటవాడ్ని.

అత్త య్య (పక్కింటావిడ ): పోనీ లేమ్మా.... అంతగా అభిమానించే            తమ్ముళ్ళు దొరకొద్దూ....

సునంద  :    దానికేం తక్కువ లేదు లెండి.... కాక పోతే వాడి బట్తలు  కూడా నేనే ఉతికి పెట్టాలి... ఇంతకీ మీరొచ్చిన పనేమిటీ....

అత్త య్య (పక్కింటావిడ ):అదా.. నేను మహిళా మండలికివెళ్తున్నాను..  మీ మామయ్యగారు ఆఫీసు  నుంచి వస్తే ఈ  తాళాలియ్యమ్మా, వార్షికోత్సవం... రాత్రి రావడం లేటవుతుందని చెప్పు .... అతనేం చేసుకుంటే  అదే నాకింత ఉంచమని చెప్పమ్మా....

సునంద  :        అలాగే లెండి...

అత్త య్య (పక్కింటావిడ ):  వస్తానమ్మా... ఇల్లు జాగ్రత్త....

సునంద  : ఇలాంటి వాళ్ళను చూసే... బావగార్లు వంటచేసి పెడతారనుకుంటున్నాడు మా వాడు.
                       
                                  --------- 2  --------


సునంద  : మధూ... ఉదయాన్నే  తయారై    ఇంత   తీరుబడిగా కూర్చున్నావేమిటిరా....ఆఫీసుకు వెళ్ళవా...

మధు :       సెలవు పెట్టానుగా....

సునంద  :   అలాగా... ఒంట్లో బాగాలేదా !  రాత్రి తిండితినక పోతే ....

 మధు :       (విసుగ్గా ) బాగానే.... ఉందే....

 సునంద  :   సరే . నేను ఆఫీసుకెళ్ళొస్తాను..... వంటింట్లో ఫ్రిజ్ లో0C4D;0ఛ్4డ్;అన్నీ పెట్టాను.కావల్సినవి పెట్టుకు తిను...రాత్రి వచ్చిన తరువాత  వంటచేస్తాలే .

మధు :       అక్కర్లేదు.

సునంద  :   ఏమ్మాయరోగం ....

మధు :        ఎందుకు సెలవు పెట్టాననుకుంటున్నావ్....

సునంద  :  వంట చేయడం ప్రాక్టీస్  చేస్తావా ?  చెయ్ ...చెయ్ ... నాకొచ్చే మరదలైనా సుఖ పడుతుంది
మధు :కాదు...నువ్వు సుఖపడాలనే ...నువ్వూ ఆఫీసుకువెళ్ళక్కర్లేదు.   డేటు వేయకుండా నువ్వు నాకిచ్చిన నీలీవు లెటరు కూడా మీ ఆఫీసులో  ఇచ్చాను.అందుకే నువ్వు కూడ వెళ్ళాక్కార్లేదు...  ఇవాళ మనం ఎంచక్కా వంటవాడ్ని పెట్టుకోవాలి.

సునంద  :  ( చిరునవ్వుతో  ) పెట్టుకోవాలా ? కట్తుకోవాలా....

మధు :      ఇదుగో ... ఆ వచ్చేది  ఆడో  మగో నీకేం తెలుసు...

సునంద  :  అంటే ... ఈ అక్కను సుఖ పెట్టడానికి ... ఇంకో తంటలక్కను   పెడుతున్నావన్నమాట.

మధు : వస్తారుగా ... చూద్దూగాని కూర్చో....మనం ప్రకటనిస్తే క్యూయే.....

పార్వటి జైన్ : సార్ .... సార్...

 మధు :        ఎస్.... కమిన్ ....

పార్వటి జైన్ : (ముద్దముద్దగా ) సార్...నా పేరు పార్వాటీ జైన్  పేపర్లో మీ  అడ్వర్టేజ్ మెంట్  చూసీ  వస్చాను... నాకూ చైనా కుకింగ్  అకాడమీ డిప్లొమో ఉంది . రష్యన్ ఫాస్ట్ ఫుడ్ బ్యాచులర్  డిగ్రీ  ఉంది. ట్వరలో... ఇండియన్  గౌర్నమెంట్ నాకు   డాక్టరేట్   ప్రపోజ్ చేస్తామన్నారు. ప్రస్టుతం .... హోం సైన్స్  హౌస్  కీపింగ్స్ లో పి ....హెచ్ .... డి .... చేస్తున్నాను.
మధు :   ఏం కిచిడీ ... చేస్తుందక్కా....

సునంద  : ఇంతకీ మీరేం చేస్తారమ్మా....

 పార్వటి జైన్ : ఖుకింగ్.... ఖుకింగ్  చేస్తాను... కోచింగ్ ఇస్తానూ ఖూడా...

మధు : ఏంటంటుందే ... అక్కా ....

సునంద  : అదేరా.... వంట చేస్తుందిట....

మధు : దానికీ.... డిగ్రీలు ఫైళ్ళూ ఎందుకూ....

సునంద  :  నన్నడుగుతావేం.... నువ్వేమని ప్రకటనిచ్చావో.... ఆవిడెందుకొచ్చిందో ....నువ్వే కనుక్కో..అసలేం చేస్తుందో....

మధు :    మీరు.... ఏ.... ఏ.... వంటలు చేస్తారండి

 పార్వటి జైన్ : పాముటోస్తు ..చెస్టాను... కప్పల్ ఉరగాయి.. పెదతాను.    ఈసుళ్ళు - వెపుడు   చెశ్తాను.ఇవి  నా  స్పెషల్  ఐటంస్ రోజూ  ....ఎన్నీ  కేలరీస్ పుడ్  మనిషి అవసరమో చూషి  వంటల్    ప్రిపేర్    చేశ్తాను  .

సునంద  : తింటే   నేను  చస్తానురా !  ( తమ్ముడితో )

 పార్వటి జైన్ :   చచ్చుతకు  కాదు మేడం  ...  ఆరోగ్యం  వచ్చుతకు ....
మధు :    చూడండి  పార్వతిగారు   మేము  చైనా  , రష్యా   వంటకాలు  తినము  . మాకు  ఇండియన్   వంటకాలు  చేసే  వాళ్ళేకావాలి.

 పార్వటి జైన్ :  యస్... సార్ ..... నేను  వచ్చింది  అందుకే,..ఇండియన్   గవర్నమెంట్   ప్రపోస్   చేసిన డాక్టరేట్ కై    రిసర్చి సేయాలి .  మీ ఇంత  కుక్కీంగ్  డైరెక్టరుగా  ప్రాక్టీస్  చేష్టాను.

సునంద  :  ఒరే   ....   ప్రయోగాలు   చేస్తుందిట్రా .... మన మీద

మధు : అక్కా... నువ్వు నన్ను గాభరా పెట్టకే  . చూడండి  పార్వతిగారు.....

 పార్వటి జైన్ : పార్వాటీ  ..... పార్వాటీ  .....

మధు :   అలాగే   ఏదో   ఒకటి  ......  మేము  స్వచ్ఛమైన  ఆంధ్రులం. ఆంధ్రుల  వంటకాలు మీకు  చెయ్యడం  వచ్చా !

 పార్వటి జైన్ :టెలుసు...టెలుసు... గో....గూరా ...పస్చడీ.... తోటకూ.....రా... !

మధు :   గట్టిగా అరవకండి.... వినే వాళ్ళు ఏదో అనుకుంటారు...

పార్వటి జైన్ : ఓఖే...ఓఖే.... నన్ను డ్యోటీలో  ఎప్పుడు జాయిన్ కమ్మంటారు...

సునంద  : కమ్మనరు...... పొమ్మంటారు.

పార్వటి జైన్ : ఆంఠీ ....

 సునంద  : ఆ.... నేను నీకు ఆంటీ లా కనబడుతున్నానే....

మధు :  అదికాదక్కా... అంటే అని ఆవిడుద్దేశం.

సునంద  :   ఒరేయ్ ... నాకు ఒళ్ళు కంపరమెక్కి పోతోంది... ముందు  దాన్నిక్కడనుంచి పంపించు.

పార్వటి జైన్ : మేడం... డోంట్ లూస్... యువర్ టంగ్ ...

మధు :  సారీ...సారీ.... పార్వతిగారూ... ఏమీ అనుకోకండి... మా  అక్కకి  కొంచెం కోపం ఎక్కువ... సారీ   చెపుతున్నాగా... వెళ్ళిరండి.

సునంద  : ఒరేయ్ ! మధూ ! నిన్నూ......

మధు :  అక్కా ! శాంతించూ....

సునంద  : మధూ ! తంటలక్కా... అంటే నీకు తెలుసా....

 మధు :  తెలీదు... ఎవరే  అక్కా.....

సునంద  :  ఇప్పుడొచ్చిందే... దాన్నే అంటారు.

నలభీం : ఆర్యా.....ఆర్యా.....ఆర్యా....

సునంద  : ఎవరో ... పిలుస్తున్నట్లు ఉందిరా....

మధు :  ఎవరదీ ?

నలభీం : ఆర్యా ! నన్ను నలభీం  అంటారు.

సునంద  : అంటే... నువ్వు  నలభీమ పాకం చేసి పెడతావా... నాయనా !

 మధు :  వంట వాడంటే ఇలా ఉండాలి ... చేతిలో గరిటా... ముఖం  వర్ఛస్సూ... వారే..వా.. అక్కా... దొరికాడు సరైన వంటవాడు.

 నలభీం :కౄత~~గ్0C59;0ఛ్41;డను... ఆర్యా! కౄత~~గ్0C59;0ఛ్41;డను...

 సునంద  :మధూ ! యితని   భాష  వింటున్నావా...స్వచ్చమైన  సంస్కౄతాలూ.....తత్సమాలు...ఇక మన వంటకాలేమో  కనుక్కో....

నలభీం :క్షంతవ్యుడను.... ఈ ఒక్క భాషా విషయమున మాత్రము... నన్ను క్షమింపుడు , వంటకాల విషయమున  నన్ను మించువారు లేరు...  చిన్నారి పొన్నారి చిరుత కూకటినాడు... పచియించితిన్  పలు పాక  చిత్ర విచిత్రాన్నముల్.....

మధు :  చిత్రాన్నముల్  అంటే అర్ధం చెబుతారా .... నలభీం గారూ...

నలభీం : పులగం, పులిహోరా, దద్దోజనం, చక్రపొంగలి... అను
చతుర్విధ   అన్నములని  పాకశాస్త్రం చెబుతోంది నాయనా....

సునంద  : అయిపోయాడు వీడు...

నలభీం : కాలేదింకా.... నూనూగు మీసాల నూత్న యవ్వనమునాడు, గర్మసాల  కూరలు ఘమఘమ లాడించి  ఘనుడనైతి....

మధు : అరే .... వా... నోరూరిపోతోంది.... ఈ  రోజే మీరు మా ఇంట్లో చేరిపోవాలి.

నలభీం : తప్పక చేరెదను... కాని ఈ గ్యాసుపొయ్యి స్టవ్ లు  నాకు   పనికిరావు... ఇచ్చట మూడడుగుల  గొయ్యి తవ్వించి .... కట్టెలూ వగైరా తెండు.

మధు : అవెందుకు  స్వామీ.....

సునంద  : నిన్ను పాతెయ్యాలో... దహన సంస్కారం చేయలో వారికి   బోధపడక.....

మధు : అక్కా...వాయిముడు..

సునంద  : నేను నోరు మూసుక్కూచుంటే ... వాడు ఇల్లు గుల్లచేసి  పోతాడు , నీకింకా అర్ధం కాకపోతే వాడు జీతం ఎంతిమ్మంటాడో  అడిగి చూడు.

మధు : అదీ నిజమే... చూడండి....మీరు నెలకు ఎంత జీతం తీసుకుంటారు.....

నలభీం : నేను నెలకు తీసుకోను... రోజువారీ  లెఖ్ఖ....

మధు : ఆ లెక్కేదో ... చెప్ప వయ్యా .... భీమయ్యా....

నలభీం : వందలోపు విస్తర్లకు... రెందు పూటలకూ రెండువేలు..ఆ పైన  ప్రతి విస్తరకూ....ఐదు రూపాయలు దారి ఖర్చులు మీరే  భరించాలి.

మధు : నేనేం  హోటలు పెట్టుకున్నానా.... ఈ విస్తరాకుల  లెక్కేమిటీ....   అర్ధమయ్యింది...పెళ్ళిళ్ళకు....సంతర్పణలకూ....వీడువంటవాడు.

నలభీం : ఆర్యా ! గ్రహించితిరి.... మీరు నన్ను తెలుసు కుంటిరిప్పటికి...   ఆర్యా ! ఈ రోజుకు ఎంతమందికి.

సునంద  :    ఊరందరికీ....

నలభీం : ఆ.....అంతమందికే.....

మధు :ఆర్యా ! అరెరే ... మీభాష నాకొస్తోంది...మా అక్కా పెండ్లికి  తప్పక  మిమ్మల్ని పిలుస్తాను..  ప్రస్తుతానికి దయ చేయండి...

నలభీం : ఆర్యా ! అక్కగారి పెండ్లికి  నన్ను మరిచి పోకండీ.....

మధు : వెళ్ళి రావయ్యా.... ఛీ..ఛీ.... ఈ రోజు ఎవరి ముఖం చూసానో...      తల దిమ్మెక్కి పోయింది...

సునంద  : తెలివి తక్కువ పనులు చేస్తే.... యిలాగే...ఏడుస్తాయి....నాకు   నీకు ఓ రోజు సెలవు దండుగ  కాస్త ఒళ్ళు వంచి ఎవరిపనులు  వాళ్ళు చేసుకుంటే.... మను వంటవాడూ....తంటలక్కా... ఎవరూ అక్కరలేదు.

 మధు :ఎప్పుడూ.... నా మీద విరుచుకు పడడమే గానీ..... నీ సుఖం      కోసం నేనెంత కష్టపడుతున్నానో   గమనించవు.
సునంద  : ఆ.... కనబదుతూనే వుంది సంబరం.... చూడు నాకే కష్టం  లేదుగానీ....కావాలంటే  నువ్వే అర్జంటుగా పెళ్ళి చేసుకో......  కావాలంటే.....నాన్నకు నేను రికమెండ్ చేస్తాను.

 మధు :అంత పని చేసేవు....నాన్న ఒంటికాలిమీద  లేస్తాడు...

ధర్మారావు : అమ్మాయ్ సునందా.........ఒరేయ్  మధూ.....

సునంద  : అదిగో.... మాటల్లోనే నాన్న వచ్చారు.

మధు :నీకు వెయ్యేళ్ళు ఆయిష్షు నాన్నా......

ధర్మారావు : నోర్మూయ్..... తండ్రిని నేనా ....నువ్వా.... నన్నే  దీవిస్తావురా....

మధు : అబ్బ.....బ్బే.... మాటవరసకు అంటారు కదా...అని...

ధర్మారావు : నీకుమాట - వీరగులు అంత  బాగా  తెలుసురా !  అయితే  కుండమార్పిడి సిద్ధపడు. లేకపోతే  ఈ  జన్మలో  మరి  మీ  అక్కయ్యకి  పెళ్ళి నేను  చెయ్యిలేను.

సునంద :  నాకు  తొందర  లేదు గాని  నాన్నా!  ముందు వీడి  పెళ్ళి  కానియ్యిండి  అర్జంటుగా ..... పెళ్ళి  పెళ్ళి అంటూ మహ  తొందర  పడి పోతున్నాడు.

మధు : అబ్బే....తొందరెందుకూ.....నాక్కొంచెం పనుంది...అలా వెళ్ళి వస్తాను....

ధర్మారావు : ఆగరా....ఆగు..... ఆగమన్నది నిన్నే... బంగారం లాంటి
 సంబంధం, అబ్బాయి ఎం .బి .ఏ  చేసాడు. నాగపూర్లో   ఉద్యోగం చేస్తున్నాడు... మీ అక్కయ్యకు చక్కని ఈడూ.. జోడూ... ఏమంటవ్.

మధు : బావగారికి వంటచేయడం వచ్చా....?

ధర్మారావు : అమ్మా సునందా.... ఇదేం తిక్క ప్రశ్నే... ఏమడుగుతాడో
                     అనుకుంటే వంట చేయడం వచ్చా అంటున్నాడు...
సునంద  :   నా బుర్రా...ఇలాగే తినేస్తున్నాడు... నాకు వంట చేసి పెట్టే మొగుడు రావాలని వాడి కోరిక.

ధర్మారావు : వాడి కోరికేమో గానీ.... వీడి నోటి చలవ కాబోలు...అబ్బాయి
 ఎం .బి .ఏ  చదువుకున్నా ఆ కుర్రాడు  ఇల్లు అద్దంలా  ఉంచుకున్నాడు... నేను వెళ్ళిన పూట... స్వయంగా వంట
 చేసి పెట్తాడు సుమా...

మధు : ఓ.కే... అయితే నేను పెళ్ళికి ఒప్పుకుంటున్నాను...

సునంద  :  మధూ...పెళ్ళి నాకురా..నువ్వు ఒప్పుకోవడమేంటి మధ్యలో..

ధర్మారావు : లేదమ్మా వాడే ఒప్పుకోవాలి... అతనికి ఓ చెల్లెలుంది
 అందుకని కుండమార్పిడికి అయితేనే సిద్ధపడమన్నాడు.

మధు : కుండమార్పిడా ...ఎందుకూ....

సునంద  : ఆగండి నాన్నా....వాడికి నేను చెప్తాను...మీ బావగారికి  నువ్వు వండి పెట్తాలిరా......

ధర్మారావు :ఒరేమధూ... ఆపిల్ల బ్.ఏ దువుకుంది...అందంగా ఉంటుంది .... నీ మాట  చెప్తే.....

సునంద  : నాన్నా....ఆ పిల్లకు వంట వచ్చా...

 మధు : నిజమే ...అది కనుక్కో ముందు...

ధర్మారావు : అక్కడే ఉన్నదిరా చిక్కు... ఆ పిల్లకు అంతగా వంటలు రావు   అయినా ఫరవాలేదు......

మధు :  ఫరవాలేదంటే...

ధర్మారావు : అదేరా.... ఎవరో పార్వతని .... కుకింగ్ ప్రాక్టీషనర్ దగ్గర....

మధు : ఆవిడ దగ్గరా...!

సునంద  : భేషుగ్గా  ఉంటుంది....

ధర్మారావు : ఆవిడ దగ్గరే ... వంటా వార్పూ....నేర్చుకుంటానంటోంది...
ఈ మధ్య వంట చేయడంకూడా..కోర్సుగా పెడుతున్నారటగా.

మధు : నాన్నా... వద్దొద్దు...  ఆవిడ దగ్గిర మాత్రం నేర్చుకోవద్దు....

సునంద  : వంటావార్పులకూ...కుండమార్పిడికీ.... ఇప్పటికిరా  పొంతనకుదిరింది....ఈ పెళ్ళికి నేను ఒప్పేసుకుంటున్నాను.

మధు : ఒద్దూ ...ఒద్దూ....ఒద్దూ ....!

ధర్మారావు : ఏమిటమ్మా....ఇలా అరుస్తాడు...

మధు : నీకేం తెలుసు నాన్నా .... నా బ్రతుకు  పాములటోస్టు...కప్పల
ఊరగాయి...అయిపోతుంది...అంతకన్నా, అక్క దగ్గరే వంట  నేర్చుకుని....అక్కకే వండి పెడతాను....

సునంద  : మరి అర్జంటుగా పెళ్ళిరా....

మధు : అంతకన్నా అర్జంటుగా ముందు నేను వంట నేర్చుకోవాలి...

ధర్మారావు : శుభం...మీరో ఇంటివారైతే....అన్నీ అవే వంట పడతాయ్.

29, ఆగస్టు 2012, బుధవారం

సాధ్య బిందువు- శాంతం పాపం

                                సాధ్య బిందువు- శాంతం పాపం     

   అకారాదిగ క్షకారాంతం 
అక్షరాలను వ్రాయ బూని
పదాలల్లి కదంద్రొక్కే
కవన రాశిని మూసబోస్తే (తె) 
ధ్వనించే శబ్దవారాశిగ 
పదార్ధంలో యదార్ధంగా ప్రబోధం 
చైతన్యమొందే  సిరాచుక్కే ,
బిందు వందున చిందులాడే
సింధువు - దార్శనికమై
అల్లకల్లోలాలను, ఒడ్డునుండి,
గభీర నీర సారాలలో,  గ్రుంకులిడుచు 
తరం తరం నిరంతరం  స్వాంతన లేకుండా 
తుది నాదని స్పృశించాలంటే
సింధువైన బిందు రూపము 
పొంది నపుడే అది సుసాధ్యం ?
వెసులు బాటుకు  వెర్రీ తలలై 
కుళ్ళుబోతుల లోకమాలోకమైతే 
మానవాలే తనకు తానే 
సునామీలను సృష్టించుకుంటే
- అదెప్పటికీ అసాధ్యమే ?

28, ఆగస్టు 2012, మంగళవారం

నేను(అహం)........పరాక్రి

             ఆకాశపుటంచులలో
             ఆవర్తన నర్తనచే 
             ఆశయాల రూపం మరచి 
            ఆనందపు లోతులు గరచి  , ......
            మరీచి వీచికా ఓయస్సిస్సులలో,
            దాహం కోసం వెతుకాడే నేను.... ..... .... 
            జీవితంబనెడి స్వప్న సౌధమునందున ,
            నివేసించి ,
            వశయించి ,
            శయించి ....
            భవమను రోగతిమిరమున 
           నిర్భావ భాజనమునకులోనై,
           యానించుచుంటి ......
           ఏలకో?,...
           ఎటులనో?,...
            ఎందుకో ? ......
             ఈ జీవయాత్ర....!!!!

                                                                                                               -----పరాక్రి

27, ఆగస్టు 2012, సోమవారం

మరోవేదం


                చదివాను శ్రీ శ్రీ కవిత్వం
             వదిలాను శ్రీ స్త్రీ ల మోహత్వం
             శిధిలాలయ నిర్మాణమతనిదన్నా
             సింధూర రక్త చందన కవిత్వమతనిదమన్నా,
             శిల్ప నైపుణ్యమున్న ఆర్తావనత్వం
             నర్తన మతని కవిత్వం.
             సంధ్యకెంజాయ చిన్జీకటిన్ జీల్చుకొని
             ఉదయించాడనుకున్నా,
             లేదు లేదతని ఆలస్యం ,
             అందించాడు  అమృతతుల్య సస్యం ,
             అదితిని అరవండోయ్ ఆచంద్రతారార్కం,
             వదలండోయ్ ఇకనైనా మూర్ఖత్వం,
             పిలవండోయ్ విప్లవపవన మరుని,
             కలవండోయ్ అందరు ఒక్కటిగా,
              ఐక్యం,    
              సమైక్యం,
              కార్మిక వాక్యం,
             ముఖ్యం సఖ్యం
             లౌకిక వాదం 
             నేటికిది వేదం.
                                         ----పరాక్రి

26, ఆగస్టు 2012, ఆదివారం

చాలా - ఆది-అనామికం

04/04/2011 ఖర నామ సం // ఉగాది కవిసమ్మేళనంలో పెందుర్తి శాఖా గ్రంథాలయంలో సినీకవి జాలాదితో - - - పరాక్రి .                                   
                                      
ఈ వత్సరం - తత్స్వరం
ఖర నికర , ఆగారం
నిరంతర స్వాంతన గోరె,
షడ్రుచులబానం,
నాప్రాణం-ధ్యానం
అర్ధ,యత్నాలు , స్వార్ధగానాలు , గార్ధబ భారాలు..,
ప్రతివత్సర ఫలితం తెలిసున్నా,
నాప్రయత్నం అప్రమేయం

విద్యావివేక - ముసుగుకుసుమం తో,
ప్ర క్షా ళ న గా వి స్తూ
ప వి త్రీ క రి స్తూ ,
పొంతనలేని స్వాంతన కోసం-?
ఈవత్సర తత్స్వర ‘‘ఖర” నికరంగా
పరిశ్రమిస్తా, పరిప్లవిస్తా..,
కోర్కెల కర్మాగారంలో.

25, ఆగస్టు 2012, శనివారం

శ్రీ సూక్తం            శ్రీనివసరావు అదృష్టవంతుడు
            అదేం? ...అంటారా,
            మరొకర్ని మన్నించేప్పుడు మాత్రమే
            మనం’ శ్రీ’ ని వాడతాం  
            మనకి మనం శ్రీ ని చుట్టుకోలేం గదా |
            బార్టర్ సిస్టం లో ,లా ,
            పక్కవాళ్ళిస్తేనే మనకి వస్తుంది  "శ్రీ" 
            అందుకే అన్నాను శ్రీనివాసరావు 
            అదృష్టవంతుడని ,
            పెళ్ళి శుభలేఖలో,
            శ్రీమతి ऽ శ్రీ వ్రాయు శుభలేఖార్ధములు....
            అని వ్రాసుకుంటాం.
            అది శ్రీమతి వల్ల కలిసొచ్చిన ,
            శ్రీమాత్రమే   సుమండీ....
           కుమారి -శ్రీమతి కాలేక పోయినా,
           ఒకచో
           నిరుద్యోగి గోవింద రాజులు-
           సంబోధనలో ! శ్రీ గోవిందరాజులే అవుతాడు.
           యవ్వనం లో అడుగుపెట్టిన కుర్రవాడికి,
           శ్రీ---ని పెట్టి వ్రాసిచూడండి వాడి సంబరం...
          అందుకే అన్నాను ,
          శ్రీనివాసరావు  అదృష్టవంతుడని,
          పిల్లవాడని కొట్టిపారేయకండి కాని,
          మా బుల్లి శ్రీ ను గాడికి కూడా,
          శ్రీ- అంటే ఎంత మోజో.............
          వాడి తెలుగు నోట్సుపై ....శ్రీ శ్రీను  ఐదో తరగతి,
          అని వ్రాసుకున్నాడు,
          రెండు -శ్రీ,శ్రీ- లుచూడగానే
          గత శతాబ్దపు మహాకవి స్ఫురణ కొచ్చారు,
          అందుకే అన్నాను శ్రీనివాసరావు అదృష్టవంతుడని,
         
         మా అమ్మ తిరపతిలో మొక్కుకుందట,  
         నాకు ప్రమోషన్ వస్తే ,
         ఇంటిల్లబాది వచ్చి తలో వెయ్యా హుండీలో వేస్తామని,
         తిరిగొచ్చి గుండుతడుముకుంటూ ఖర్చులు లెక్కజూస్తే
         గుండె ఆగినంత పనయ్యింది... !
         అంతా కలియుగ దైవమైన శ్రీనివాసుని మహత్యం
         అందుకే అంటాను, 
         లచ్చి ఏకాక్షరమై, లక్కు తోడైతే
         శ్రీసూక్తం పఠించే వాడు,
         శ్రీనివాసరావు అదృష్టవంతులే//

22, ఆగస్టు 2012, బుధవారం

ఆశీర్వాణి


శ్రీ  మేథా దక్షిణా మూర్తి జ్యోతిష నిలయం
contact for సన్మాన పత్రాలు - ఆశీర్వచనాలు
9966455872
                                                                          ------------    పంతుల వెంకట రాధాకృష్ణ (పరాక్రి )
                                                                                                   గ్రేడ్ వన్ తెలుగు పండిట్


8, ఆగస్టు 2012, బుధవారం

ఆశీఃగీర్వాణి


శ్రీ  మేథా దక్షిణా మూర్తి జ్యోతిష నిలయం
contact for సన్మాన పత్రాలు - ఆశీర్వచనాలు
9966455872
                                                                          ------------    పంతుల వెంకట రాధాకృష్ణ (పరాక్రి )
                                                                                                   గ్రేడ్ వన్ తెలుగు పండిట్