అక్షరాలునేర్చి ఆశ్చర్య పడునాడు - తెలుయునెంత గలదొ తెలుసుకొనగ - వింతతరగదయ్య విఙ్ఞానికెన్నడూ - అప్రమేయ వరద హరిముకుంద (పరాక్రి)

27, నవంబర్ 2013, బుధవారం

ఉపకారం - కథ

                          రాజయ్యకు ఒక గొర్రెల మంద ఉండేది. రోజూ అతను ఊరి దగ్గర ఉన్న కొండలపైకి గొర్ర్రెలను తీసుకెళ్ళి మేపేవాడు. ఓరోజు అతనికి వలలో చిక్కుకున్న ఒక గద్ద కనిపించింది. దాన్ని చూసి జాలిపడిన రాజయ్య దాన్ని వల నుండి విడిపించాడు.

కొన్ని రోజుల తరువాత, అతను ఒక రాతిగుండుపై కూర్చుని ఉండగా హఠాత్తుగా ఒక గద్ద వచ్చి, అతని టోపీని తీసుకుని ఎగిరిపోయింది. కోపంతో ఆ గద్ద వెంట పరుగెత్తసాగాడు. ఇంతలోనే అతనికి వెనుక నుండి ఒక పెద్ద శ బ్దం వినిపించింది. వెనక్కి తిరిగి చూసి, ఆశ్చర్యపోయాడు రాజయ్య. అతను పైకి లేవగానే, అప్పటిదాకా అతను కూర్చున్ను రాతి గుండు ఒక్కసారిగా లోయలో పడిపోయింది. తన ప్రాణాలు దక్కినందుకు 'హమ్మయ్య' అని ఊపిరి పీల్చుకున్నాడు రాజయ్య. హఠాత్తుగా, అదే గద్ద తన ముందుకు వచ్చి, అతని టోపీని అతని మీద విడిచిపెట్టి, మళ్ళీ పైకి ఎగిరింది. ఈ గద్ద ఒకప్పుడు తన వల నుండి విడిపించిన గద్దనేనని గ్రహించిన అతడు జంతువులు కూడా తమకు చేసిన ఉపకారం మరిచిపోవు అని తెలుసుకున్నాడు.

25, నవంబర్ 2013, సోమవారం

వానర రాజు కథ

వానర రాజు కథ

ఒకానొక కాలంలో హిమాలయా పర్వత సానువుల్లో దాదాపు ఎనభై వేల సంఖ్యగల ఒక వానరజాతి నివసించేది. వాటన్నింటికీ బలశాలి, బుద్ధిశాలియైన ఒక వానరం రాజుగా ఉండేది. అవి నివసించే లోయ పక్కనే గంగానది ప్రవహిస్తూ ఉండేది. అన్ని కాలాల్లో వాటి దాహార్తిని తీరుస్తూ, ఎండాకాలంలో చల్లదనాన్నిస్తూ జనావాసాల వైపుకు సాగిపోయేది. నది ఒడ్డునే మధురమైన ఫలాల్నిచ్చే ఒక చెట్టు ఉండేది. వసంత ఋతువు వచ్చిందంటే దాని పరిమళం ఆ లోయంతా వ్యాపించేది. ఎండాకాలం ఆ చెట్టు యొక్క దట్టమైన నీడ వానరాలన్నింటికీ ఎంతో ఆదరువు. శరదృతువు వచ్చిందంటే దాని ఘనమైన, తీయనైన పండ్లు వాటి ఆకలిని తీర్చేవి. అలా అవి ఆ చెట్టు నీడన సుఖంగా జీవనం సాగిస్తుండేవి. కానీ వానరరాజు మాత్రం ఆ పండ్లను గురించి వేరెవ్వరికీ తెలియకుండా జాగ్రత్త పడమని వాటికి చెప్పేవాడు. అలా జరిగితే మానవులంతా వచ్చి వాటిని తరిమేస్తారని వానర రాజు భయం. కాబట్టి ఆ కోతులంతా తమ ప్రభువు చెప్పినట్లు ఆ పండ్లను మానవుల చేతిలో పడకుండా కాపలా కాస్తుండేవి. చెట్టు బాగా ఏపుగా ఎదిగేసరికి బాగా పెరిగిన కొమ్మలు నదీ ప్రవాహం మీదకు వాలి ఉండేవి. రాజాజ్ఞ మేరకు ఆ కోతులు ప్రతి సంవత్సరం వసంతకాలంలో ఆ కొమ్మల్లో పూత పూయగానే వాటిని తినేసేవి. మళ్ళీ తాము ఏమైనా పూత వదిలేసి ఉంటామేమోనని వేసవిలో కూడా పండ్లు ఉన్నాయేమో మరొక్కమారు పరికించేవి. ఆ విధంగా ఏ ఒక్కపండూ నీళ్ళలో పడి జనావాసాల వైపు కొట్టుకుపోకుండా జాగ్రత్త పడేవి.
ఒకసారి కోతులు ఒక రెమ్మలో పూతను పొరబాటున వదిలేశాయి. వేసవిలో ఆ పండు కనపడకుండా ఆకులు కమ్మేశాయి. ఆ పండు బాగా పండి నదిలో పడిపోయింది. అలా కొట్టుకొని పోయి దూరంగా ఉన్న రాజు బ్రహ్మదత్తుని స్నాన ఘట్టం దగ్గర జాలర్లకు వలలో చిక్కింది. వాళ్ళు దాని పరిమాణాన్ని,పరిమళాన్ని చూసి అబ్బురపడి రాజుగారికి బహుమానంగా ఇస్తే మంచి ప్రతిఫలం దక్కుతుందన్న ఆశతో అక్కడికి తీసుకెళ్ళారు. ఆ పండు రాజుకే గాక సభికులందరికీ ప్రీతిపాత్రమైంది. వారందరికీ ఇంకా తినాలనిపించింది. బ్రహ్మదత్తుడు వెంటనే ఆ పండు ఎక్కడ నుంచి వచ్చిందో వెంటనే కనుక్కోవాల్సిందిగా ఆజ్ఞ జారీ చేశాడు.
ఆ పండు నదిలో దొరికింది కాబట్టి సైన్యాన్ని నదీ ప్రవాహానికి ఎదురుగా వెళ్ళి వెతకమన్నాడు రాజు. కొన్ని రోజులకు వాళ్ళకి ఆ చెట్టు కనిపించింది. వాళ్ళు తిరిగి వచ్చి ఆ చెట్టు ఇంకా పండ్లతోనే నిండి ఉన్నదనీ, కానీ ఒక కోతిమూక వాటిని తింటూ ఉండటం చూశామని చెప్పారు. రాజు ఆశ్చర్యపోయాడు. అంతమంచి పండ్లు కోతుల పరం కావడమా? అని ఆలోచించి ఆ కోతులన్నింటినీ చంపివేస్తే తరువాత సంవత్సరం నుంచీ ఆ పండ్లన్నీ తమకే చెందుతాయని భావించాడు. కోతులు పారిపోకుండా ఒక భటుణ్ణి ఆ చెట్టుకు కాపలా పెట్టాడు.
కొన్ని కోతులు కొమ్మల చాటు నుంచి ఈ తతంగాన్నంతా తిలకిస్తున్నాయి. అవి ఎంతో బాధతో వచ్చి వానర రాజు దగ్గర తమ గోడు వెళ్ళబోసుకున్నాయి. “మనం ఈ ఆపద నుంచి బయటపడేలా లేము. వేరే చెట్టు మీదకు వెళ్ళాలంటే చాలా దూరం. మనమంతా చనిపోతామేమో!” అన్నాయి.
వానర రాజు కొద్ది సేపు తమ పరిస్థితి గురించి ఆలోచించి ఒక పథకం వేసింది. “నేను బాగా బలిష్టంగా ఉన్నాను కాబట్టి మీకు నేను సహాయం చేస్తాను.” అన్నది.
మరుసటి రోజు ఉదయాన్నే వానర రాజు ఒక్క ఉదుటున నదికి ఇవతల ఉన్న పండ్ల చెట్టు నుంచి నదికి అవతల ఉన్న మరో వృక్షం మీదికి దూకింది. ఆ వృక్షం యొక్క బలమైన, పొడుగ్గా ఉన్న ఊడని పట్టుకుని ఒక కొన బలమైన కొమ్మకు ముడివేసింది. మరో కొన తన కాలికి ముడివేసుకొన్నది. తిరిగి పండ్ల చెట్టు మీదకు లంఘించి ఓ కొమ్మని పట్టుకొంది. కానీ రెండు చెట్ల మధ్య కట్టడానికి ఆ ఊడ పొడవు సరిపోలేదు. ఇప్పుడు తన జాతిని రక్షించడానికి ఒకే ఒక్క దారి ఉంది. అలాగే కొమ్మని పట్టుకొని మిగతా వానరాలన్నింటినీ తన మీద నుంచి దాటి మరో చెట్టు మీదకి దూకి వాటి ప్రాణాలు రక్షించుకోమని కోరింది. కొన్ని గంటల పాటు ఆ ఎనభైవేల కోతులన్నీ ఆ రాజు మీదుగా దూకి నదికి అవతలివైపుకు చేరుకున్నాయి. చివరి కోతి దాటుకుని వెళ్ళేంత వరకూ తన శక్తినంతా కూడదీసుకుని పట్టుకుని ఉన్న రాజు చివరికి బాధతో మూలుగుతూ కిందపడిపోయింది. బ్రహ్మదత్తుడు ఈ శబ్దాన్నంతటినీ విని మేల్కొని ఉన్నాడు. తన ప్రజల కోసం ఆ వానర రాజు పడ్డ తాపత్రయమంతా కళ్ళారా చూశాడు. అది కింద పడిపోగానే సేవకుల్ని నీళ్ళు, నూనె తెచ్చి దానికి సపర్యలు చేయడం ప్రారంభించాడు.
“నువ్వు మీ ప్రజలను రక్షించడం కోసం చేసిన త్యాగం అమోఘమైనది.” బ్రహ్మదత్తుడు వానరరాజును ప్రశంసించాడు.
“వాళ్ళు నాయందు నమ్మకముంచారు. కాబట్టి నేను వారిని కాపాడి తీరాలి. వాళ్ళందరూ సురక్షితంగా బయటపడ్డందుకు నాకు సంతోషంగా ఉంది. నేనిక నిశ్చింతగా చనిపోవచ్చు. కానీ రాజా! ప్రేమ మాత్రమే నిన్ను గొప్ప రాజును చేస్తుంది. అధికారం మాత్రం కాదు.” అని చెప్పి అది కన్ను మూసింది.
వానర రాజు చనిపోతూ చెప్పిన ఆ మాటలు బ్రహ్మదత్తుడు ఎన్నడూ మరిచిపోలేదు. తన జీవితాంతం దాన్ని గుర్తు పెట్టుకునే ఉన్నాడు. దానికోసం ఓ గుడి కూడా కట్టించాడు. అప్పటి నుంచి తన ప్రజలను కూడా అదే విధంగా పరిపాలిస్తూ గొప్ప కీర్తిని సంపాదించుకున్నాడు.

24, నవంబర్ 2013, ఆదివారం

పురందర దాసు కథ

పురందర దాసు కథ


                  పురందర దాసును ఆధునిక కర్ణాటక సంగీతానికి ఆద్యుడు అనవచ్చు. పుట్టుకతో ధనవంతుడూ, పిసినారి అయిన ఆయన పరమ భక్తుడు కావడం వెనుక ఆసక్తికరమైన కథ ఉంది. ఆయన మహారాష్ట్ర లోని పూనా సమీపంలో ఒక పురందరగడ్ అనే కుగ్రామంలో జన్మించాడు. ఇది అప్పట్లో విజయనగర సామ్రాజ్యంలో ఉండేది. ఆయన జన్మనామం శ్రీనివాస నాయక. వారి పూర్వీకులు వజ్రాల వ్యాపారం చేసే వారు. బాగా కలిగిన కుటుంబం. ఆయన కూడా అదే వ్యాపారంలో ప్రవేశించి బాగా ధనం సంపాదించాడు. ఆయన్ని నవకోటి నారయణుడు అని కూడా అనేవారు. అయితే మొదట్లో చాలా పిసినారిగా ఉండేవాడు. డబ్బు తప్ప వేరే ఆలోచన లేకుండా ఉండేవాడు. ఆయన భార్య పేరు సరస్వతీ భాయి. ఆమె పరమ భక్తురాలు. దయాగుణం కలది.  భర్త లోభ గుణం గురించి తెలిసినా ఏమీ చేయలేకపోయేది. ఇలా ఉండగా ఒక రోజు ఒక పేద బ్రాహ్మణుడు తన కుమారుడి ఉపనయనం కోసం ధన సహాయం చేయమని శ్రీనివాస నాయక దగ్గరకు వచ్చాడు. ఆయన్ని తర్వాత రమ్మంటూ పంపించి వేశాడు. అలా ఆ బ్రాహ్మణుని చాలా రోజులు తన చుట్టూ తిప్పుకుంటూనే ఉన్నాడు కానీ ధన సహాయం మాత్రం చేయలేదు. ఆ బ్రాహ్మణుడు కూడా పట్టు విడువకుండా అలా తిరుగుతూనే ఉన్నాడు.  ఆరు నెలలు గడిచాయి. చివరకు ఆ బ్రాహ్మణుడిని ఎలాగైనా వదిలించుకోవాలని తన దగ్గరున్న పనికిరాని రాని నాణేలన్నీ ఒక కుప్పగా పోసి అందులో అతనికి నచ్చిన ఒక నాణేన్ని తీసుకుని మళ్ళీ ఎప్పుడూ తిరిగి రావద్దని చెప్పాడు. ఆ బ్రాహ్మణుడు చేసేదేమీ లేక నిరాశతో అక్కడ్నుంచి వెనుదిరిగాడు.
వెళుతూ వెళుతూ సరస్వతి భాయి ధార్మిక గుణం గురించి తెలుసుకొని నేరుగా వాళ్ళ ఇంటికి వెళ్ళి, ఆమె భర్త తనను చాలాకాలం తిప్పుకుని చివరకు రిక్త హస్తాలతో ఎలా తిప్పిపంపాడో వివరించాడు. ఆమె ఆ పేద సుబ్రాహ్మణుడి పట్ల తన భర్త ప్రవర్తించిన తీరు విని చాలా బాధ పడింది. ఎలాగైనా ఆ బ్రాహ్మణుడికి సహాయ పడాలనుకుంది. కానీ తన భర్త అనుమతి లేకుండా అతని సొమ్ము చిల్లిగవ్వ కూడా ఇవ్వలేనంది. ఆ బ్రాహ్మణుడు కొద్దిగా ఆలోచించి “అయితే మీకు పుట్టింటి వారు ఇచ్చింది ఏదైనా ఉంటే ఇవ్వండి” అన్నాడు. అప్పుడామె తన ముక్కెర ను తీసి ఆయనకు ఇచ్చింది.
ఆ బ్రాహ్మణుడు అది తీసుకుని నేరుగా శ్రీనివాస నాయక దుకాణానికే వెళ్ళాడు. మళ్ళీ తిరిగి రావద్దన్నా ఎందుకొచ్చావంటూ ఆ బ్రాహ్మణున్ని కోప్పడ్డాడు శ్రీనివాస నాయక. ఆ బ్రాహ్మణుడు శాంతంగా “అయ్యా! నేను యాచించడానికి రాలేదు. ఇదిగో ఈ ముక్కెర తాకట్టు పెట్టి కొంత ఋణం తీసుకుందామని వచ్చాను” అన్నాడు.
ఆయన ఆ ముక్కెర చూడగానే తన భార్యదేనని గుర్తు పట్టేశాడు. ఆ బ్రాహ్మణుడిని అడిగితే అది ఎవరో దాత ఇచ్చిందని తెలిపాడు. ఆ బ్రాహ్మణుడిని మరలా రేపు రమ్మని, ఆ ముక్కెరను జాగ్రత్తగా ఇనప్పట్టె లో దాచి  ఇల్లు చేరాడు శ్రీనివాస నాయక. తన భార్యను పిలిచి ముక్కెర ఏదని అడిగాడు. ఆమె పొంతన లేని సమాధానాలు ఇచ్చేసరికి దాన్ని చూపించవలసిందిగా పట్టుబట్టాడు. ఆ పేదబ్రాహ్మణుడికి ఆమే తన ముక్కుపుడక దానం చేసి ఉంటుందని ఆయన అనుమానం.
సరస్వతీ భాయి కి కాళ్ళ కింద భూమి కదులుతున్నట్లయింది. నిజం చెబితే భర్త తన్ని ఖచ్చితంగా శిక్షిస్తాడని భయపడింది. మరో ప్రత్యామ్నాయం ఆలోచించక ఆమె ఆత్మహత్య చేసుకోవాలనుకుంది. ఒక చిన్న గ్లాసులోకి విషాన్ని ఒంపుకొని నోటి దగ్గరకు తీసుకోబోయింది. ఇక తాగబోతుండగా ఆమెకు ఆ గ్లాసులో ఏదో గల గల మని సవ్వడి వినిపించింది. కిందికి దింపి చూస్తే తను బ్రాహ్మణుడికి దానం చేసిన ముక్కెర కనిపించింది. ఆమె తన కళ్ళను తానే నమ్మలేకపోయింది. ఆమె హృదయం ఆనందంతో, కృతజ్ఞతతో నిండిపోయింది. తన ఇంట్లోని కృష్ణ విగ్రహం ముందు మోకరిల్లి దాన్ని తీసుకుని వెళ్ళి తన భర్తకు చూపించింది. దాన్ని చూసేసరికి శ్రీనివాస నాయక కు మతి పోయినంత పనైంది. అది అచ్చం తాను అంగడిలో దాచి వచ్చిన ముక్కుపుడక లాగే ఉంది.
వెంటనే ధృవీకరించుకోవడానికి తన దుకాణానికి వెళ్ళాడు. తను ఉంచిన చోట చూస్తే ఆ ముక్కుపుడక లేదు. ఆయన మాట పెగల్లేదు. తిరిగి ఇంటికి వెళ్ళి అసలేం జరిగిందో చెప్పమని భార్యను ఒత్తిడి చేశాడు. ఆమె జరిగిందంతా పూసగుచ్చినట్లు వివరించింది. ఇదంతా విన్న ఆయన మనసులో సంక్షోభం చెలరేగింది.
తీవ్ర అంతర్మథనం తర్వాత, ఆ బ్రాహ్మణుడెవరో కాదు, సాక్షాత్తూ ఆ విఠలుడే అని తెలుసుకున్నాడు. గత ఆరు నెలలుగా జరిగిన సంఘటనలన్నీ ఆయన కళ్ళముందు కదలాడాయి. ఆయన పిసినారితనం మీద, ప్రవర్తన మీద ఆయనకే అసహ్యం వేసింది. తన భార్య తన కన్నా అదృష్టవంతురాలని అనిపించింది ఆయనకు. తనకు ధనం మీద ఉన్న వ్యామోహం వల్లనే భగవంతుని ఈ విధంగా కష్ట పెట్టవలసి వచ్చిందని తలంచి  తన దగ్గరున్న సమస్త సంపదలూ భగవంతుని పేర దాన ధర్మాలు చేసేశాడు.
అప్పట్నుంచీ ఆయన శ్రీహరి పరమ భక్తుడయ్యాడు. నవకోటి నారయణుడు, నారాయణ భక్తుడైపోయాడు. బంగారు, వజ్రాల నగలతో అలంకరణతో అలంకరింపబడ్డ చేతులిప్పుడు తంబురను చేతబట్టాయి. వివిధ రకాల బంగారు హారాలతో వెలసిన మెడలో ఇప్పుడు తులసి మాలలు దర్శనమిస్తున్నాయి. తన దగ్గరకు దేహీ అని వచ్చిన అనేక మంచి యాచకులను తిప్పి పంపిన తను ఇప్పుడు ఉదర పోషణార్థం భిక్షమెత్తుతున్నాడు. నలుగురితో పాటు జన్మించి నలుగురితో పాటు మట్టిలో కలిసిపోవాల్సిన శ్రీనివాస నాయక పురందర దాసు అయ్యాడు. పుట్టిన కొన్ని శతాబ్దాల తర్వాత కూడా తన కీర్తనల ద్వారా ప్రజల నాలుకలపై నాట్యమాడుతూ ఉన్నాడు. పరసవేది స్పర్శతో రాయి కూడా బంగారమైనట్లు పరమ లోభి కూడా ఆ భగవంతుని కృపతో హరిదాసులకు ఆది గురువయ్యాడు.

11, నవంబర్ 2013, సోమవారం

హిందూమతం – ఓ పరిశీలన

హిందూమతం – ఓ పరిశీలన :- ఆరాధన అంటే? తాను నమ్మిన దైవాన్ని ప్రేమించడమే, ప్రేమించి సేవించడమే. దీనిచే భక్తి,విశ్వాసము,సేవానిరతి,మనోవికాశము కలుగుతాయి.
శో|| ఓం గణేశ గ్రహనక్షత్రాణి యోగినీ రాశిరూపిణీం |
దేవీం మంత్ర మయీం నౌమి మాతృకాం పరమేశ్వరీం ||
ప్రణవనాదము ఓం కార రూపమై గణ,ఈశ,గ్రహ,నక్షత్ర,రాశి, యోగినీ రూపమున మరియు మంత్ర , తంత్ర రూపమున ఏ మహత్తర శక్తి జగత్తునందంతటా మాతృకా రూపమై ఏకమనేక అగుచు పూర్ణమైనిండి యున్నదో ఆ పరమేశ్వరికి నమస్కరించుచున్నాను.
ఉ|| ఏమహనీయ శక్తి పరమేశ్వర బ్రహ్మముకుందులందు తా
సాముగ వర్తిలింగ పృధుశక్తి చరాచర విశ్వ వృత్తి సం
గ్రామ లయంబు సృష్టి పరి రక్షణ లొప్పగ వారు జేతురో . . . ?
నీమము తోడ నామె భువనేశ్వరి నే శరణంబు వేడెదన్ || ( స్వకీయము )
దైవీయ భావ చరిత్ర :- మానవావిర్భావముతో సమాంతరంగానే దైవీయభావము ఆవిర్భవించింది. చరిత్ర పుటల్లో మానవేతిహాసపు జాడలు తెలియవచ్చే నాటికే దైవీయభావ చరిత్ర ప్రాధమిక ప్రకరణాలు పూర్తిచేసుకుంది. పచ్చని చెట్లు… పరిమళించే పూలు, విరిసిన వెన్నెల, మేఘ మాలికల మాటున తళుక్కున మెరిసే మెరుపులు, చిక్కని చీకట్లో ఆశారేఖల్లా మిలమిల మెరిసే నక్షత్రాలు,ఇలా ఎన్నో ప్రకృతి మనోహర దృశ్యాలు అలనాటి ఆదిమానవుని- ఆహ్లాద పరచాయి-ఆశ్చర్య పరిచాయి. పరిశీలింప ఆలోచింపజేసాయి. ఊహ తెలిసిన మానవుడు ఉత్సాహవంతంగా నాటినుండి నేటి వరకు… ఆలోచిస్తూనే ఉన్నాడు. ఈ ప్రకృతి ఇలా క్రమ బద్ధంగా ఎలా ఉంది.
మండే ఎండలు,వడగాడ్పులు,పెను తుఫానులు,వానలు-వరదలు,భూకంపాలుఇలాంటి ప్రకృతి భీభత్సాలు మానవజాతిని భయకంపిత విహ్వలుని చేస్తూనే ఉన్నాయి. మొదట ప్రకృతి అందాలకు పులకించాడు ఆనందించాడు, ప్రకృతి ప్రసాదిత వస్తుసంచయ సమృద్ధికి గర్వించాడు.ప్రకృతి ప్రళయ కరాళా విలయాలకు నశించాడు కృశించాడు.ఎన్నో ఉత్పాతాలనుండి తాను రక్షణ పొందాలనే తలంపుతో ఏ కొద్ది సాధన చేసినా తన ఆలోచనామృతానికి పరవసిస్తూ సుఖించాడు. తన ఆలోచనలే పరిశీలనలకుపునాదిరాళ్ళుగా ప్రకృతినించి తెలుసుకుని వికృతిని కల్పించుకుని మురిసిపోయాడు. అదిగో ఆ ఆలోచనా భావ స్రవంతిలో భౌతిక సుఖవాదము-దైవీయభావము కవల పిల్లల్లా జన్మించాయి.
ప్రకృతి ప్రసాదిత వస్తులోహ సంచయముతో శీతోష్ణాదులనుండి రక్షించుకుని పర్ణశాలనుండి పదంతస్థుల భవనం వరకు నిర్మించుకునే సామర్ధ్యాన్ని పెంపొందించుకున్నాడు. మరో మాటలో చెప్పాలంటే ప్రకృతి ప్రసాదిత వస్తు సంచయానికి— స్థల-కాల-రూపోపయుక్తత కల్పించుకోవడామే మానవ విఙ్ఞానం భౌతికశాస్త్రంగా పరిఢవిల్లింది. శాస్త్రాన్వేషణా ధ్యేయం ప్రకృతి నుండి తనను తాను కాపాడుకోవడం,రక్షణ పొందడం,సుఖానుభూతి పొందడమే.ఐతే గొప్ప తిరకాసంతా ఇక్కడే ఉంది.ఆకలిబాధకి తట్టుకోలేక తిన్నాడు,దాహపు బాధకి తట్టుకోలేక తాగాడు, శారీరక సౌఖ్యాలకై తహతహపడి స్త్రీ పురుషులు సంగమించారు.బాధానివారణమే సౌఖ్యమని భ్రమించారు.భౌతిక వాదము ఇచ్చే సుఖము ఆధ్యాత్మిక వాదుల అంతరంగము వేరువేరై పేరుకున్న అభిప్రాయాల బేధాన్ని కల్పించాయి.మరి ఆధ్యాత్మికవాదుల భావనచూస్తే……..
ఈ ప్రకృతి ఇలా లయబద్ధంగా ఎందుకు నడుస్తోంది? దీనిని ఇలా నడిపిస్తున్న అదృశ్య శక్తి ఏది? భౌతిక శాస్త్రాలు ఎంత అభివృద్ధి పరుచుకున్న కాల పరిధిలో అవిఅరిగి విరిగి పోతున్నాయి.భౌతికశాస్త్ర వస్తు సంచయంతో పొందలేని రక్షణ ఆ అదృశ్యశక్తి నుండిపొందగలగాలని పరిశీలింప కృషిచేసారు.అదే దైవీయ భావనకు అంకురార్పణ అయ్యింది.
మానవ చరిత్రలో పలుమార్లు భౌతిక-ఆధ్యాత్మిక వాదాలు తమదే పైచేయంటూ పరుగు పందాలు తీసాయి.ఈ దైవీయ భావమే పలు దేశాల్లో అనేక మతాలుగా వెల్లివిరిసింది.కాబట్టే మానవ చరిత్రలో మతం కూడా అనేక కల్లోలాలుసృష్టించింది.రాజ్యాల స్థాపనలో మత యుద్ధాలు,కులాల కుమ్ములాటాలు కోకొల్లలు.చరిత్ర ఇలా ఎంత కాలమైనా అనంతంగా సాగుతునే ఉంటుంది.
శ్లో || స్త్రీ రూపం చింతయేత్ దేవీం – పుం రూపంవా విచింతయేత్ |
అధవా నిష్కళం ధ్యాయేత్ – సచ్చిదానంద లక్షణమ్||
ఆకార,వికార,విచార,విదూరము-లింగ,పురుష,వచన,విభక్తిఅభేధ్యము అగునది భగవత్ స్వరూపము. అట్టి సచ్చిదానందమూర్తి (భూమ) శబ్దోక్తము. నిరాకార సచ్చిదానంద స్వరూపముగా విరాట్ నర్చించుటయే మేలు అదే తపస్సు. దీనికి ఎంతో మనో ధృఢత్వము నిగ్రహము కావాలి కావున అందరూ తపస్సులు కాలేరు కదా.
మనో నిగ్రహం సాధించడానికే విగ్రహారాధన పరికల్పితమైనది. ఏ రూపూ చేని దేవునకు అనేక రూపములు, ఏ పేరూ లేని దేవునికి శతకోటి నామములు. మరలా మధ్యలో మన సంకల్పములు,మన కాల్పనికతకు తగ్గట్టు ముక్కోటి దేవతా మూర్తులు. విఘ్నములు కలుగకుండా విఘ్నేశ్వరుని పూజలు,ధనము కావాలంటూ లక్ష్మీ కుబేరులను,ఇలా మన కోర్కెలకు అనువైన దేవతలకు అనువుగా సృజింపబడిన ఆగమోక్తములు. ఐనా ప్రకృతిలో గల అణువణువునూమన హైందవ సంప్రదాయము దైవముగనే తలచినది.నమక చమక రుద్ర సూక్తములుసైతము పై భావనను ప్రకటించుచున్నవి.ఒక్క మాటలో చెప్పాలంటే హైందవ జీవన శైలిలో మిళితమై ఆధ్యాత్మికాభావము సర్వ పల్లవ పులకితము. మన్మతః సమ్మతః తత్ మతః అను భావముతో అనేక బోద్ధలు అనుయాయులు హైందవ ధర్మమున గలరు.హిందూ మతము అనుట తప్పు. హైందవ దేశమున ఎన్నియో మతములవారు తమ భావజాల సంచయమును యుగధర్మానుసారము మనుగడింప జేసిరి.

మ|| ధన తంత్రమ్మున గణ్యతన్ బడయగా తంత్రఙ్ఞుడన్ గాను, క
మ్మని మంత్రమ్ముల భక్తితో గొలువగా మంత్రఙ్ఞుడన్ గాను, నూ
తన యంత్రమ్ముల నిన్ను జేర జన శాస్త్రఙ్ఞుండనే గాను, నీ
యను రాగాంబుధి ముంచి తేల్చగదవో? అఙ్ఞుండ నన్ బ్రోవవో? (స్వకీయము)
శ్లో// నిర్గుణా సగుణా శ్చేతి – ద్వివిధా ప్రోక్తమనీషిభిః /
సగుణారాగి భిస్సేవ్యా – నిర్గుణాతు విరాగిభిః //
కామ్యులగు మానవులు సగుణ రూపమున, నిష్కాములు నిర్గుణ రూపమున భగవంతుని సేవించుచున్నారు. కామ్యాకామ్య సంకల్పమే కర్మ ముక్తి మార్గ ప్రేరకమై యున్నది.
వివిధారాధలు:- ౧. మనస్సున స్థిర సంకల్పముతో విశ్వసించుట మానసిక ఆరాధము.ఇందు భౌతికవస్తుచయము అనగా ధూప, దీప, నైవేద్యాదికములు నామమాత్రములు.
౨, వాక్కు:- భగవన్నామమును నోటితో పలుకుట భజించుట వాక్కు.ఈ ప్రక్రియనందు భజన,కీర్తన,మంత్రజపాదులు ప్రాధాన్యత వహించును.
౩. కాయము:- శరీరావయవములు కదల్చి, యోని ముద్రాదుల దాల్చి, ధూపదీప నైవేద్యములర్పించి జపతప హోమాదులు చేయుట ప్రాధాన్యత వహించును.
౪.కర్మలు:- పూజ,జపము,హోమము,తర్పణము,మార్జనము,బ్రాహ్మణ భోజనాదులనే షడంగములు నిర్వర్తించుట ప్రధానమై యుండును. మనోవాక్కాయ కర్మంబుల ప్రబల విశ్వాసముతో తాను నమ్మిన దైవమును కొల్చుటయే ఆరాధన.
ఉ|| శ్రీగిరిజా సరస్వతుల చిన్మయరూపిణి లోకమాతకున్
రాగిణి విష్ణు చేతనకు రాసవిలాస విహారలోలకున్
భాగవిభాగ రాశినత భాసిత సర్వగ్రహాది మూర్తికిన్
సాగిలి మ్రొక్కెదన్ జయము సౌఖ్యము గూర్పగ విశ్వశక్తికిన్ || (స్వకీయము)
హైందవ సాధనారాధన by
P.V.RADHAKRISHNA (PARAKRI ) CELL – 9966455872