అక్షరాలునేర్చి ఆశ్చర్య పడునాడు - తెలుయునెంత గలదొ తెలుసుకొనగ - వింతతరగదయ్య విఙ్ఞానికెన్నడూ - అప్రమేయ వరద హరిముకుంద (పరాక్రి)

29, మార్చి 2012, గురువారం

స్వాప్నిక కథనం


నా బ్రతుకు పుస్తకం - చాలా చిన్నది
పెద్దల ఆశీర్వాదం మేరకు  వంద పేజీలనుకుంటే ,
నిద్రా దేవత ఓ యాభై పేజీలు అంకితం కోరింది
అందుకే ఒక్క అక్షరం కూడా నేను వ్రాయలేదందులో
భయంలో... భ్రాంతిలో... ఉపచేతనంలో నేనుండగా 
ఆమె ఓ కలం అందించింది 
కలల కలవరింతలో... చిత్రంగా గీస్తూ వ్రాస్తున్నా

నా బ్రతుకు పుస్తకంలో మొదటి ఇరవై పేజీలూ,
నేను వ్రాసినవి కావు- నాచేత వ్రాయింప బడినవి
కానీ అప్పటికే పుస్తకం భారంగా తోచింది
చేతనోప చేతనాలలో- చంచలాత్మకంగా ( గాభరాగా )
చపల చిత్తత - సాధనోన్మత్తత - దత్త ప్రక్రియలు కాగా
కాగితపు విలువ తెలియని తొలి పేజీల్లో "నేను"
తొలి పేజీకావలవైపు - "అర్ధాంగి" రాగా 
జీవితార్ధాన్ని వెతుక్కుంటూ శ్రీకారం చుట్టాను 

రెండు పేజీలు నిండీ నిండక ముందే 
గ్రంధం ఇంత భారంగా ఉందేమిటబ్బా !
ఆలోచనాశ్చర్యంనించీ తేరి కోలుకోనే లేదు 
లోచనోపాంగములైన - జీవన భావంలో 
రెండు సిరా చుక్కలు 
తరువాత రెండు పేజీలూ నేనుగా నింపాలని 
స్ఫురింపజేసాయి , వరాల బ్రతుకు పుస్తకంలో 
ఆ రెండు పేజీలూ మరో ఇరవై పేజీలయ్యేదాకా 
ఆపై అవి రెండూ రెండు విడి గ్రంధాలు

నా గ్రంధానికి ముడి ఉంది 
విప్పి పేజీలను లెక్క గట్టాలనిపించింది
ఔను బ్రతుకు పుస్తకం చాలా చిన్నది కదా !
యాభై పేజీలు నిరక్షరాంకితం                             50
ఇరవై పేజీలు నాకు బ్రతుకు ప్రసాదించాయి          20
రెండు పేజీలే నాకు నేనుగా వ్రాసింది                      2
నలభై పేజీలు వ్రాస్తే బ్రతుకు ధన్యం                      40
తదుపరి జన్మలో నైనా పన్నెండు పేజీలు          ----------
ఇంకా వ్రాయాల్సిందే                                          112
                                                                   - 100
బ్రతుకు పుస్తకం పరిపూర్ణం చేయాలంటే             ----------
అంకితం చేసిన యాభై పేజీలలో                            -12
దేవత నడిగి పన్నెండు పేజీలు అప్పు పుచ్చుకోవాలి 
పుత్రకామేష్ఠి చేసిన దశరథుని తలుచుకుంటూ
పుష్కర కాల కాగితాలు - నాకు దత్తం చేయమని 
ఆ దేవతనర్ధిస్తున్నాను  

ఆమె పన్నెండు పేజీల ముందుమాట 
వ్రాసియిస్తే...... క్షరము కాని 
అక్షర లక్షల సంపుటిగా 
నా బ్రతుకు పుస్తకం 
చిన్నదైనా మిన్నయైనదే .
          

28, మార్చి 2012, బుధవారం

అక్షరాలా......అక్షరాలెన్ని?

                                                  అక్షరాలా.....అక్షరాలెన్ని?                                                                               

                       ఆంధ్ర భాషకు అక్షరములు 56  అని వ్యాకరణకారులు నిర్ధారించారు. అందు 16 అచ్చులు 36 హల్లులు 4 ఉభయాక్షరాలు అని తరతరాల అంతరాలలో నిక్షిప్తమైపోయినది. కాని నేటి వ్యవహారిక భాష,గ్రామ్య భాష, గ్రాంధిక భాషల వినియోగములో వాడుక భాషలో కొన్ని అక్షరాలు ఉపయోగించుటలేదు.

                              భావ గ్రహణ భావ ప్రకటనే భాష ప్రధాన లక్ష్యంగా ఉండాలనే, అధిక శ్రమ కల్గించే అనేకాక్షరాలు ఉన్న మన తెలుగు భాషలో కోన్ని అక్షరాలను ఉపయోగించుటలేదు.ఇది యదేచ్ఛగా,ఎవరి ఇష్టానుసారము వారు వ్రాయుచుండుటచే - అక్షరాలా మన అక్షరాలెన్ని? అనే ప్రశ్న చాలామంది మదిని కలచిపేస్తోంది.
                           అ నుండి క్ష వరకూ అక్షరమాలే! అని ప్రత్యక్షరాన్ని లెక్కబెడితే ఏ అక్షరాలు ఎలా మృగ్యమైనామో తెలియక తికమక పడటం పరిపాటి అయ్యింది. అచ్చులు హల్లులు గుణింత స్వరూపాలు వృత్తులు ఆవృత్తులు (అంటే దిత్వ సంయుక్తాలు) విరామ చిహ్నాలు మొత్తం అన్నీ కలిపి 28,600 పై చిలుక అక్షర సంకేతాలు విద్యార్ధి నేర్చుకోవాలని తాము  భయపడుతూ విధ్యార్ధులను భయపెడితే ఇది భూతద్దంలో చుసి భ్రమ చెందడమే అవుతుంది.
                                 1. వ తరగతి వాచకంలో లెక్కిస్తే 48 అక్షరాలు మొదటి పరిచయం చేసేలా మానసిక నిపుణులు- విద్యార్ధి స్ధాయిని దృష్టిలో ఉంచుకొని విద్యార్ధికి కొంత శ్రమ తగ్గించాలని యత్నించారు.
                                  పలుకుబడిని ఆసరాగా తీసుకొని భావ ప్రకటన చేయగలిగే అక్షరాలు నేర్చుకొన్నవాళ్ళు ఈ క్రొత్త భావనము ఇంకా జిర్ణించుకోలేక పోతున్నారు.
               మా చిన్నప్పుడు గుఱ్ఱం - నేటి గుర్రంలా లేదు. అట్లే ఋషిని - రుషిగా  వ్రాసి చూపిస్తున్నారేమిటి ? ఇట్లా వివేచించుకుంటూపోతే, మన ఉపాధ్యాయులకు సైతం  ఎన్ని  అక్షరాలు నేటి ఉపయోగంలో ఉన్నాయి ? 
అనే అంశాలు తెలిసి ఉండాలి కదా ?
                అచ్చులలో 12, హల్లులలో 35, ఉభయాక్షరాలు 2 మాత్రమే నేటి ఉపయోగంలో ఉన్నాయి. మొత్తము 49 అక్షరాలు : భావ ప్రకటనకు , భావ గ్రహణమునకు  ఉపయోగపడుతున్నాయి. 
           అచ్చులలో 4 , అనగా "ఋ, ౠ లు ఌ,ౡ" లు తప్పించబడ్డాయి. అట్లే హల్లులలో "ఱ"  బండిరాకు బదులుగా రకారమును మాత్రమే వాడుతున్నారు. నిండుసున్న, అరసున్న ,విసర్గము, పొల్లు హల్లు ఈ నాల్గింటిలో నిండుసున్న( 0),విసర్గము ( ః) మాత్రమే ఉపయోగంలో ఉన్నాయి.
    
           "క్ష"  ఏకాక్షరమా ? క క్రింద షవత్తు  వ్రాస్తే ష్ష గా పలుకు తున్నాము కదా ! లక్ష , రక్ష లాంటి పదాలను      గా వ్రాయలేమా ?
   ఇది సాధ్యం కాదు ఎందు వలన అంటే - క్ష ఏకాక్షరము కావున.
         లక్షలు పోసి కూడా కొనలేము ?   వాకలో ఈ పలుకబడిని జాగ్రత్తగా ఊహించవలసినదే. విద్యార్ధి శ్రమని  దృష్టి పథంలో ఉంచుకొని  వచ్చే  కొత్త  మార్పులకు ఆహ్వానం పలుకుదాం.

                                                             

16, మార్చి 2012, శుక్రవారం

నందన నామ వత్సర శుభాకాంక్షలతో

                      నందన మా వందనమ్
                                                                                                                                  ---  పరాక్రి
                           


                నవజీవన కవనోన్ముఖ జనులందరు-
              నీకై వేచిన ఎదురు చూచిన తరుణంలో,
              శ్రామికులు, కార్మికులు, వర్తకులు, కర్షకులు
              మినీ మనీ పర్సులు తెరిచి పిలచితిరో-
                                                         నందన నూత్న వర్షమా !
             జగదాఖిల సుఖజీవన ప్రభులందరు
             ఇది దాకిడి దోపిడి అనుకోకుండా
             లక్ష్మీ సాధకులు బోధకులు పరిశోధకులు
             ఎకానమీ పద్దులు తెరచి -నినువలచితిరో
                                                            నందనానందమా !
             ఉగాదితోనే వత్సర ఫలితం వచ్చేస్తుందా...?
             కొత్త పంచాంగ మిచ్చేస్తుందా...?
             ఐనా ప్రతివత్సర ఫలితం చెప్పేస్తున్నా...
             రాజ్యం భోజ్యం- కందాయం కనుదోయం 
                                                          అభినందన నందనమా !
            పేదవాడి పెన్నిధిలో ఉన్నతి
            పెద్దవాడి సన్నిధి లో ఉన్నది
            ప్రక్షిప్తం గా నువ్వు గన్నది
            నిమ్మళంగా గ్రక్కలేని నీమది
                                                    వందనమో నందనమా !



                          ఆనంద నందనం
                               రచన :- పంతుల జయ మహేశ్వరి

ఉ//       నందన నామ వత్సరము నవ్య గుణోప సుశోభితంబుగా
           నందరి గోర్కె దీరుటకు నాదర మొప్పగ స్వాగతింతు, నా
           నందము సౌఖ్యమున్ గలిగి నల్వురి గూడి వసంత గానముల్
           విందులు జేయుటే విమల విశ్వపు శాంతికి మంత్రమయ్యెడిన్ //

చం//      యుగమున కాదిగా మనము యోచన జేయుటనాది గాధగా
            జగమున పండుగై జనులు సల్పునుగాది, షడ్రుచుల్ వలెన్
            దగులుచు, జీవితాశలకు ధార్మిక మార్గపు మేళవింపుతో
            సుగమము జేసుకొందురిక సుందర జీవన మేటికేటికిన్ //

చం//   శుభములు గొల్పు వత్సరము, శుక్రుడు వార్షిక రాజుగాన, మీ
          కభయము నీయగా దగును యాతడె జేకొనె నైదు భారముల్
         విభవము గూర్చు నందరికి వి~గ్ౙత బెంచును , అంత మెట్లగున్ ?
         నభమున రాశి చక్రముల నాణ్యత జూడగ ముప్పులేదికన్ //   



   చం//     సుదినము నేడు నోపగిధి చోడవరంబున జేరి యందరున్
               పదములు గూర్చి వేదికను పద్యము పల్కుట కానతిచ్చు ఓ
                సదమల సాహితీ సుగుణ సార నిధాన ప్రసన్న భారతీ
                అదనుగ నెంచి పెంచు కవితామల వాణి నమస్కరించెదన్ //