అక్షరాలునేర్చి ఆశ్చర్య పడునాడు - తెలుయునెంత గలదొ తెలుసుకొనగ - వింతతరగదయ్య విఙ్ఞానికెన్నడూ - అప్రమేయ వరద హరిముకుంద (పరాక్రి)

29, సెప్టెంబర్ 2012, శనివారం

ఆకాశవాణి సమస్యాపూరణలు - 11

11. సమస్య:- "తల్లిదండ్రుల పెండ్లికి తనయులరిగె
       
       గీ ||     అరువదేడుల వారలై యమ్మ నాన్న
                ఆది దంపతులైరి  అత్యాదరమున
                షష్టిపూర్తికి తమతమ సతులతోడ
                "తల్లిదండ్రుల పెండ్లికి తనయులరిగె " ||

27, సెప్టెంబర్ 2012, గురువారం

ఆకాశవాణి సమస్యాపూరణలు - 10

10. సమస్య:- నీరు చాలక- దీపములారిపోయె"


     గీ  ||    మాచి కొండను విద్యుత్ జల మరల నుండి
              ఒడ్డివారలకు మనకు నొప్పుదలగ
              పంపిణీజేత, మిషనరీ ప్రగతి లేక
             "నీరు చాలక- దీపములారిపోయె" ||

25, సెప్టెంబర్ 2012, మంగళవారం

ఆకాశవాణి సమస్యాపూరణలు - 9

9. సమస్య:- "మీరును మీరు మీరు మరి మీరును మీరును మీరలందరున్"
 

ఉ||  చేరిరి నన్ను చూడగను చిప్పిలె నార్ద్రత నాదు కన్నులన్
     నీరది జూచి డెందమున నిర్మలభాషిత వాక్కులందు, నో
     దారుచుటంత చాలు నిది దల్పగ మీపయి మైత్రిభావమే
    "మీరును మీరు మీరు మరి మీరును మీరును మీరలందరున్" ||

22, సెప్టెంబర్ 2012, శనివారం

ఆకాశవాణి సమస్యాపూరణలు - 8

8. సమస్య:- అన్నము సున్నమాయె వదినమ్మలు వండగ తిండి నేడెటుల్" 

 ఉ ||వన్నెకు తక్కువైన మరి వండరె బాలలు కొంత ముచ్చటన్
     కన్నెలుగూడ వంటలను కమ్మగజేతురు నమ్మచూడగన్
    అన్నయ భార్యలయ్యు అహహా! యిది యేమన వచ్చునో గదా
    "అన్నము సున్నమాయె వదినమ్మలు వండగ తిండి నేడెటుల్" ||

21, సెప్టెంబర్ 2012, శుక్రవారం

ఆకాశవాణి సమస్యాపూరణలు - 7

7. సమస్య:- "మత్తునదేలు మానసము మామకభావము పల్లవింపగా

 ఉ ||   అత్తరి జూపి ఒక్కరుడు యాకసమందున చంద్రుడున్నచో
       "హత్తెరి" సూర్యుడేయనుచు అందరి గాదనె, ఒక్కడందులో
        బొత్తిగ తెల్దు నాకనియె బొంకని వాడిక ఊరుకొత్తదై
       "మత్తునదేలు మానసము మామకభావము పల్లవింపగా ||

17, సెప్టెంబర్ 2012, సోమవారం

ఆకాశవాణి సమస్యాపూరణలు - 6

6. సమస్య:- "మువ్వలు గువ్వలై మొలచె మోదము మోహన రాగమయ్యెడిన్"
ఉ|| యవ్వన శోభమీర తనయందము డెందములందు గుందగా
    అవ్వన కేకి పోకడల ఆటకు పాటకు సాటి భళా యీ
    జవ్వని నాట్యకత్తె సరసఙుల దవ్వుల చిందులాడగా
  "మువ్వలు గువ్వలై మొలచె మోదము మోహన రాగమయ్యెడిన్" ||

15, సెప్టెంబర్ 2012, శనివారం

ఆకాశవాణి సమస్యాపూరణలు -5

5. సమస్య:- పోరుట తారకాసురుని పోలిక తప్పదు ముప్పుముందటన్.


 ఉ||   హారము రోదసీ స్థలిని యబ్బురమిచ్చును దేవతాళికిన్
        పారములేని ఆకసమపారమ నంతము భాగరించుచున్
       దారులుగీచి భూజనులు దాటగనెంచుటకై మనస్యతన్
       "పోరుట తారకాసురుని పోలిక తప్పదు ముప్పుముందటన్" ||

14, సెప్టెంబర్ 2012, శుక్రవారం

ఆకాశవాణి సమస్యాపూరణలు - 4

 4. సమస్య:- "వనమున సంచరించుటకు పద్థతులుండవె యెంచి చూడగన్
  చం|| ధనమది ముఖ్యమా మనసు దారుణ హత్యకు పూంచి ప్రాణులన్
   హననము చేయుటందగదు హా ! విపరీతమె గర్భకోశులన్
   తనవశమైన ఆటవిక తత్వముగాదె నిషాద మానవా
  "వనమున సంచరించుటకు పద్థతులుండవె యెంచి చూడగన్" ||

10, సెప్టెంబర్ 2012, సోమవారం

ఆకాశవాణి సమస్యాపూరణలు - 3

                                    -:ఆకాశవాణి  సమస్యాపూరణలు:-

3. సమస్య:- హీన చరిత్రుడే జగతి హెచ్చగు గౌరవమందుచుండెడిన్

    ఉ || వానికి పాదపూజ ధనవంతుడనే కులదీపకుండుగా
       ~గ్ౙానిగ గుర్తు పండితుల మండలిలోన గుణోత్తముండుగా
       తేనెలతేట మాటయట తేకువజేత ప్రపంచ జేతయై
      "హీన చరిత్రుడే జగతి హెచ్చగు గౌరవమందుచుండెడిన్"||

7, సెప్టెంబర్ 2012, శుక్రవారం

ఆకాశవాణి సమస్యాపూరణలు - 2

          -:ఆకాశవాణి  సమస్యాపూరణలు:-

2.  సమస్య:- నిద్దుర పోవువాడు ధరణిన్ ఘనకీర్తి గడించి మించెడిన్
   

    ఉ|| విద్దెలలోన సూరుడయి వి~గ్ౙతయందు ప్రశస్తయుక్తుడై
       హద్దులు దాటిపోని ప్రభుతార్ధము కార్యవిచక్షణా క్రియన్
       ప్రొద్దుల పద్దు బద్ధమయి బోయెడివాడిల చాకచక్యతన్
       "నిద్దుర పోవువాడు ధరణిన్ ఘనకీర్తి గడించి మించెడిన్"||

5, సెప్టెంబర్ 2012, బుధవారం

ఆకాశవాణి సమస్యాపూరణలు - 1

              -:ఆకాశవాణి  సమస్యాపూరణలు:-

 1.సమస్య:- తనయులనమ్ము దండ్రుల విధమ్ములజూడ విషాద హేతువుల్

 చం|| ఘనతర వంశ వర్ధనులు  కారెమదీయ కుమారులంచు తా
      ననయము వారి పోషణకు నమ్మకముంచి మహోత్సవంబుతో
      జనకుడు రక్తమాంసములు చమ్మట చిందిల మోసగించి పో
     "తనయులనమ్ము దండ్రుల విధమ్ములజూడ విషాద హేతువుల్ " ||

4, సెప్టెంబర్ 2012, మంగళవారం

నిషిధ్ధాక్షరి:-


  శ్రీ రాంభట్ల పార్వతీశ శర్మ 
-యువ యవ ధానికి-2010  హనుమంతవాక
నిషిధ్ధాక్షరి:- పరాక్రి.
                    చెప్పుమ రవిపై కందము
                    గొప్పగ జనులందరందు కోరిన విధిలో
                    ఇప్పుడె యువయవధానీ
                    తిప్పలు బడయగ(క) సరిపడు తీరులొనర్పన్//

3, సెప్టెంబర్ 2012, సోమవారం

సమస్యాపూరణలు - 1


శ్రీ గరికపాటి వారికిచ్చిన సమస్య;-2009 

         కం/ /  ’ వేదాలారని గణింప విస్మయ మగురా "
           

   నా పూరణ:-
                                  వేదికి తెలియును పంచమ
                                  వేదంబు వరకు కరతల మోహో ఆయు
                                  ర్వేదం గూడా కలుపుచు
                                  వేదాలారని గణింప విస్మయ మగురా//


గరికిపాటి వారి పూరణ:-

నాదమ్మే వేదమ్మై
పాదము మస్తకము గలుప పంచమ వేదం
బాదిగ సంగీతముతో
వేదాలారని గణించె విస్మయమందన్

________________________________________________________________

 నా శ్రీమతి ఇచ్చిన   దత్తపది.
 2. శ్రీమతి పంతుల జయమహేశ్వరి – ఘనము, మనము, ధనము, జనము – భాగవతార్థంలో

 గరికిపాటి వారి పూరణ:-

శుకుని మహాప్రబోధనము సూనృత వృక్షము లోకరక్షకై
నికరము జేసి నీ మనము నీరజనేత్రునియందు నిల్పు దీ
పిక గొనిజూడు చిద్ఘనము వీథులలో లభియింపబోదు గో
పికలకు చిత్తరంజనము వేదము దాని నిరంజనమ్మనెన్

శ్రీగరికపాటి నరసింహారావుగారి శతావధాన సాహితీక్రతువు – విజయభావన, విజయనగరం.


1, సెప్టెంబర్ 2012, శనివారం

పరివర్తన -విద్యార్థినుల నాటకం

 
పాత్రలు (విద్యార్ధినులు) : 
     రత్నమాల ( చదువు శ్రద్ధగలది )
    ఉష  ( పాటల పిచ్చిది )
    అలక్ నంద ( బొద్దుగా ఉండే తిండిపోతు )
    కవిత  ( పేరుకు తగ్గట్టే కవిత్వాల పేరడీ రాణి )
    జాకీ ( మార్షల్ ఆర్ట్సు పై సుముఖత కలది )
    దొంగ (అవసరాల అకతాయి ) పురుష పాత్ర


  నేపధ్యం :- అది ఒక కాలేజి అమ్మాయిలు చదువు కునే స్టూడెంట్స్ రూం. కుర్రతనం కోంటెతనం పిరికితనం భయం  తొణికిసలాడే వయస్సు వారిది.  సమాజ శ్రేయస్సు కోరే సంస్కర్తలేకాదు, యువతరం కూడా మానవతా  థౄక్పధంతో  తమ మంచి మాటలతో  ఓ దొంగ మనస్సులో పరివర్తన తీసుకువచ్చిన సంఘటనకు రూపకల్పన   ఈ నాటిక.

 రత్నమాల : (గదిలోకి ప్రవేశిస్తూ ) అయ్యయ్యో ! గది తలుపులు తెరచి
వీళ్ళంతా ఎక్కడికెళ్ళిపోయారో, ఈ పుస్తకాలన్నీ ఎలా పడేసారో ,గదంతా చిందరవందర చేసేసారు. ఇది చదువు కోనే విద్యార్ధులుండే గదంటే ఎవరైనా నమ్ముతారా ? నా ఖర్మకొద్దీ ఈ రూమ్మేట్సు దొరికారు.


ఉష : ( పాడుకోంటూ )బోటనీ క్లాసు వుంది-మేటనీ ఆటవుంది -దేనికో ఓటు చెప్పరా ( ఆశ్చర్యం ప్రకటిస్తూ ) హలో....రత్నం ఎప్పుడోచ్చేవే.....
గొణుక్కుంటూ ఎవరినే ఆడిపోసుకుంటున్నావు.... ?

రత్నమాల : మిమ్మల్నే... ఇది చదువుకునే వాళ్ళుండే రూమేనంటావా ? ....పరీక్షలు ముందు పెట్టుకుని-సినీమాలకూ,షికార్లకు పోతారా ?
ఏరే  మన మిగతా మేళం.

ఉష : అబ్బ .... వస్తారులేవే... నువ్వు ఊరినుంచి  తిరిగొచ్చావంటేనే
మాకో పెద్ద  తలనొప్పి. మేమేం ఫేలౌతున్నమా... ఆడుతూ,పాడుతూ,
అంతో,ఇంతో,చదివి అలా రాసి పడేస్తే పోయేదానికి  నువ్వెంత సీరియస్
సీన్లు  సౄస్టిస్తావే..


రత్నమాల : నోరు ముసుకో  చదువంటే నవలాపారాయణం అనుకున్నవా.... సిన్సియారిటీ నేర్చుకోవే...ఊతప్పంలా  మొహం నువ్వూను.


ఉష :  చూడు ఉష మాత్రం నేను. ఊతప్పం నాది కాదు.

అలక్ నంద :ఊతప్పం  నాదీ.

ఉష : అమ్మ తిండి పోతూ  వచ్చిసేవూ  ఊతప్పమేనా ఇంకా ఏమైనా కావాలా.....


అలక్ నంద :( పాడుతూ ఇద్దరి చూట్టూ తిరుగుతూ )నాకు బజ్జీ కావాలి-నాకు బోండ కావాలి-నాకు ఐస్ క్రీం కావాలి-నాకు చాక్లెట్ కావాలి

ఉష : ( వెక్కిరింపుగా ) అడ్డమైన గడ్డి  తెచ్చుకున్నవుగా  మెక్కు


రత్నమాల : ( సిరియస్ గా ) అలక్ నంద మీకు చదువులఖ్ఖరలేదే...

కవితారాణి:  చదువు ఒక  వరం
                  ఇది  సంధ్య కాలం
                  అంటోంది మన తరం
                  ఇది  నిరం తర సత్యం

అలక్ నంద :  చచ్చాం , దీని  కవిత్వం  వినిపించి నన్ను తిండి తిననియ్యదు కాబోలు. సార్ధక  నామధేయురాలివే కవితా రాణి


కవితారాణి: కవిత్వం  ఒక అల్కెమీ  అన్నాడు  శ్రీశ్రీ...
కుక్క పిల్ల అగ్గిపుల్ల సబ్బుబిళ్ళ కాదేది కవితకనర్హం , చెప్పమంటావా తిండి మీద కవిత్వం.
రత్నమాల : అబ్బబా ! అపండర్రా మీ గోల ఇప్పడిదాక తిరిగింది చాలు
కాస్తా పుస్తకాలు తీసి ఏడవండి.
 ( అందరూ ముక్తకంఠంతో ఏడుస్తూ ఊ.....ఊ...ఊ...)
రత్నమాల : హూ.. ఆపండి నోరు ఎత్తారంటే తంతాను.
జాకీ : ( మార్షల్ క్రై చేస్తూ చేతులూపుతూ ) హా..హా..హూ...హూ...
ఉష : ( పాడుతూ, జాకీని గుద్దేస్తూ ) బంచిక్ బంచిక్ చేయి బాగా, వంటికి యోగా మంచిదేగా, లేజీగా వళ్ళు పెంచుకోక, నాజుగ్గా వుంచు తీగలాగ.
జాకీ : అయ్యో ! హా..కొంచెం నీ హేండిచ్చి లేపవే ( లేస్తూ ) రాంగ్ పొజిషన్, ఈ ఏంగిల్ లో ఊపిరి బిగబట్టకుండా మార్షల్ క్రై చేస్తూ పడితే
నడుం బెణికే ప్రమాదం వుంది. ఈ జాకీ అదౄష్టవంతురాలు, జాకీచాన్ ఫేవరెట్ కాబట్టి తౄటిలో ప్రమాదాలు తప్పోతూ ఉంటాయి...
రత్నమాల : నువ్వూ వచ్చేసావా తల్లీ ఇంక నా చదువు సాగినట్టే...
అలక్ నంద : నా బబుల్ గం సాగుతుందే...
కవితారాణి: నీ మొహం ....
                                  సాగేదీ సాగించేదీ దైవం
                                        ఈజీవితమే ఓ నాటకరంగం
                                  యవ్వనమే బ్రతుకున అందం 
                                              మన సరదాల శ్రీగంధం
రత్నమాల : ఆపుతావా నీ కవిత్వం అంత్యానుప్రాసే కవిత్వం అనుకునే నీబోటి వాళ్ళు వీధికి నలుగురుంటారు. కవిత్వం పేరుచెప్పి దెయ్యంలా
 పీడిస్తున్నావు కదే.
అలక్ నంద : అమ్మో! దెయ్యమే ( భయంగా ముఖం పెడుతూ ).
ఉష : ( దెయ్యంలా నడుస్తూ పాడుతూ ) నిను వీడని నీడను నేనే
                                                      కలగా మిగిలే కథ నేనే.
జాకీ : అబ్బా, రాత్రి పూట ఆ దెయ్యం పాటలు పాడకే, దెయ్యాల సినిమలు చూసి ఇప్పటికే భయపడి చస్తున్నాం.
అలక్ నంద : పెద్ద కరాటే ఫైటర్ నంటావ్ అంతా బడాయేనా.
కవితారాణి: పిరికి వాని మదిని బింకమీలాగురా.....విశ్వదాభిరామ విసిని కర్రా.
రత్నమాల :  ఇంక వీళ్ళాపరు ఎమర్జన్సీ పెట్తాల్సిందే .ముందు మీరంతా కూర్చోండే (సాధికారంగా ) ఈ స్టోరీ చెబుతాను నాతో పాటు కంఠస్తం చేయండి. ( ముక్త కంఠంగా అందరూ రత్నమాలను అనుకరిస్తూ ).
లాంగ్ లాంగ్ ఎగో....... లాంగ్ లాంగ్ ఎగో.....
దేర్ వజ్ ఏ కింగ్ .... దేర్ వజ్ ఏ కింగ్ ....
హీ ఈజ్ ఫాండ్ అఫ్ పేరెట్..... హీ ఈజ్ ఫాండ్ అఫ్ పేరెట్.....
గుడ్.. ఇంక అందరూ సైలెంట్ గా చదవండి......
అలక్ నంద : ఔనర్రా.. పెరటి తలుపులు వేసేరూ... ( బుగ్గలు నొక్కుకుంటూ ).
రత్నమాల :  ఆ నోరలా మిల్లాడించకపోతే వెళ్ళి వేసి రారాదూ... 
అలక్ నంద : వమ్మో.. దెయ్యముంటేనో..
రత్నమాల :(హూం..అని నిట్టూరుస్తూ)నీ వల్ల కాదుగానీ...నీపనికానీ
 తిండిపోతా. అమ్మా కవితారాణీ నువ్వెళ్ళి వేసి రారాదూ...
కవితారాణి: నాకేం భయమనుకుంటున్నావా ? ... కానీ నువ్వెందుకెళ్ళ కూడదూ....
రత్నమాల : చదువుకుంటున్నాను కదే...
కవితారాణి: నేను చదవకపోతే... కవిత్వం వ్రాసుకుంటానే.... వెళ్ళనుగాక వెళ్లను.
రత్నమాల : ఉషా... చూడవే ఎలా తప్పించుకుంటోందో.... పోనీ నువ్వెళ్ళవే....
ఉష : ( పాడుతూ ) అయ్య బాబోయ్ నేనేం చేయ్యనోయ్...
                          ఓరి దేవుడోయ్ నాకేం దారిరోయ్....
రత్నమాల : ఆహా.. నీవల్లా కాదా....
ఉష : నా వల్ల కాదుగానీ... హా....హూ.... మన జాకీని పంపుదాం.
జాకీ : అందరూ తప్పుకున్నారు ఆఖరికి నేనా దొరికాను.
రత్నమాల : ఔను నువ్వే కాస్త ధైర్యం కలదానివి వెళ్లవే....
ఉష :  వెళ్లవే....
అలక్ నంద: వెళ్లవే....
కవితారాణి:  వెళ్లవే....
జాకీ : వెళ్తాను తప్పుతుందా...హా..హూ..హా..హూ..(అంటూ వెళ్లి  మరు
నిమిషంలో తిరిగి వస్తూ...) దే...దో....దే...దో....
ఉష :  అదేంటే హా..హూ..అనడం మనేసీ... దే...దో...అంటున్నావు.
రత్నమాల : ఉండవే, అదేదో భయపడింది.
అలక్ నంద:  దెయ్యం పత్తేసిందేమో........
కవితారాణి:  దైవం ప్రకౄతి... దెయ్యం వికౄతి..
                ఈ ప్రకౄతిలో వికౄతి రూపం దెయ్యం .
అలక్ నంద: అమ్మో... ఆగవే...నాకు భయం.
జాకీ : ( తేరుకుంటూ ) దే..దే...దేయ్యం కాదర్రా...దో...దో...దొంగ.
ఎక్కడే ( అందరూ ముక్తకంఠంగా... జాకీ చెయ్యి చూపెడుతున్న దిశగా చూస్తూ )
దొంగ : ( ప్రవేసిస్తూ, గాభరా పడుతూ, చేతిలో కత్తి వణికిస్తూ ) భయపడకండి... భయపడకండి, నేనేం చేయను, నేను కొత్త దొంగను,
కాదుకాదు దొంగతనానికి కొత్తవాడ్ని... మీలా చదువుకున్న వాడినే...
నిరుద్యోగిని... మా అమ్మకు ఒంట్లో బాగోలేదు...డబ్బు కావల్సివస్తే దొంగతనానికి సిద్ధపడ్డాను.( కత్తి క్రింద పారేస్తూ ) దయచేసి అరవకండి.
కవితారాణి: చూసవా నేడు దేశంలో చదువుకున్నవాడి పరిస్థితి... ఈ నిరుద్యోగి దుస్థితి.. ఆకలేసి కేకలేసే అధోగతీ...
రత్నమాల : నోర్మూయ్.. ఉద్యోగం లేకపోతే దొంగతనం చేయ్యాలా... చదువుకున్న సంస్కారం ఇతనిలో ఏమైనా ఉందా....??? వీడు దొంగతనానికి కూడా పనికిరాడు.
ఉష : ( పాడుతూ ) ఎవరో తోడు వస్తారనీ... ఏదో మేలు చేస్తారనీ... నిజం మరచి నిదుర పోకుమా... ఎదురు చూసి మోసపోకుమా...
అలక్ నంద: చూడండి దొంగగారూ... ఎంచక్కా ఏ మిఠాయి కొట్టో...
బన్ బేకరీయో పెట్టుకోవచ్చు కదా...
జాకీ : నువ్వుండవే తిండిపోతా...ముందీ దొంగనీ పోలీసులకప్పగిద్దాం.
దొంగ : అంత పని చేయకండమ్మా.. నా తల్లి ఆరోగ్యం బాలేదు.. కనీసం
మీరు తలో వందా సాయం చేయండి.. 
అలక్ నంద: వీడెవడో... ముష్టి దొంగలా ఉన్నాడే...
రత్నమాల : ఏమయ్యా.. సిగ్గులేదూ...కష్టపడి పనిచేసుకోలేవూ...
ఇంత భయస్తుడివి..ఈ పనికెందుకు పూనుకున్నావ్..
దొంగ : మా పరిస్థితి మీరర్ధం చేసుకోవాలి.. యం.బియ్యే చదువుకున్నాను.. పెద్దపని రాదు... చిన్నపని లేదు...
రత్నమాల : అబద్ధం.... నీకు పనిచేయడానికే బద్ధకం....
దొంగ : ఏం....చెయ్యమంటారో చెప్పండి...
( అందరూ ) మేం చెప్పింది చేస్తావా.... 
దొంగ :  డబ్బులిస్తారా... ఒక్కొక్కరూ చెప్పండి చేసి పెడతాను...
కవితారాణి: (ఆట పట్టిస్తూ) నా కవిత్వం విని...ఆ మాటలప్పచెబితే నీకు
వందరూపాయలిస్తాను... విను...
      సుందర మందమంద శిత సాంద్రము నైనను స్తుత శీతలా
      నంద మరంద మాధురికి నాందిగ పుష్ప లతాశ్రితానమై
     పొందుగ నందునిందు పరువొందెడు వాయువు మాలలందునన్
     జెందెగ గంధవాసనలు జెందును యందరి ముందుముందరన్// 
దొంగ : అమ్మో.. ఇన్ని...ం...దా..లే , మీ వందకో నమస్కారం ....
అలక్ నంద: ( కవితని వెనక్కి పొమ్మని సైగ చేస్తూ ముందడుగేసి) చూడండి దొంగగారూ... కాఫీలో బోర్నవీటా... టీలో హార్లిక్స్...అవి రెండూ కలిపిన గ్లాసులో నిమ్మకాయ రసం పిండి ఉప్పూ కారం  కలిపిస్తే  తాగిపెడతారా....
దొంగ : ఏంటమ్మా... కాఫీలో బోర్నవీటావా... టీలో హార్లిక్సా... నిమ్మకాయ రసం ఉప్పూకారం పిండుతావా...ఏం అర్ధం కావటం లేదు,
నేను తాగాలా... మరలా ఇంటికెళతానా...వద్దమ్మా..వద్దు నీ వందకో దండం...
ఉష :  పోనీ నాతో అంత్యాక్షరీ ఆడగలవా... ఏసినిమాలో ఏ పాటుందో చెప్పగలవా....
జాకీ : పోనీ భరతనాట్యంలో బ్రేక్ డేన్స్... కూచిపూడిలో డిస్కో.... జాకీచాన్ ఫైట్సూ రీమిక్స్ చేయగలవా....
 దొంగ : వామ్మో...వామ్మో... ( అంటూ కింద పడిపోతాడు )
రత్నమాల : చూసారర్రా... మీ ఆగడాలకు ఎలా పడిపోయాడో....
ఇక చస్తే జీవితంలో దొంగతనానికి పోడు...
అలక్ నంద:  చచ్చి పోయాడేమో... దెయ్యమైపోతాడేమో.... నేనెళిపోతాను  బాబూ...
కవితారాణి: ..... ఆగవే నేనూ వస్తానూ....
ఉష : పోలీసులొచ్చారంటే అందరమూ ఇరుక్కుపోతాం....పదవే జాకీ...
జాకీ : పాపం దెయ్యమైపోతాడేమో...  పదవే...పదవే....
రత్నమాల : ( వెళిపోతూన్న వారిని చూస్తూ ) మనుషుల్ని పీక్కుతినే మీకంటే దెయ్యాలెవరూ... మీ మాటలకు పాపం కళ్ళుతిరిగి పడిపోయినట్టున్నాడు.... ( అంటూ.. జగ్గులో నీళ్ళు చిలకరిస్తుంది )
దొంగ :(లేస్తూనే ) అమ్మా... ఈ పోటీలు నేను భరించలేను పారిపోతాను
( ఆ ప్రయత్నంలో )
రత్నమాల : ఆగుబాబూ... చాలా అవసరంలో ఉన్నట్లున్నావు... ఇంద
ఈ డబ్బు తీసుకో... మనిషన్నవాడు దొరలా బతకాలి కానీ... దొంగలా మారకూదదు...
దొంగ : ఉంటారమ్మా...ఉంటారు...మనుషుల్లో కూడా దేవతలుంటారు..
అనడనికి మీరే నిదర్శనం... నాక్కావల్సింది డబ్బేకాదు... మీలాటి మంచి మనుషుల మంచిమాట... వజ్రాల మూట...వస్తానమ్మా... నాకు మంచి పరివర్తన కలిగింది.

                              ----------  పరాక్రి