అక్షరాలునేర్చి ఆశ్చర్య పడునాడు - తెలుయునెంత గలదొ తెలుసుకొనగ - వింతతరగదయ్య విఙ్ఞానికెన్నడూ - అప్రమేయ వరద హరిముకుంద (పరాక్రి)

1, జూన్ 2013, శనివారం

పదనిసలు - 2



                                                        పదనిసలు - 2
                దైనందిన భాగంగా  వార్తా పత్రిక చూస్తున్నాను, దిన ఫలంలో చిన్ననాటి మిత్రుల కలయిక అని వ్రాసి వుంది. ఇప్పుడెవరొస్తారబ్బా నాతో చదువుకున్న వారంతా ఎక్కడున్నారో, ఏం చేస్తున్నారో, కొంతమందినైతే నేను గుర్తు పట్టలేను కూడా. నాలాగే ఏదో ఒకటి వ్రాయాలి గనక దిన ఫలితాలు వ్రాస్తారుగానీ వ్రాసిన ప్రతీదీ జరుగుతుందా, ఊసుపోక చదువుకోవడం గానీ అసలు పేపరంటేనే కాలక్షేపం కబుర్లైపోయాయి.

అయ్యో పేజీ తిప్పేయకండినా రాశి నేనింకా చదవలేదు. అన్న మాశ్రీమతి మాటలతో నెట్ న్యూస్ లో బేక్ పేజీకి వచ్చాను.

 నాలాటి పిచ్చోళ్ళుంటారు కాబట్టే పేపర్లలో అక్కరలేని హంగామా అంతా అయినా అదేమిటో కానీ ఏరోజు పేపరు ఆరోజు కూలంకషంగా చదివేస్తేనే గానీ మనసుండబట్టదు. ఒకచో సర్వర్ డౌనయితే చాలు పేపరు చదవడానికి మళ్ళీ టైం దొరక్క గోగులమ్మ మీద సంస్కృత భాషా ప్రశంసా వాక్యాలు పలికేస్తూ నెట్ కట్టేసి పనిగట్టుకుని బయటకు పోయేవాణ్ణి.

 నాపిచ్చి నీకూ అబ్బినట్టుందే చదివేసుకో తల్లీ అక్షర సత్యాలు అంటూ ఉండగానేనాచిన్ననాటి మిత్రుడు కామేశ్వరరావు లోపలికొచ్చాడు. వాడికేసి మాఆవిడకేసి కళ్లు తిప్పుతూ నాలో ఆశ్చర్యాన్ని అదుపు పట్టాను.

" ఏరా బావున్నావా ! " 
 కామేశం  పలకరింపు అలా అనిపించలా గుర్తించాడో ఏమో, మరో అడుగు ముందుకేసి నిన్న ఆంధ్రభూమిలో నీకథ చూసాన్రా అన్నాడో లేదో నాలో అటెన్షన్ మా శ్రీమతి తప్పకుండా గుర్తించింది. కాక పోతే అప్పుడే కరంటు పోయింది. అదేం కష్టంగా తోచలా చిన్ననాటి మిత్రుడొచ్చాడుగా  కాలక్షేపానికి.

 మా ఆవిడ కాఫీ కలపడానికి కామోసు వంటింట్లో దూరింది. ఆదివారం కావడం కరంటు పోవడంతో రెండు గంటలైనా కరంటు ఎప్పుడొచ్చిందో కూడా గుర్తించకుండా ఒకటే పిచ్చాపాటీ.

                   ఇరవై ఐదేళ్లక్రితం కామేశం నేను విజయనగరంలో ఉపాధ్యాయులుగా పనిచేసేవాళ్ళం

 వాడు వెళ్ళి అరగంటైనా మళ్ళీ ఆముచ్చట్లన్నీ కందిరీగలా దొలిచేస్తూ మా ఆవిణ్ణి శ్రోతగా వాడుకున్నాను. కానీ నా అతిశయోక్తులకు అడ్డంకి పడ్దాది.

 చూడండి, కామేశం మీరూ మిత్రులే కాదన్ను కానీ మిమ్మల్ని చూడ్డానికేం అతనొచ్చీలేదు, ఊళ్ళో ఎవరిదో పెళ్ళుంది గనుక పన్లోపనిగా అతని దర్శనభాగ్యం మీకు కల్పించాడు,  

       ఇప్పుడు నేను శ్రోతనవుతున్నానన్న విషయం మరిచి పోయి ఆవిడకో పదినిముషాలు కేటాయించాను,

 ఏమిటీ దినఫలితాలు కాలక్షేపం కబుర్లా, లేక అక్షర సత్యాలని ఒప్పుకుంటారా, నేనా ప్రశ్నకు సమాధానపడి తేరుకునే లోపు మరో బాంబు నామీద విసిరింది. మీ ఫ్రెండు బాగా ఉపదేశం చేసాడండి, అద్వితీయంగా వ్రాయాలట, అబ్రప్ట్ ఓపినింగ్ కావాలట,  చెవులొగ్గి    డూడూ బసవన్నలా మీరు వింటుంటే నాకెంత ముచ్చటేసిందో,

  మొన్నటికి మొన్న మీ కొలీగ్ జ్యోతిగారొచ్చి సరిగమలు వదిలేసి పదనిసలు పట్తుకున్నారంది, తగుదునమ్మా అంటూ పదనిసల ధారావాహిక  మీరు ప్రారంభించేసారు. ఇది రెండో రోజుకదా యిక అద్వితీయంగా వ్రాయండి

                 అహం దెబ్బతిన్న నేను క్షణికావేశంలోనే చూడు జయా నేను వృత్తిరీత్యా ఉపాధ్యాయుణ్ణి, ద్వితీయ విఘ్నం లేకుండా రెండుమీదే రెండుతోనే రెండుగా .........  
 చెప్పండి...చెప్పండి,
 మీ కాలక్షేపం కబుర్లు చూడడానికి ఎందరో నెట్ జనులు సిద్ధంగానే ఉంటారు
 మీరే అన్నారుగా ఇవాళ చస్తే రేపు రెండు అని, ఒకటి భోక్తవ్యమైనప్పుడు రెండోది అద్వితీయం కాకుండా ఉంటుందా, మళ్ళీ నేను చెప్పానని వ్రాసారు
 అయినా మీధోరణి మీది

 నాలోని కథకుడు అద్దం పెంకు మీద గాజుపూసలా అల్లల్లాడిపోతున్నాడు
                       
                                                                       - మళ్లీ కలుస్తా.