మన వస్తాదు పని మూడు పువ్వులు ఆరు కాయలు గా ఉంది.రాజు గారితో కూడా స్నేహం బాగా ముదరడంతో రాచకార్యల లోను మంచి ప్రధాన్యత లభించింది. ఓ రోజు మంతనాలాడుతు అశ్వ శాలకు తీసుకొచ్చి రాజు ఇలా అన్నాడు. నూటికి వస్తాదు గారూ పక్క రాజ్యపు రాజు మన మీద కత్తికట్టాడు. యుద్ధానికి సిద్ధం కమ్మన్నాడు నేను వేగులను పంపి తెలుసు కున్న విషయమేమిటంటే అశ్వ గజ పదాతి దళాలు అన్నీ అతనితో సమానంగా ఉన్నాయి. కాక పోతే పదాతి దళంలో ఓ యాభై మంది తక్కువ కాని వంద మంది పెట్టు మీరున్నారుగా ........కావున మీకు కావలసిన గుర్రాన్ని మీరు ఎంపిక చేసుకోండి. యుద్ధానికి తరలి వెళదాం.
ఇరకాటకంలో పడిన వస్తాదు చప్పున ఓ కుంటి గుర్రాన్ని ఎంచుకొని తాను నక్కచ్చు కదా ! అని భావించాడు. యుద్ధం అనే మాట వినగానే రాజు గారి పంచకళ్యాణి నేలను థాటించి కాలుదువ్వుతూ రాజుగారికేసి వస్తాదుకేసి ఉరిమి చూసింది. అది కుంటిగుర్రమనుకున్నాడు మన వస్తాదు. రాజా! ఈ గుర్రాన్నిప్పించండి. రాజు వస్తాదు సమయస్ఫూర్తికి అభినందిస్తూ సెహభాష్ ! నా గుర్రాన్నే ఎంచుకున్నారు. మన సైన్యాధ్యక్షుడితో పాటు ముందుండి వ్యూహరచన చేస్తూ సైన్యాన్ని నడిపించండి. నేను గజదళాన్ని నా అంబారీపై ఎక్కి వస్తూ నడిపిస్తాను. కానీ తమరు పదాతి దళంపై దృష్టిపెట్టి ఉండండి. రాజు మాటలకు ఏమనాలో తోచక మనకి విజయం తథ్యం అంటూ గుర్రాన్ని ఇంటికి తోలుకు పోయాడు.
భార్యతో "నేను భారీ విగ్రహాన్నైతే పెంచానుగానీ కనీసం ఈ గుర్రాన్ని స్వారీ చేయగలనంటావా" అంటూ దానిపై ఎక్కి కళ్ళెం పట్టుకుని ఎందుకైనా మంచిది ఈ గుర్రం పైనుండి పడిపోకుండా దీని జీనుతో పెద్ద చాంతాళ్ళేసి గట్టిగా నా కాళ్ళు కట్టు అన్నాడు. అబ్బో మీ బుర్ర బాగా పెరిగిందండీ అంటూ అభినందించి కదనరంగానికి సాగనంపింది ఆ కాంతామణి.
సుశిక్షితమైన గుర్రం అశ్వబలాలన్నీ వచ్చి చేరేదాకా మెల్లగా నడుస్తూ సైనికుల హాహాకారాలను అశ్వ హేషలను వింటున్నకొద్దీ తన వేగాన్ని పెంచింది. భయం కొద్దీ కళ్ళాన్ని బిగించి పట్టుకుంటున్నాడ వస్తాదు. కళ్ళెం బిగించిన కొద్దీ గుర్రం దూసుకు పోతోంది. అశ్వసైన్యాలన్నీ ఆమడ దూరంలో గోచరిస్తూండగా దారీ తెన్నూ లేక అశ్వ హృదయాన్ని అర్థం చేసుకోలేక తాను జీనుకు కట్టుకున్న కట్లే ప్రతిబంధకాలుగా తయారవడంతో దారిలో ఎదురుగా కనబడ్డ ఓ రెండు పెద్ద తాటి చెట్లను కావలించుకున్నాడు వస్తాదు. గుర్రంకూడా కదలలేని స్థితిలో గింజుకుంటూంటే రెండు చంకల్లో తాటి చెట్లను సమూలంగా ఊడబెరికి మరీ గుర్రం తన పరుగు లంఘించింది.
శతృసైన్యం దగ్గర పడుతోంది. చంకల్లో తాటి చెట్లతో ఆఘమేఘాల మీద దూసుకొస్తున్నాడు వస్తాదు. ఎదిరి సైన్యాలలో ఓ కలకలం. ఎవడ్రా వీడు యుద్ధానికి కత్తట్టుకొస్తారు, కర్రట్టుకొస్తారు. వీడేంట్రా బాబు ఏకంగా తాట చెట్లతో వస్తున్నాడు.
ఛస్తాం రోయ్! నూటికొస్తాదంటే వీడే కామోసు మొదటి వరస వందమందికీ మూడినట్టే అంటూ వెనక్కి పరుగు తీసారు. మిగతా వారూ అదే భయంతో వెనకడుగే వేసారు. సైన్యం మొత్తం ఇట్లా తిరోగమనంతో వెనిదీయడంతో వాళ్ళ రాజ్య సరిహద్దులనే వాళ్ళు దాటిపోయారు. ఏం జరిగిందో ?.... జరుగుతోందో గ్రహించని నూటికొస్తాదు గుర్ర నురగలు కక్కుతూ కుప్పకూలిపోవడంతో ఆ నాటి యుద్ధం పరిసమప్తమైంది.
ఆ రాజ్యానికి నూటికొస్తాదే రాజ్య ప్రతినిధి అయ్యాడు.
ఇప్పుడు చెప్పండి మాస్టారూ! యెర్రని యేగానీకి కూడా ఠికానా లేనోడు అదృష్టవంతుడైతే చాలు అందలాలెక్కేస్తాడు. రహీమ్ మాటలతో సాలోచనలో పడి మరి అమాయకుడైతే అందరికీ కష్టాలు నష్టాలు తెచ్చిపెట్టడా ????
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి