వానర రాజు కథ
ఒకానొక కాలంలో హిమాలయా పర్వత సానువుల్లో దాదాపు ఎనభై వేల సంఖ్యగల ఒక
వానరజాతి నివసించేది. వాటన్నింటికీ బలశాలి, బుద్ధిశాలియైన ఒక వానరం రాజుగా
ఉండేది. అవి నివసించే లోయ పక్కనే గంగానది ప్రవహిస్తూ ఉండేది. అన్ని
కాలాల్లో వాటి దాహార్తిని తీరుస్తూ, ఎండాకాలంలో చల్లదనాన్నిస్తూ జనావాసాల
వైపుకు సాగిపోయేది. నది ఒడ్డునే మధురమైన ఫలాల్నిచ్చే ఒక చెట్టు ఉండేది.
వసంత ఋతువు వచ్చిందంటే దాని పరిమళం ఆ లోయంతా వ్యాపించేది. ఎండాకాలం ఆ
చెట్టు యొక్క దట్టమైన నీడ వానరాలన్నింటికీ ఎంతో ఆదరువు. శరదృతువు
వచ్చిందంటే దాని ఘనమైన, తీయనైన పండ్లు వాటి ఆకలిని తీర్చేవి. అలా అవి ఆ
చెట్టు నీడన సుఖంగా జీవనం సాగిస్తుండేవి.
కానీ వానరరాజు మాత్రం ఆ పండ్లను గురించి వేరెవ్వరికీ తెలియకుండా
జాగ్రత్త పడమని వాటికి చెప్పేవాడు. అలా జరిగితే మానవులంతా వచ్చి వాటిని
తరిమేస్తారని వానర రాజు భయం. కాబట్టి ఆ కోతులంతా తమ ప్రభువు చెప్పినట్లు ఆ
పండ్లను మానవుల చేతిలో పడకుండా కాపలా కాస్తుండేవి. చెట్టు బాగా ఏపుగా
ఎదిగేసరికి బాగా పెరిగిన కొమ్మలు నదీ ప్రవాహం మీదకు వాలి ఉండేవి. రాజాజ్ఞ
మేరకు ఆ కోతులు ప్రతి సంవత్సరం వసంతకాలంలో ఆ కొమ్మల్లో పూత పూయగానే వాటిని
తినేసేవి. మళ్ళీ తాము ఏమైనా పూత వదిలేసి ఉంటామేమోనని వేసవిలో కూడా పండ్లు
ఉన్నాయేమో మరొక్కమారు పరికించేవి. ఆ విధంగా ఏ ఒక్కపండూ నీళ్ళలో పడి
జనావాసాల వైపు కొట్టుకుపోకుండా జాగ్రత్త పడేవి.
ఒకసారి కోతులు ఒక రెమ్మలో పూతను పొరబాటున వదిలేశాయి. వేసవిలో ఆ పండు
కనపడకుండా ఆకులు కమ్మేశాయి. ఆ పండు బాగా పండి నదిలో పడిపోయింది. అలా
కొట్టుకొని పోయి దూరంగా ఉన్న రాజు బ్రహ్మదత్తుని స్నాన ఘట్టం దగ్గర
జాలర్లకు వలలో చిక్కింది. వాళ్ళు దాని పరిమాణాన్ని,పరిమళాన్ని చూసి
అబ్బురపడి రాజుగారికి బహుమానంగా ఇస్తే మంచి ప్రతిఫలం దక్కుతుందన్న ఆశతో
అక్కడికి తీసుకెళ్ళారు. ఆ పండు రాజుకే గాక సభికులందరికీ ప్రీతిపాత్రమైంది.
వారందరికీ ఇంకా తినాలనిపించింది. బ్రహ్మదత్తుడు వెంటనే ఆ పండు ఎక్కడ నుంచి
వచ్చిందో వెంటనే కనుక్కోవాల్సిందిగా ఆజ్ఞ జారీ చేశాడు.
ఆ పండు నదిలో దొరికింది కాబట్టి సైన్యాన్ని నదీ ప్రవాహానికి ఎదురుగా
వెళ్ళి వెతకమన్నాడు రాజు. కొన్ని రోజులకు వాళ్ళకి ఆ చెట్టు కనిపించింది.
వాళ్ళు తిరిగి వచ్చి ఆ చెట్టు ఇంకా పండ్లతోనే నిండి ఉన్నదనీ, కానీ ఒక
కోతిమూక వాటిని తింటూ ఉండటం చూశామని చెప్పారు. రాజు ఆశ్చర్యపోయాడు. అంతమంచి
పండ్లు కోతుల పరం కావడమా? అని ఆలోచించి ఆ కోతులన్నింటినీ చంపివేస్తే
తరువాత సంవత్సరం నుంచీ ఆ పండ్లన్నీ తమకే చెందుతాయని భావించాడు. కోతులు
పారిపోకుండా ఒక భటుణ్ణి ఆ చెట్టుకు కాపలా పెట్టాడు.
కొన్ని కోతులు కొమ్మల చాటు నుంచి ఈ తతంగాన్నంతా తిలకిస్తున్నాయి. అవి
ఎంతో బాధతో వచ్చి వానర రాజు దగ్గర తమ గోడు వెళ్ళబోసుకున్నాయి. “మనం ఈ ఆపద
నుంచి బయటపడేలా లేము. వేరే చెట్టు మీదకు వెళ్ళాలంటే చాలా దూరం. మనమంతా
చనిపోతామేమో!” అన్నాయి.
వానర రాజు కొద్ది సేపు తమ పరిస్థితి గురించి ఆలోచించి ఒక పథకం వేసింది.
“నేను బాగా బలిష్టంగా ఉన్నాను కాబట్టి మీకు నేను సహాయం చేస్తాను.” అన్నది.
మరుసటి రోజు ఉదయాన్నే వానర రాజు ఒక్క ఉదుటున నదికి ఇవతల ఉన్న పండ్ల
చెట్టు నుంచి నదికి అవతల ఉన్న మరో వృక్షం మీదికి దూకింది. ఆ వృక్షం యొక్క
బలమైన, పొడుగ్గా ఉన్న ఊడని పట్టుకుని ఒక కొన బలమైన కొమ్మకు ముడివేసింది.
మరో కొన తన కాలికి ముడివేసుకొన్నది. తిరిగి పండ్ల చెట్టు మీదకు లంఘించి ఓ
కొమ్మని పట్టుకొంది. కానీ రెండు చెట్ల మధ్య కట్టడానికి ఆ ఊడ పొడవు
సరిపోలేదు. ఇప్పుడు తన జాతిని రక్షించడానికి ఒకే ఒక్క దారి ఉంది. అలాగే
కొమ్మని పట్టుకొని మిగతా వానరాలన్నింటినీ తన మీద నుంచి దాటి మరో చెట్టు
మీదకి దూకి వాటి ప్రాణాలు రక్షించుకోమని కోరింది. కొన్ని గంటల పాటు ఆ
ఎనభైవేల కోతులన్నీ ఆ రాజు మీదుగా దూకి నదికి అవతలివైపుకు చేరుకున్నాయి.
చివరి కోతి దాటుకుని వెళ్ళేంత వరకూ తన శక్తినంతా కూడదీసుకుని పట్టుకుని
ఉన్న రాజు చివరికి బాధతో మూలుగుతూ కిందపడిపోయింది. బ్రహ్మదత్తుడు ఈ
శబ్దాన్నంతటినీ విని మేల్కొని ఉన్నాడు. తన ప్రజల కోసం ఆ వానర రాజు పడ్డ
తాపత్రయమంతా కళ్ళారా చూశాడు. అది కింద పడిపోగానే సేవకుల్ని నీళ్ళు, నూనె
తెచ్చి దానికి సపర్యలు చేయడం ప్రారంభించాడు.
“నువ్వు మీ ప్రజలను రక్షించడం కోసం చేసిన త్యాగం అమోఘమైనది.” బ్రహ్మదత్తుడు వానరరాజును ప్రశంసించాడు.
“వాళ్ళు నాయందు నమ్మకముంచారు. కాబట్టి నేను వారిని కాపాడి తీరాలి.
వాళ్ళందరూ సురక్షితంగా బయటపడ్డందుకు నాకు సంతోషంగా ఉంది. నేనిక నిశ్చింతగా
చనిపోవచ్చు. కానీ రాజా! ప్రేమ మాత్రమే నిన్ను గొప్ప రాజును చేస్తుంది.
అధికారం మాత్రం కాదు.” అని చెప్పి అది కన్ను మూసింది.
వానర రాజు చనిపోతూ చెప్పిన ఆ మాటలు బ్రహ్మదత్తుడు ఎన్నడూ మరిచిపోలేదు.
తన జీవితాంతం దాన్ని గుర్తు పెట్టుకునే ఉన్నాడు. దానికోసం ఓ గుడి కూడా
కట్టించాడు. అప్పటి నుంచి తన ప్రజలను కూడా అదే విధంగా పరిపాలిస్తూ గొప్ప
కీర్తిని సంపాదించుకున్నాడు.
కధ, నీతి చాలా మనోరంజకంగా వున్నాయి - చాలా సంతోషం ...కొడవంటి
రిప్లయితొలగించండి