అక్షరాలునేర్చి ఆశ్చర్య పడునాడు - తెలుయునెంత గలదొ తెలుసుకొనగ - వింతతరగదయ్య విఙ్ఞానికెన్నడూ - అప్రమేయ వరద హరిముకుంద (పరాక్రి)

29, మార్చి 2012, గురువారం

స్వాప్నిక కథనం


నా బ్రతుకు పుస్తకం - చాలా చిన్నది
పెద్దల ఆశీర్వాదం మేరకు  వంద పేజీలనుకుంటే ,
నిద్రా దేవత ఓ యాభై పేజీలు అంకితం కోరింది
అందుకే ఒక్క అక్షరం కూడా నేను వ్రాయలేదందులో
భయంలో... భ్రాంతిలో... ఉపచేతనంలో నేనుండగా 
ఆమె ఓ కలం అందించింది 
కలల కలవరింతలో... చిత్రంగా గీస్తూ వ్రాస్తున్నా

నా బ్రతుకు పుస్తకంలో మొదటి ఇరవై పేజీలూ,
నేను వ్రాసినవి కావు- నాచేత వ్రాయింప బడినవి
కానీ అప్పటికే పుస్తకం భారంగా తోచింది
చేతనోప చేతనాలలో- చంచలాత్మకంగా ( గాభరాగా )
చపల చిత్తత - సాధనోన్మత్తత - దత్త ప్రక్రియలు కాగా
కాగితపు విలువ తెలియని తొలి పేజీల్లో "నేను"
తొలి పేజీకావలవైపు - "అర్ధాంగి" రాగా 
జీవితార్ధాన్ని వెతుక్కుంటూ శ్రీకారం చుట్టాను 

రెండు పేజీలు నిండీ నిండక ముందే 
గ్రంధం ఇంత భారంగా ఉందేమిటబ్బా !
ఆలోచనాశ్చర్యంనించీ తేరి కోలుకోనే లేదు 
లోచనోపాంగములైన - జీవన భావంలో 
రెండు సిరా చుక్కలు 
తరువాత రెండు పేజీలూ నేనుగా నింపాలని 
స్ఫురింపజేసాయి , వరాల బ్రతుకు పుస్తకంలో 
ఆ రెండు పేజీలూ మరో ఇరవై పేజీలయ్యేదాకా 
ఆపై అవి రెండూ రెండు విడి గ్రంధాలు

నా గ్రంధానికి ముడి ఉంది 
విప్పి పేజీలను లెక్క గట్టాలనిపించింది
ఔను బ్రతుకు పుస్తకం చాలా చిన్నది కదా !
యాభై పేజీలు నిరక్షరాంకితం                             50
ఇరవై పేజీలు నాకు బ్రతుకు ప్రసాదించాయి          20
రెండు పేజీలే నాకు నేనుగా వ్రాసింది                      2
నలభై పేజీలు వ్రాస్తే బ్రతుకు ధన్యం                      40
తదుపరి జన్మలో నైనా పన్నెండు పేజీలు          ----------
ఇంకా వ్రాయాల్సిందే                                          112
                                                                   - 100
బ్రతుకు పుస్తకం పరిపూర్ణం చేయాలంటే             ----------
అంకితం చేసిన యాభై పేజీలలో                            -12
దేవత నడిగి పన్నెండు పేజీలు అప్పు పుచ్చుకోవాలి 
పుత్రకామేష్ఠి చేసిన దశరథుని తలుచుకుంటూ
పుష్కర కాల కాగితాలు - నాకు దత్తం చేయమని 
ఆ దేవతనర్ధిస్తున్నాను  

ఆమె పన్నెండు పేజీల ముందుమాట 
వ్రాసియిస్తే...... క్షరము కాని 
అక్షర లక్షల సంపుటిగా 
నా బ్రతుకు పుస్తకం 
చిన్నదైనా మిన్నయైనదే .