అక్షరాలునేర్చి ఆశ్చర్య పడునాడు - తెలుయునెంత గలదొ తెలుసుకొనగ - వింతతరగదయ్య విఙ్ఞానికెన్నడూ - అప్రమేయ వరద హరిముకుంద (పరాక్రి)

3, జూన్ 2013, సోమవారం

పదనిసలు-3

                                                      పదనిసలు-3
                    ఇంగ్లీష్ వాళ్లకి మనకి ముఖ్యమైన తేడా ఉంది. భాషలోనే కాదు భావాంతర్గత పద యదార్ధంలో కూడా, మాటాడితే మనం మనసు పదాన్ని వాడతాం, అఫ్ కోర్స్ ఫిజీషియన్ ని అడిగినా మనసు కోసి తీసి చూపించలేడు. అదే యదార్ధంగా ఆంగ్లంలో కూడా హార్ట్ , సోల్ ఉన్నాయి తప్ప మనసు లేదు. లోకంలోని వస్తు సంచయానికి ఎవరో ఒకరు పేరు పెట్టందే పేరైనా ఎలా నిలుస్తుంది.
            తెలుగు వారికి కాకి కావుకావు మనడం వినిపించింది. ఆంగ్లేయులకది క్రో అయింది. ఇద్దరికి దాని రవమే ఆధారం. కాకి, క్రో అన్న పదాలు సమానార్ధకాలుగా మనం గ్రహిస్తాం, కాకిని కాకి అనకుండా గీకి అని పిలవలేమా? అలా పిలవాలంటే ఆధారం కావాలిగా," పదుగురాడు మాట పాడియై ధరజెల్లు - ఒక్కడాడు మాట ఎక్కదెందు." కనుకనే కొత్తపదాలు పుట్టించడానికి సాహసం చేయరు.
            కొంతమంది కాల్పనికులు, ఆధునిక భావావేశం కలవాళ్ళు అవసరానికి అనుగుణమైన ఇతివృత్తాలను, కొత్త పదాలను సృజించగల సమర్ధులు. కాల గర్భంలో వారి సృజనా సామర్ధ్యంతో అవి నిఘంటువులలోకి ఎక్కిపోతాయి. కాస్త మనసు పెట్టి ఆలోచించే వారికి పదార్ధాల యదార్ధాలు నిజమే అనిపిస్తాయి. శాశ్వతత్వం సంతరించుకుంటేనే మీన్ పది కాలాలు నిలబడే పదార్ధాలు యదార్ధాలవుతాయి.
           అలాగే కాలం మహత్తర స్వస్థతకారి. పదానికి గల అర్ధాన్ని కూడా మార్చేసి వేరొక అర్ధాన్ని స్ఫురింప జేస్తుంది."సుత్తి" అనే పదానికి  ఆంగ్ల సమానార్ధకంలో చెప్పుకుందాం - హేమర్ -- టూల్  అనే అర్ధాలు ధర్మార్ధకాలు.కానీ సుత్తివేలు, సుత్తి వీరభద్రరావు సినీ రంగ ప్రవేశంతో సుత్తికి గల యదార్ధం పోయి, బోరు కొట్టడం అనే విశేషార్ధం ఏర్పడింది. అంతెందుకు ధర్మార్ధకమే దారి తప్పింది. ధర్మం అనే మాటకు నేటి మస్తిష్కాలలో అడుక్కున్న వాడికిచ్చే అర్ధో రూపాయో అనే అర్ధమే సామాన్యమై పోయింది.
            ధర్మదేవత ఏడుస్తుందన్నా ఆవిడెవరు కోర్టులో న్యాయం చేస్తామంటారు తప్ప ధర్మ భిక్ష పెట్టరు. చూసారా నేను కూడా ధర్మం అనే మాటని పెట్టేది గానో ఇచ్చేది గానో పద ప్రయోగం చేసాను తప్ప ధర్మార్ధ వివరణ దారి తప్పించాను. దేశ, కాల, మాన పరిస్థితుల కారణంగా శాశ్వతత్వం సంపాదించుకున్న పదార్ధాల యదార్ధాలు కూడా పెర్ష్యబుల్స్ గానో, డ్యూరబుల్స్ గానో మారిపోతున్నాయి. మారిపోతున్న లోకానికి అందుకోలేని పరుగు పందానికి పదార్ధ యదార్ధాలు కనుమరుగై పోతాయేమో ! మనమీద ఉన్న ఆంగ్ల ప్రభావం అలాంటిది. అందుకే నేటి వ్యాకరణం వంద వత్సరాల క్రితం నాటి భాషని మాత్రమే సూత్రీకరించ గలుస్తోంది.
                భాష ప్రవాహం లాంటిది నిరంతర యానంలో తరంతర అభినివేశంతో ఒడిదుడుకుల ఒడ్డులరసి ఒరిసి ప్రవహించే నదిలా ఉంటుంది కాబట్టే ఎప్పటికప్పుడు  భాషా సంస్కరణలు అనేక తరహా వ్యాకరణ గ్రంధాలు పుట్టుకొస్తున్నాయి. చర్విత చర్వణం అని మీరనుకున్నా అప్పటి నన్నయగారి తెలుగు భాషకు సంస్కృతంలో వ్యాకరణం వ్రాసుకో వలసి వచ్చింది. ఏం చేస్తాం అచ్చతెనుగు పదాలు వాటి సంఖ్య పదార్ధ యదార్ధాలు బహు స్వల్పంగా ఉన్న తరుణంలో రాజరాజ నరేంద్రుడు ఉద్గ్రంధమైన మహా భారతాన్ని తెలుగులో వ్రాయమన్నాడు. ఎంత పిండికి అంతే రొట్టవుతుంది కాని పెద్దది చెయ్యడమెలా ? అందుకే తొలి తెలుగు వ్యాకరణం ఆంధ్ర శబ్ధ చింతామణి పేరిట సంస్కృతంలో వ్రాయబడి తత్సమ, తద్భవాలను సూత్రీకరించి కొంత రూపాంతరమొనర్చి శబ్ధ శాశనుడగు నన్నయ తెలుగు భాషను విస్తృత పరిచాడు.
                   భాషలోనైనా త్వరిత గతిని మార్పు చెందనిది క్రియ . కానీ మన తెలుగు భాషలో క్రియా పదాలు సైతం శతాబ్ధాలతో పాటుగా దశాంతరమయ్యాయి. ఉదాహరణకు చూడండి " వచ్చుచు నున్నవాడు రాఘవుడు " ఇది నన్నయగారి ప్రయోగం . తిక్కనగారి కాలం నాటికే  " వచ్చుచున్నాడు" గా పరిభ్రమించింది . తదనంతర కాలంలో " వస్తున్నాడు" గా స్థిరీకరించింది. నేటి కాలానికి " వస్తండు" గా రూపాంతరం చెందింది.
                   ఇక వ్యాకరణంలో సూత్రీకరణలు నిలుస్తాయి. భాషా యోషా ప్రవాహానికి చమత్కారం చూడగలరు, దినపత్రిక తిరగేసినా 2013 ఫిల్మోత్సవం - శీర్షిక బాగానే ఉంది. ఫిల్ము - ఆంగ్ల పదం, ఉత్సవం - తత్సమం  రెండూ కలిపితే గుణమెలా వచ్చిందో తెలియదు. సరి పెట్టుకుందామంటే ఫిల్ముత్సవం కాదు, అందున ఫిల్మ్ కు ఉత్వము ఎలా వచ్చిందో ? అందుకే అంటాను నేటి మన వాడుక భాషకి మనం నేర్చుకునే వ్యాకరణం చాలదు. సరికదా ఆంగ్ల సమానార్ధకాలను తెలుగులో పుట్టించాలంటే .......   వర్జ్య సంహారం చేయల్సిందే.
                                      ........... కథనంతో మళ్లీ కలుస్తా.....
                        

వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి