సాయి స్మరణ
తే.ది. 24-4-2011 నాడు సత్యసాయిబాబా మహాభినిష్క్రమణ సందర్భమున విలపించ విరచించిన మనుస్మృతి ఖండిక
1. ఉ|| కష్టము కల్గునాడు మదికామిత హేతువు పొందగన్ యథా
నష్టము గల్గినన్ దలచి నమ్మకముంచి భజించి ధారణా
దృష్టిని లేక మానసము దృక్పథ వర్తన మార్గగామియై
శిష్ఠ జనైక ద్రష్ట వరశ్రేష్ఠిని సాయిని సంస్మరింపుమా ||
2. ఉ|| ధ్యానము ధారణా పటిమ దాస్య సుసేవ విమోచనాక్రియల్
పానము సేయుగా పరమ భాగవతోత్తము లైన వారికే
జ్ఞాన ప్రచేతనా గుణము జ్ఞప్తి విలుప్తి ప్రకామ్య జీవనా
సానువు-మానవా-సుగతి సత్యవిభుండగు సాయినాథుడే||
3. ఉ|| వేషము గాదు భూషణము విజ్ఞత నెంచగ సాధు వాదికిన్
కాషయ వస్త్ర ధారణము గడ్డము పాత్ర కమండ దండముల్
దూషణ తాంత్రి కాత్మగుణ దుర్మతి బోధలు సాయినాథ యీ
రోష విశేషమే మతపు రోగికి యోగికి బేధమెంచగా ||
4. ఉ|| వేదము చెప్పినన్ కవులు వేత్తలు తాత్త్విక సత్యమిప్పినన్
సాధన జేయకన్ సకల శాస్త్రములెల్ల పఠింప నేర్పునన్
గాధల బోధలన్ గరచి గానుగుటెద్దు గతిన్ చరించుటే
నీ దయ సాయి యోగమది నిక్కముగా పరమాత్మ దర్శనం ||
5. చం|| వ్యసనము లందు మానసము వాంఛిత దాస్యము చేయు వేళ-న
భ్యసనము మార్చు దైవమని భాధ్యత నీపయి నుంచి మ్రొక్కితిన్
అసురులు శత్రువర్గములు ఆరుగు రంతము జేయు శక్తి నా
వశమగు నీకౄపన్ స్మరణ వాక్పటు ధారణ సాయి నామమే ||
6. ఉ|| నేనను భ్రాంతి వీడి కరణేంద్రియ శక్తిని శాసనమ్ముచే
పూనుమ-నేనునీవుగద-పూరుష కర్మకు కర్త యొక్కటే
జ్ఞానము రూప బేధముల గాంచిన వేరను వాదమేలనో
ధ్యానముగల్గి సాయివిభుదర్శన భాగ్యముపొందు మోదమున్ ||
7. ఉ|| రాముడు దేవుడౌ హౄదయ రాజ్యము నేలిన చక్రవర్తి రా
ధామయ గృష్ణుడష్ట మహి దారల రాసవిలాస నాథుడే
దేముని రూపమన్న బహుదేహములెత్తి వశించియున్న, బా
బా! ముదమోహనాననము భావన సేయగ దైవసన్నిధే ||