శ్రీనివసరావు అదృష్టవంతుడు
అదేం? ...అంటారా,
మరొకర్ని మన్నించేప్పుడు మాత్రమే
మనం’ శ్రీ’ ని వాడతాం
మనకి మనం శ్రీ ని చుట్టుకోలేం గదా |
బార్టర్ సిస్టం లో ,లా ,
పక్కవాళ్ళిస్తేనే మనకి వస్తుంది "శ్రీ"
అందుకే అన్నాను శ్రీనివాసరావు
అదృష్టవంతుడని ,
పెళ్ళి శుభలేఖలో,
శ్రీమతి ऽ శ్రీ వ్రాయు శుభలేఖార్ధములు....
అని వ్రాసుకుంటాం.
అది శ్రీమతి వల్ల కలిసొచ్చిన ,
శ్రీమాత్రమే సుమండీ....
కుమారి -శ్రీమతి కాలేక పోయినా,
ఒకచో
నిరుద్యోగి గోవింద రాజులు-
సంబోధనలో ! శ్రీ గోవిందరాజులే అవుతాడు.
యవ్వనం లో అడుగుపెట్టిన కుర్రవాడికి,
శ్రీ---ని పెట్టి వ్రాసిచూడండి వాడి సంబరం...
అందుకే అన్నాను ,
శ్రీనివాసరావు అదృష్టవంతుడని,
పిల్లవాడని కొట్టిపారేయకండి కాని,
మా బుల్లి శ్రీ ను గాడికి కూడా,
శ్రీ- అంటే ఎంత మోజో.............
వాడి తెలుగు నోట్సుపై ....శ్రీ శ్రీను ఐదో తరగతి,
అని వ్రాసుకున్నాడు,
రెండు -శ్రీ,శ్రీ- లుచూడగానే
గత శతాబ్దపు మహాకవి స్ఫురణ కొచ్చారు,
అందుకే అన్నాను శ్రీనివాసరావు అదృష్టవంతుడని,
మా అమ్మ తిరపతిలో మొక్కుకుందట,
నాకు ప్రమోషన్ వస్తే ,
ఇంటిల్లబాది వచ్చి తలో వెయ్యా హుండీలో వేస్తామని,
తిరిగొచ్చి గుండుతడుముకుంటూ ఖర్చులు లెక్కజూస్తే
గుండె ఆగినంత పనయ్యింది... !
అంతా కలియుగ దైవమైన శ్రీనివాసుని మహత్యం
అందుకే అంటాను,
లచ్చి ఏకాక్షరమై, లక్కు తోడైతే
శ్రీసూక్తం పఠించే వాడు,
శ్రీనివాసరావు అదృష్టవంతులే//