అక్షరాలునేర్చి ఆశ్చర్య పడునాడు - తెలుయునెంత గలదొ తెలుసుకొనగ - వింతతరగదయ్య విఙ్ఞానికెన్నడూ - అప్రమేయ వరద హరిముకుంద (పరాక్రి)

29, జూన్ 2013, శనివారం

పదనిసలు-4 వర్జ్యసంహారం

                                     వర్జ్యసంహారం      

  ప్రస్తుత కథాంశాన్ని చాలా రోజులుగా అందరితో పంచు కోవాలనుకుంటున్నాను. ఈ కథ కు  ఇతివృత్తం వర్జ్యం.  అనగా విడువదగిన సమయము అని అర్థం. మా తాతలలో ఒకరైన కీ|| శే||  పంతుల భాస్కరరావు గారు "వర్జ్య సంహార " కావ్యంగా ఛందోబంధాలలో చిత్రీకరించారు. కొండను త్రవ్వి ఎలుకను పట్టడం అనే సామెత మీరందరు ఎరిగినదే. కథా వస్తువు ఏదైనా హాస్యస్ఫోరకంగా రచించడంలో ఆయన దిట్టకవే.  


                       ఇక వర్జ్య సంహార కావ్యకథా వస్తువును కథగా చెప్పే ముందు ఓ రెండు మాటలు చెప్పాలి. నేనా కావ్యాన్ని చూడనూలేదు, చదవనూలేదు. ఇంట్లోవాళ్ళు ముచ్చటించుకునే సందర్భంలో కవిగారి చమత్కారం, హాస్య ఫక్కీ  నన్నెంతగానో ఆకర్షించేవి. వర్జ్యం, దుర్ముహూర్తం అనేవి మనం నేటికీ పంచాంగాలలో గమనిస్తూంటాం. అసలు పంచాంగం అంటేనే తిథి,వార,నక్షత్ర,యోగ,కరణాలు కదా. సమయ పాలనా సందర్భాన్ని పురస్కరించుకుని వారమునకు దుర్ముహూర్త కాలము, వర్జనీయ సమయములు సూచింపబడుతుంటాయి.ఈ నేపథ్యం నుండి వర్జ్య సంహార కథాసుధ ప్రావుద్భవించింది. 

                 అనగనగా ఓ రాజ్యాన్ని అయోమయం రాజు పాలించేవాడు. అతనిమంత్రి మరీ బుద్ధిహీనుడు, అయినా రాచకార్యాలు ఇతర ఉద్యోగులవల్ల సజావుగానే సాగుతూనే ఉండేవి . ఆ రాజ సభలో ఓ నిలయ విద్వాంసునిగా జోస్యుడొకడు పంచాంగం పఠించేవాడు. అందరితో పాటుగా "రాజు - మంత్రి" కూడా శ్రద్ధగా వినేవారు. పంచాంగంలోని వర్జ్యాన్ని గూర్చి రాజూ, మంత్రి తమ బుద్ధి సూక్ష్మతతో పరిశీలించారు. వార దుర్ముహూర్తం పద్ధతిగా రోజుకు బాగానే వస్తూంది. రాజన్నాడు కదా "ఓయి మంత్రి ఆ వర్జ్యం పద్ధతిగా లేదోయ్ మన పంతులుగార్ని ఓ సారి అడిగి దాన్ని సంస్కరించాలి." మంత్రి అంటాడు కదా "రాజా రామరాజ్యంలాంటి మీ ఏలుబడిలో అన్నీ సజావుగానే ఉండాలి. పద్ధతి తప్పి ప్రవర్తించే తీరు దేనికీ ఉండకూడదు. అనంత కాల విశ్వంలో పంతులుగారు చెప్పినట్లు నక్షత్రాలన్నీ మేకరాశి నుండి చేపరాశి దాకా పద్ధతిగా ఉంటాయి. గ్రహాలూ పద్ధతిగానే తిరుగుతుంటాయి. ఈ వర్జ్యం మాత్రమే అడ్డదిడ్డంగా దానికి నచ్చినప్పుడు వస్తూ పోతూ ఉంటుంది."

" మంత్రీ ! అదేనయ్యా నా బాధ ,  ఓ రోజులో చేసుకోవాలనుకున్న పనులకి ఇది మహా ఆటంకంగా ఉంది. పంతులుగారొచ్చి చెప్పేదాకా ఆ వర్జ్యం ఎప్పుడొస్తుందో ఎప్పుడు రాదో తెలీదు. వార దుర్ముహూర్తంలా దానికి పద్ధతిలేదు. ఏం చేస్తే బాగుంటుందంటావ్", 
మంత్రి తటపటాయించకుండా టక్కున సమాధానం చెప్పాడు.

             " హే రాజన్ !   సజావుగా లేని వారికి మరణదండనే శిక్ష, కావున మీరు వెంటనే ఆ వర్జ్యాన్ని సంహరించాలి. పంతులుగార్ని వెంటనే ఆదేశిస్తాను వర్జ్యాన్ని పట్టుకురమ్మని."

 రాజు మనసు కుదుట పడింది." సరే ఈ రాత్రికే దాన్ని సంహరించేస్తాను. వెంటనే పంతులు గార్ని పట్టుకు రమ్మనండి." అంటూ అంతః పురంలోకి పోయాడు. 
                బుద్ధిహీనుడైన ఆ మంత్రి రెండో మాట మాట్లాడకుండా వర్జ్యాన్ని తెస్తావా ? చస్తావా ? అంటూ పంతులు గారికి పురమాయించాడు.

 పాపం ఆ బాపడు ఏం చేయాలో తోచక తన భార్యతో సంప్రదించాడు. సాయింత్రానికల్లా వర్జ్యాన్ని తేకపోతే దాన్ని సంహరించడం మాట ఏమోగాని ఈ సమస్య నా చావుకొచ్చింది. విచారిస్తున్న అతన్ని చూసి భార్య అన్నది కదా!

" ఏమండీ, వర్జ్యన్ని ఎవరు తేగలరు, అదేమైనా కందిపప్పు పొట్లమా కట్టుకు పట్టుకు పోడానికి, ఈ తలతిక్క వ్యవహారానికి కొద్ది మోసం జోడించి మన ప్రాణాలు మనం కాపాడుకోవాలి కదా, నాకో ఆలోచన తట్టింది". అంటూ ఉపాయాన్ని సూచించింది.

 ఎలకల బోనులో  పడ్ద ఓ ఎలకకి జేగురు రాసి, పిండి చుక్కలు పెట్టి, బాగా ముస్తాబు చేసి భర్తకిచ్చింది. 

                 మన పండితులవారు రాజ సభకు తీసుకెళ్ళి తన బుద్ధికి పదునుబెట్టి ఇట్లా చెప్పాడు.

 "ఆర్యా ! మీరడిగారు గనక నా తపోశక్తిని ధారబోసి ఈ సారికి వర్జ్యాన్ని తెచ్చాను. మీకు తెలుసు కదా, దీనికి కుదురులేదు, దానికి నచ్చినట్లది ఎగురుతూ దుముకుతూ పరిగెడుతుంది. ఈ వర్జ్యాన్ని సంహరించడం ఇక మీ భాద్యత. మరలా తెమ్మంటే నా వల్ల కాదు." సంహరించండంటూ గుడ్డమూట విప్పాడు. 

ఇంకేముంది రాజ సభలో పెద్ద కలకలం. పట్టుకోండి ..  పట్టుకోండి ..  అంటూ అరుపులు రాజుగారి ఆఙ్ఞ , మంత్రిగారి ఆరాటం , సైనికులంతా వర్జ్యాన్ని వెతకనారంభించారు." రాజు నేనే సంహరిస్తాను , మీరుదాన్ని చంపకండి. అని ఆదేశించాడు. "
                          మూడు రోజులు నిద్రాహారాలు మాని దాన్ని వెంబడిస్తూ వీధులు, పట్టణాలు, పల్లెలూ గాలిస్తూ చివరికది ఓ కొండ బొరియలో దూరినట్లు గుర్తించారు. అక్కడ కొందరు కాపలాకాస్తూ రాజుకా వర్తమానాన్ని అందించారు. వర్జ్య సంహారానికి సిద్ధపడిన రాజు రాజ్యపాలన విధులన్నీ - మంత్రికి అప్పగించి ఆ కొండ బండలను బద్దలుగొట్టించే పనిలో పడ్దాడు. 
                             ఇది ఇలా ఉండగా రాణి వాసంలో  రాణీ గారిని తేలుకుట్టింది. తెలుసుకున్న మంత్రి వైద్యులకు కబురుపంపాడు. సమయానికి వారందుబాటులో లేకపోవడంతో వైద్యనాథుల శిష్యులు విషం తలకెక్కకుండా చూసుకోండి, మా గురువుగార్ని త్వరగా తీసుకొస్తాం అని వార్తాహరులను సమాధాన పరిచి, గురువుగారి దగ్గరకు వెళ్ళారు. 
                  రాణిగారు తేలువిషం సలపడంతో గోలగోల చేస్తూ ఉంటే మంత్రి తన బుర్రకు పదును బెట్టి వైద్యనాధ శిష్యులు చెప్పిన ప్రకారం తలనుండి మొండెం వేరుచేసి విషం తలకెక్కకుండా జాగ్రత్త పడేటట్లు ఆదేశించాడు. వైద్యనాథులు ముహూర్త సమయంలోనే అంతఃపురానికి వచ్చినా మంత్రిచేసిన అఘాయిత్యం గ్రహించి, 

"అబ్బే లాభం లేదండి చూడండి ముఖం వాడిపోయింది విషం తలకెక్కేసింది." అని చెప్పి తప్పించుకున్నారు. 

                 మంత్రికి ఏం చేయాలో పాలుపోలేదు. రాణిగారికి సంతానం లేదు, రాజుగారా.. వర్జ్యసంహారంలో ఉన్నారు. అంతఃపుర కాంతలను వేలేసి తాకరాదుకదా.. గంధం చెక్కలు తెప్పించి రాణివాసాన్నే తగలెట్టేసాడు. ఆ మంటలు అంతటితో ఆగకుండా ఊరంతా చుట్టుముట్టేసాయి. వెంటనే స్పందించిన మంత్రి చెరువుగట్టు కోట్టేయించి మంటలార్పబోయాడు. కానీ ఏం లాభం, మీదలు కాలి - క్రిందలు నీటికి నాని,  రాజ్యం మొత్తం భూకంపం వచ్చినట్లు చెల్లాచెదురైపోయింది. 

                         అయినా పట్టువదలని విక్రమార్కుడిలా నగరాన్నంతా పునర్నిర్మించాడు మంత్రి. అయోమయం రాజు కూడా కొండని త్రవ్వి ఎలుకను పట్టి వర్జ్యసంహారం చేసానంటూ వీర విహారం చేస్తూ రాజ్యానికొచ్చాడు. ఎదురు సన్నాహాలతో మంత్రి తోడ్కొని తెచ్చాడు. 
 రాజ్యాన్నంతా క్రొత్తగా చూస్తున్నట్లుందని, రాజు వ్యాఖ్యానించడంతో 

"అయ్యా!  ఏం జరిగిందనుకున్నారు  అంటూ
   రాణిగారికి తేలుకుట్టడం దగ్గరనించి, రాజ్య నిర్మాణం దాకా అన్ని విషయాలు పూసగ్రుచ్చినట్లు చెప్పాడు మంత్రి. సెహభాష్ ! అంటూ మెచ్చుకున్నాడు రాజు.

కానీ రాజుగారికి కలిగిన సందేహం మంత్రిగారి సమాధానం విడవకుండా మీరు వినాలి, అప్పుడే  నిజమైన వర్జ్యానికి సార్ధకత చేకూరేది.

                       ఇంతకీ  రాజు అడిగిన సందేహం .... 
" సరేనయ్యా మంత్రీ!  కానీ చెరువులోని చేపలేమయ్యాయి?  

దానికి మంత్రి  సమాధానం ....
 " మహా ప్రభో చేపలన్నీ చెట్లెక్కి పోయాయి"
                             -:  ఇదండీ వర్జ్య సంహారం కథ. :-

 మరోసారి మరో కథనంతో నూటికి- వస్తాదును పరిచయం చేస్తా.....            

3, జూన్ 2013, సోమవారం

పదనిసలు-3

                                                      పదనిసలు-3
                    ఇంగ్లీష్ వాళ్లకి మనకి ముఖ్యమైన తేడా ఉంది. భాషలోనే కాదు భావాంతర్గత పద యదార్ధంలో కూడా, మాటాడితే మనం మనసు పదాన్ని వాడతాం, అఫ్ కోర్స్ ఫిజీషియన్ ని అడిగినా మనసు కోసి తీసి చూపించలేడు. అదే యదార్ధంగా ఆంగ్లంలో కూడా హార్ట్ , సోల్ ఉన్నాయి తప్ప మనసు లేదు. లోకంలోని వస్తు సంచయానికి ఎవరో ఒకరు పేరు పెట్టందే పేరైనా ఎలా నిలుస్తుంది.
            తెలుగు వారికి కాకి కావుకావు మనడం వినిపించింది. ఆంగ్లేయులకది క్రో అయింది. ఇద్దరికి దాని రవమే ఆధారం. కాకి, క్రో అన్న పదాలు సమానార్ధకాలుగా మనం గ్రహిస్తాం, కాకిని కాకి అనకుండా గీకి అని పిలవలేమా? అలా పిలవాలంటే ఆధారం కావాలిగా," పదుగురాడు మాట పాడియై ధరజెల్లు - ఒక్కడాడు మాట ఎక్కదెందు." కనుకనే కొత్తపదాలు పుట్టించడానికి సాహసం చేయరు.
            కొంతమంది కాల్పనికులు, ఆధునిక భావావేశం కలవాళ్ళు అవసరానికి అనుగుణమైన ఇతివృత్తాలను, కొత్త పదాలను సృజించగల సమర్ధులు. కాల గర్భంలో వారి సృజనా సామర్ధ్యంతో అవి నిఘంటువులలోకి ఎక్కిపోతాయి. కాస్త మనసు పెట్టి ఆలోచించే వారికి పదార్ధాల యదార్ధాలు నిజమే అనిపిస్తాయి. శాశ్వతత్వం సంతరించుకుంటేనే మీన్ పది కాలాలు నిలబడే పదార్ధాలు యదార్ధాలవుతాయి.
           అలాగే కాలం మహత్తర స్వస్థతకారి. పదానికి గల అర్ధాన్ని కూడా మార్చేసి వేరొక అర్ధాన్ని స్ఫురింప జేస్తుంది."సుత్తి" అనే పదానికి  ఆంగ్ల సమానార్ధకంలో చెప్పుకుందాం - హేమర్ -- టూల్  అనే అర్ధాలు ధర్మార్ధకాలు.కానీ సుత్తివేలు, సుత్తి వీరభద్రరావు సినీ రంగ ప్రవేశంతో సుత్తికి గల యదార్ధం పోయి, బోరు కొట్టడం అనే విశేషార్ధం ఏర్పడింది. అంతెందుకు ధర్మార్ధకమే దారి తప్పింది. ధర్మం అనే మాటకు నేటి మస్తిష్కాలలో అడుక్కున్న వాడికిచ్చే అర్ధో రూపాయో అనే అర్ధమే సామాన్యమై పోయింది.
            ధర్మదేవత ఏడుస్తుందన్నా ఆవిడెవరు కోర్టులో న్యాయం చేస్తామంటారు తప్ప ధర్మ భిక్ష పెట్టరు. చూసారా నేను కూడా ధర్మం అనే మాటని పెట్టేది గానో ఇచ్చేది గానో పద ప్రయోగం చేసాను తప్ప ధర్మార్ధ వివరణ దారి తప్పించాను. దేశ, కాల, మాన పరిస్థితుల కారణంగా శాశ్వతత్వం సంపాదించుకున్న పదార్ధాల యదార్ధాలు కూడా పెర్ష్యబుల్స్ గానో, డ్యూరబుల్స్ గానో మారిపోతున్నాయి. మారిపోతున్న లోకానికి అందుకోలేని పరుగు పందానికి పదార్ధ యదార్ధాలు కనుమరుగై పోతాయేమో ! మనమీద ఉన్న ఆంగ్ల ప్రభావం అలాంటిది. అందుకే నేటి వ్యాకరణం వంద వత్సరాల క్రితం నాటి భాషని మాత్రమే సూత్రీకరించ గలుస్తోంది.
                భాష ప్రవాహం లాంటిది నిరంతర యానంలో తరంతర అభినివేశంతో ఒడిదుడుకుల ఒడ్డులరసి ఒరిసి ప్రవహించే నదిలా ఉంటుంది కాబట్టే ఎప్పటికప్పుడు  భాషా సంస్కరణలు అనేక తరహా వ్యాకరణ గ్రంధాలు పుట్టుకొస్తున్నాయి. చర్విత చర్వణం అని మీరనుకున్నా అప్పటి నన్నయగారి తెలుగు భాషకు సంస్కృతంలో వ్యాకరణం వ్రాసుకో వలసి వచ్చింది. ఏం చేస్తాం అచ్చతెనుగు పదాలు వాటి సంఖ్య పదార్ధ యదార్ధాలు బహు స్వల్పంగా ఉన్న తరుణంలో రాజరాజ నరేంద్రుడు ఉద్గ్రంధమైన మహా భారతాన్ని తెలుగులో వ్రాయమన్నాడు. ఎంత పిండికి అంతే రొట్టవుతుంది కాని పెద్దది చెయ్యడమెలా ? అందుకే తొలి తెలుగు వ్యాకరణం ఆంధ్ర శబ్ధ చింతామణి పేరిట సంస్కృతంలో వ్రాయబడి తత్సమ, తద్భవాలను సూత్రీకరించి కొంత రూపాంతరమొనర్చి శబ్ధ శాశనుడగు నన్నయ తెలుగు భాషను విస్తృత పరిచాడు.
                   భాషలోనైనా త్వరిత గతిని మార్పు చెందనిది క్రియ . కానీ మన తెలుగు భాషలో క్రియా పదాలు సైతం శతాబ్ధాలతో పాటుగా దశాంతరమయ్యాయి. ఉదాహరణకు చూడండి " వచ్చుచు నున్నవాడు రాఘవుడు " ఇది నన్నయగారి ప్రయోగం . తిక్కనగారి కాలం నాటికే  " వచ్చుచున్నాడు" గా పరిభ్రమించింది . తదనంతర కాలంలో " వస్తున్నాడు" గా స్థిరీకరించింది. నేటి కాలానికి " వస్తండు" గా రూపాంతరం చెందింది.
                   ఇక వ్యాకరణంలో సూత్రీకరణలు నిలుస్తాయి. భాషా యోషా ప్రవాహానికి చమత్కారం చూడగలరు, దినపత్రిక తిరగేసినా 2013 ఫిల్మోత్సవం - శీర్షిక బాగానే ఉంది. ఫిల్ము - ఆంగ్ల పదం, ఉత్సవం - తత్సమం  రెండూ కలిపితే గుణమెలా వచ్చిందో తెలియదు. సరి పెట్టుకుందామంటే ఫిల్ముత్సవం కాదు, అందున ఫిల్మ్ కు ఉత్వము ఎలా వచ్చిందో ? అందుకే అంటాను నేటి మన వాడుక భాషకి మనం నేర్చుకునే వ్యాకరణం చాలదు. సరికదా ఆంగ్ల సమానార్ధకాలను తెలుగులో పుట్టించాలంటే .......   వర్జ్య సంహారం చేయల్సిందే.
                                      ........... కథనంతో మళ్లీ కలుస్తా.....
                        

1, జూన్ 2013, శనివారం

పదనిసలు - 2



                                                        పదనిసలు - 2
                దైనందిన భాగంగా  వార్తా పత్రిక చూస్తున్నాను, దిన ఫలంలో చిన్ననాటి మిత్రుల కలయిక అని వ్రాసి వుంది. ఇప్పుడెవరొస్తారబ్బా నాతో చదువుకున్న వారంతా ఎక్కడున్నారో, ఏం చేస్తున్నారో, కొంతమందినైతే నేను గుర్తు పట్టలేను కూడా. నాలాగే ఏదో ఒకటి వ్రాయాలి గనక దిన ఫలితాలు వ్రాస్తారుగానీ వ్రాసిన ప్రతీదీ జరుగుతుందా, ఊసుపోక చదువుకోవడం గానీ అసలు పేపరంటేనే కాలక్షేపం కబుర్లైపోయాయి.

అయ్యో పేజీ తిప్పేయకండినా రాశి నేనింకా చదవలేదు. అన్న మాశ్రీమతి మాటలతో నెట్ న్యూస్ లో బేక్ పేజీకి వచ్చాను.

 నాలాటి పిచ్చోళ్ళుంటారు కాబట్టే పేపర్లలో అక్కరలేని హంగామా అంతా అయినా అదేమిటో కానీ ఏరోజు పేపరు ఆరోజు కూలంకషంగా చదివేస్తేనే గానీ మనసుండబట్టదు. ఒకచో సర్వర్ డౌనయితే చాలు పేపరు చదవడానికి మళ్ళీ టైం దొరక్క గోగులమ్మ మీద సంస్కృత భాషా ప్రశంసా వాక్యాలు పలికేస్తూ నెట్ కట్టేసి పనిగట్టుకుని బయటకు పోయేవాణ్ణి.

 నాపిచ్చి నీకూ అబ్బినట్టుందే చదివేసుకో తల్లీ అక్షర సత్యాలు అంటూ ఉండగానేనాచిన్ననాటి మిత్రుడు కామేశ్వరరావు లోపలికొచ్చాడు. వాడికేసి మాఆవిడకేసి కళ్లు తిప్పుతూ నాలో ఆశ్చర్యాన్ని అదుపు పట్టాను.

" ఏరా బావున్నావా ! " 
 కామేశం  పలకరింపు అలా అనిపించలా గుర్తించాడో ఏమో, మరో అడుగు ముందుకేసి నిన్న ఆంధ్రభూమిలో నీకథ చూసాన్రా అన్నాడో లేదో నాలో అటెన్షన్ మా శ్రీమతి తప్పకుండా గుర్తించింది. కాక పోతే అప్పుడే కరంటు పోయింది. అదేం కష్టంగా తోచలా చిన్ననాటి మిత్రుడొచ్చాడుగా  కాలక్షేపానికి.

 మా ఆవిడ కాఫీ కలపడానికి కామోసు వంటింట్లో దూరింది. ఆదివారం కావడం కరంటు పోవడంతో రెండు గంటలైనా కరంటు ఎప్పుడొచ్చిందో కూడా గుర్తించకుండా ఒకటే పిచ్చాపాటీ.

                   ఇరవై ఐదేళ్లక్రితం కామేశం నేను విజయనగరంలో ఉపాధ్యాయులుగా పనిచేసేవాళ్ళం

 వాడు వెళ్ళి అరగంటైనా మళ్ళీ ఆముచ్చట్లన్నీ కందిరీగలా దొలిచేస్తూ మా ఆవిణ్ణి శ్రోతగా వాడుకున్నాను. కానీ నా అతిశయోక్తులకు అడ్డంకి పడ్దాది.

 చూడండి, కామేశం మీరూ మిత్రులే కాదన్ను కానీ మిమ్మల్ని చూడ్డానికేం అతనొచ్చీలేదు, ఊళ్ళో ఎవరిదో పెళ్ళుంది గనుక పన్లోపనిగా అతని దర్శనభాగ్యం మీకు కల్పించాడు,  

       ఇప్పుడు నేను శ్రోతనవుతున్నానన్న విషయం మరిచి పోయి ఆవిడకో పదినిముషాలు కేటాయించాను,

 ఏమిటీ దినఫలితాలు కాలక్షేపం కబుర్లా, లేక అక్షర సత్యాలని ఒప్పుకుంటారా, నేనా ప్రశ్నకు సమాధానపడి తేరుకునే లోపు మరో బాంబు నామీద విసిరింది. మీ ఫ్రెండు బాగా ఉపదేశం చేసాడండి, అద్వితీయంగా వ్రాయాలట, అబ్రప్ట్ ఓపినింగ్ కావాలట,  చెవులొగ్గి    డూడూ బసవన్నలా మీరు వింటుంటే నాకెంత ముచ్చటేసిందో,

  మొన్నటికి మొన్న మీ కొలీగ్ జ్యోతిగారొచ్చి సరిగమలు వదిలేసి పదనిసలు పట్తుకున్నారంది, తగుదునమ్మా అంటూ పదనిసల ధారావాహిక  మీరు ప్రారంభించేసారు. ఇది రెండో రోజుకదా యిక అద్వితీయంగా వ్రాయండి

                 అహం దెబ్బతిన్న నేను క్షణికావేశంలోనే చూడు జయా నేను వృత్తిరీత్యా ఉపాధ్యాయుణ్ణి, ద్వితీయ విఘ్నం లేకుండా రెండుమీదే రెండుతోనే రెండుగా .........  
 చెప్పండి...చెప్పండి,
 మీ కాలక్షేపం కబుర్లు చూడడానికి ఎందరో నెట్ జనులు సిద్ధంగానే ఉంటారు
 మీరే అన్నారుగా ఇవాళ చస్తే రేపు రెండు అని, ఒకటి భోక్తవ్యమైనప్పుడు రెండోది అద్వితీయం కాకుండా ఉంటుందా, మళ్ళీ నేను చెప్పానని వ్రాసారు
 అయినా మీధోరణి మీది

 నాలోని కథకుడు అద్దం పెంకు మీద గాజుపూసలా అల్లల్లాడిపోతున్నాడు
                       
                                                                       - మళ్లీ కలుస్తా.