అక్షరాలునేర్చి ఆశ్చర్య పడునాడు - తెలుయునెంత గలదొ తెలుసుకొనగ - వింతతరగదయ్య విఙ్ఞానికెన్నడూ - అప్రమేయ వరద హరిముకుంద (పరాక్రి)

21, మార్చి 2013, గురువారం

విజయాభిదేయము

                            విజయాభిదేయము
                                    కవితాశిరోమణి : శ్రీ పంతుల వెంకట రాధాకృష్ణ (పరాక్రి)

     

 ( తే.ది 17-03-2013 నాడు కంచర పాలెం మెట్టు- విశాఖపట్నం వద్ద జరిగిన కవి సమ్మేళనంలో బ్రహ్మజ్యోతి పత్రిక వారికి బహూకరించిన విజయాభిదేయ పద్య త్రయం )               

ఉ||  స్వాగతమమ్మ ఓ విజయ వత్సర నామపు చాంద్రమానమా 
స్వాగతమమ్మ భావకల భాసిత రాశిత సుందరీ రమా !
        స్వాగతమాంధ్ర జాతికిని సంస్కృతి సన్నుతి పొందు వృద్ధికిన్ 
ఆగత షడ్రుచీ కలన యానవయారపు వైజయంతికా !

సీ|| రాజు గురుడగును రాష్ట్రాధిపతివోలె
                                  సుస్థిరత్వము కల్గు శుభములందు !
మంత్రి భాస్కరుడగు మాన్య ప్రధానిలా
                                        కల్లోల మతమౌఢ్య కలతలందు !
నవనాయకులతో భవసాగరంబగు
                                        కర్ష కార్మిక శక్తి హర్ష ప్రదము!
సరుకు ధరవరలు పెరుగుటే ధరణిలో
                                                తరుగు దల నెపుడు దలపరాదు !

గీ||      పేదసాదల గతులెల్ల బీదగాను
                      ధనికులున్నత పీఠముల్ దాల్చుచుండ
               కొత్త వత్సర ఫలితమ్ము కోర్కె గాని
                           మార్పు లేముండు యోచింప తీర్పరులకు !

సీ||      పంచాంగ ప్రియులైన ప్రజలార వినరండి
                                                             ద్వాదశ రాశుల వర్ష ఫలము
ఆగ్రహాను గ్రహ నిగ్రహ గ్రహముల
                                                       ఘటనా ఘటనల సంఘటన తెలియ
ఏ రాశి మీదైన ఏ తార వారైన
                                                 ఫలితాల విషయమై కలత వలదు
కందాయ ఫలితముల్ ఖర్చుకున్ దగినట్లు
                                                       ఆదాయమును వ్యయం బప్పు బట్టి ||

గీ||     రాజపూజావమానము రాజకీయ
                 తంత్రమును బట్టి , రాశి సత్ఫలములెల్ల
      కొత్త వత్సర మందలి కోర్కె బట్టి
             గట్టి యత్నము చేసిన గాంచ గలరు.

3 వ్యాఖ్యలు:

 1. పండిత మండలీ శ్రవణపర్వముగా విజయాభిధేయమున్
  నిండగు జ్యోతిషాత్మక మనీషను చక్కగవిప్పి చెప్పిమా
  గుండెకు హత్తినారు!శత కోటి నమస్సుమనస్సులయ్య!మీ
  మెండయినట్టి యీకృషియమేయప్రశస్తిని నిండుగావుతన్.

  పంతుల రాధకృష్ణ కవివర్య!సెబాసు!యుగాది కైత వా
  సంత సమీరసౌరభప్రసారమునై మది హాయిమేయ మీ
  గొంతును విప్పినారు!యెలకోయిలగాన విలాసమట్టుల
  త్యంత మనోహరంబయి దిగంత రదంతర సౌఖ్యవంతమౌ!

  ప్రత్యుత్తరంతొలగించు
 2. chinta vijaya Yesterday 7:35 AM
  ఆర్యా! సరళమైన శైలితో నొప్పియున్న పద్యత్రయమును చదివితిని. చాలా సంతోషమనిపించింది. మీకు నా హృదయ పూర్వక అభినందనలు. నాకు పంపినందులకు ధన్యవాదములు.
  http://andhraamrutham.blogspot.in/2013/03/blog-post_23.html
  సజ్జన విధేయుడు
  చింతా రామ కృష్ణా రావు.
  http://abdhraamrutham.blogspot.com

  ప్రత్యుత్తరంతొలగించు
 3. thanks to సోమార్క గారు ,
  అర్క సోమయాజి ఆంనంద మొందగా!
  ఏమి, వ్రాసినానొ భ్రామికతన ?
  పద్య పాటవాన పన్నీరు జల్లగా,
  ఛంద మొలక బోస్తివందముగను//

  ప్రత్యుత్తరంతొలగించు