అక్షరాలునేర్చి ఆశ్చర్య పడునాడు - తెలుయునెంత గలదొ తెలుసుకొనగ - వింతతరగదయ్య విఙ్ఞానికెన్నడూ - అప్రమేయ వరద హరిముకుంద (పరాక్రి)

10, జూన్ 2012, ఆదివారం

సారస ఖైనీ                                        సారస ఖైనీ    
           ( 04-10-1986 ,  హన్మకొండలో పండిట్ ట్రైనింగ్ అవుతున్నప్పుడు మిత్రుడు నడిమింటి చింతామణి గణపతి శాస్త్రి ప్రోద్బలంతో వ్రాసిన ఖండిక ఇది )
              
           1.    కైతలు జెప్పంగా మది
               నోతలపు గలిగెను సేవనోపరి ఖైనీ
               తైతకతై తికమకలై
               వ్రాతకు పూనంగ నేను వ్రాక్కువ్వంగా||
     
            2.   ఖైనీ నామంబు నిలను
               కానల పండించు నాకు కమ్మదనంబుల్
               చీనా పుగాకు వోలెన్
               తానిల సాక్షాత్కరించు తదుపరి గూర్పన్||

            3.   న్నముతో కలగలిపియు
               భిన్న విభిన్నము జరచగ పిసుకుచునూదన్
               భిన్నములై పొడియాకులు
               చిన్నవి పెదవులకు క్రింద చేర్పన్ దగుమా ||

            4.   తత్తరి చిత్తము చిత్తై
               బిత్తర బోవంగ జేయు భీరుల మనముల్
               చిత్తడి ధార సుధారస
               మొత్తమ్ములు ఝల్ నిషాల పోడిమి ఘాటై ||

           5.   ఆ రసము మ్రింగి నాకిక
              నీరసముల్ దొలుగు, రజనీకర కరుణల్
              దారసిలంగా దగురా
              సారస రసదానుసార సారామౄతముల్||

     
           6.   సానీదపమగరిస, తా
               ఖైనీ యొప్పారుచుండు కామిత గతిలో
               సానీరిగమపదపసా
               తానే ఫూల్ ఫూల్  యనంగ తంబాకనగా ||   

          7.   దమ్ము లైపోవు సిగరెట్టు దాను యెంత
               కంపు  కొట్టెడి చుట్ట బింకాలు యెంత
               నోట కల్లీల ఖారాల నోము లెంత
               ఉమ్మి మ్రింగిన ఖైనీల ఊహలందు ||

          8.  అప్పజెప్పచ్చు పద్యముల్ ఆశువుగను
              కల్పనల్ జేయదగునహో కావ్య సరిణి
              అధర మధుర సుధారసాభ్యుదయ రుచుల
              చప్పరించిన ఖైనీని చెప్పదలచి ||

          9.  పడి పడి నవ్వుదు రకటా
              తడిసుడి తెలియక నడుగచు తంబాకేనా
              మడి గట్టు కొన్న మనుజులు
              కడువడి గుడిచిన తెలియును ఖైనీ మహిమల్ ||

         10.   కన్నము బడిపోవు పెదవుల
              న్నన్నా కుడువంగ రాదె ఆహారములన్
              సున్నము కొరికిన  దవడలు
              నన్నీ స్థితిలోకి దెచ్చె నానాటికి తాన్||

          11.  తెచ్చెను కేన్సరు లిప్సుకు
              హెచ్చెను బాధలవి నోరు ఏహ్యం బై, నా
              కొచ్చిన దుస్థితి కనివిని
              ముచ్చట పడబోకుమోయి మూర్ఖుని పగిదిన్ ||


వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి