అక్షరాలునేర్చి ఆశ్చర్య పడునాడు - తెలుయునెంత గలదొ తెలుసుకొనగ - వింతతరగదయ్య విఙ్ఞానికెన్నడూ - అప్రమేయ వరద హరిముకుంద (పరాక్రి)

27, డిసెంబర్ 2013, శుక్రవారం

అనపర్తి నరసింహమూర్తి గారి సన్మాన పత్రం


contact for సన్మాన పత్రాలు - ఆశీర్వచనాలు
9966455872
                                                                          ------------    పంతుల వెంకట రాధాకృష్ణ (పరాక్రి )
                                                                                                   గ్రేడ్ వన్ తెలుగు పండిట్

27, నవంబర్ 2013, బుధవారం

ఉపకారం - కథ

                          రాజయ్యకు ఒక గొర్రెల మంద ఉండేది. రోజూ అతను ఊరి దగ్గర ఉన్న కొండలపైకి గొర్ర్రెలను తీసుకెళ్ళి మేపేవాడు. ఓరోజు అతనికి వలలో చిక్కుకున్న ఒక గద్ద కనిపించింది. దాన్ని చూసి జాలిపడిన రాజయ్య దాన్ని వల నుండి విడిపించాడు.

కొన్ని రోజుల తరువాత, అతను ఒక రాతిగుండుపై కూర్చుని ఉండగా హఠాత్తుగా ఒక గద్ద వచ్చి, అతని టోపీని తీసుకుని ఎగిరిపోయింది. కోపంతో ఆ గద్ద వెంట పరుగెత్తసాగాడు. ఇంతలోనే అతనికి వెనుక నుండి ఒక పెద్ద శ బ్దం వినిపించింది. వెనక్కి తిరిగి చూసి, ఆశ్చర్యపోయాడు రాజయ్య. అతను పైకి లేవగానే, అప్పటిదాకా అతను కూర్చున్ను రాతి గుండు ఒక్కసారిగా లోయలో పడిపోయింది. తన ప్రాణాలు దక్కినందుకు 'హమ్మయ్య' అని ఊపిరి పీల్చుకున్నాడు రాజయ్య. హఠాత్తుగా, అదే గద్ద తన ముందుకు వచ్చి, అతని టోపీని అతని మీద విడిచిపెట్టి, మళ్ళీ పైకి ఎగిరింది. ఈ గద్ద ఒకప్పుడు తన వల నుండి విడిపించిన గద్దనేనని గ్రహించిన అతడు జంతువులు కూడా తమకు చేసిన ఉపకారం మరిచిపోవు అని తెలుసుకున్నాడు.

25, నవంబర్ 2013, సోమవారం

వానర రాజు కథ

వానర రాజు కథ

ఒకానొక కాలంలో హిమాలయా పర్వత సానువుల్లో దాదాపు ఎనభై వేల సంఖ్యగల ఒక వానరజాతి నివసించేది. వాటన్నింటికీ బలశాలి, బుద్ధిశాలియైన ఒక వానరం రాజుగా ఉండేది. అవి నివసించే లోయ పక్కనే గంగానది ప్రవహిస్తూ ఉండేది. అన్ని కాలాల్లో వాటి దాహార్తిని తీరుస్తూ, ఎండాకాలంలో చల్లదనాన్నిస్తూ జనావాసాల వైపుకు సాగిపోయేది. నది ఒడ్డునే మధురమైన ఫలాల్నిచ్చే ఒక చెట్టు ఉండేది. వసంత ఋతువు వచ్చిందంటే దాని పరిమళం ఆ లోయంతా వ్యాపించేది. ఎండాకాలం ఆ చెట్టు యొక్క దట్టమైన నీడ వానరాలన్నింటికీ ఎంతో ఆదరువు. శరదృతువు వచ్చిందంటే దాని ఘనమైన, తీయనైన పండ్లు వాటి ఆకలిని తీర్చేవి. అలా అవి ఆ చెట్టు నీడన సుఖంగా జీవనం సాగిస్తుండేవి. కానీ వానరరాజు మాత్రం ఆ పండ్లను గురించి వేరెవ్వరికీ తెలియకుండా జాగ్రత్త పడమని వాటికి చెప్పేవాడు. అలా జరిగితే మానవులంతా వచ్చి వాటిని తరిమేస్తారని వానర రాజు భయం. కాబట్టి ఆ కోతులంతా తమ ప్రభువు చెప్పినట్లు ఆ పండ్లను మానవుల చేతిలో పడకుండా కాపలా కాస్తుండేవి. చెట్టు బాగా ఏపుగా ఎదిగేసరికి బాగా పెరిగిన కొమ్మలు నదీ ప్రవాహం మీదకు వాలి ఉండేవి. రాజాజ్ఞ మేరకు ఆ కోతులు ప్రతి సంవత్సరం వసంతకాలంలో ఆ కొమ్మల్లో పూత పూయగానే వాటిని తినేసేవి. మళ్ళీ తాము ఏమైనా పూత వదిలేసి ఉంటామేమోనని వేసవిలో కూడా పండ్లు ఉన్నాయేమో మరొక్కమారు పరికించేవి. ఆ విధంగా ఏ ఒక్కపండూ నీళ్ళలో పడి జనావాసాల వైపు కొట్టుకుపోకుండా జాగ్రత్త పడేవి.
ఒకసారి కోతులు ఒక రెమ్మలో పూతను పొరబాటున వదిలేశాయి. వేసవిలో ఆ పండు కనపడకుండా ఆకులు కమ్మేశాయి. ఆ పండు బాగా పండి నదిలో పడిపోయింది. అలా కొట్టుకొని పోయి దూరంగా ఉన్న రాజు బ్రహ్మదత్తుని స్నాన ఘట్టం దగ్గర జాలర్లకు వలలో చిక్కింది. వాళ్ళు దాని పరిమాణాన్ని,పరిమళాన్ని చూసి అబ్బురపడి రాజుగారికి బహుమానంగా ఇస్తే మంచి ప్రతిఫలం దక్కుతుందన్న ఆశతో అక్కడికి తీసుకెళ్ళారు. ఆ పండు రాజుకే గాక సభికులందరికీ ప్రీతిపాత్రమైంది. వారందరికీ ఇంకా తినాలనిపించింది. బ్రహ్మదత్తుడు వెంటనే ఆ పండు ఎక్కడ నుంచి వచ్చిందో వెంటనే కనుక్కోవాల్సిందిగా ఆజ్ఞ జారీ చేశాడు.
ఆ పండు నదిలో దొరికింది కాబట్టి సైన్యాన్ని నదీ ప్రవాహానికి ఎదురుగా వెళ్ళి వెతకమన్నాడు రాజు. కొన్ని రోజులకు వాళ్ళకి ఆ చెట్టు కనిపించింది. వాళ్ళు తిరిగి వచ్చి ఆ చెట్టు ఇంకా పండ్లతోనే నిండి ఉన్నదనీ, కానీ ఒక కోతిమూక వాటిని తింటూ ఉండటం చూశామని చెప్పారు. రాజు ఆశ్చర్యపోయాడు. అంతమంచి పండ్లు కోతుల పరం కావడమా? అని ఆలోచించి ఆ కోతులన్నింటినీ చంపివేస్తే తరువాత సంవత్సరం నుంచీ ఆ పండ్లన్నీ తమకే చెందుతాయని భావించాడు. కోతులు పారిపోకుండా ఒక భటుణ్ణి ఆ చెట్టుకు కాపలా పెట్టాడు.
కొన్ని కోతులు కొమ్మల చాటు నుంచి ఈ తతంగాన్నంతా తిలకిస్తున్నాయి. అవి ఎంతో బాధతో వచ్చి వానర రాజు దగ్గర తమ గోడు వెళ్ళబోసుకున్నాయి. “మనం ఈ ఆపద నుంచి బయటపడేలా లేము. వేరే చెట్టు మీదకు వెళ్ళాలంటే చాలా దూరం. మనమంతా చనిపోతామేమో!” అన్నాయి.
వానర రాజు కొద్ది సేపు తమ పరిస్థితి గురించి ఆలోచించి ఒక పథకం వేసింది. “నేను బాగా బలిష్టంగా ఉన్నాను కాబట్టి మీకు నేను సహాయం చేస్తాను.” అన్నది.
మరుసటి రోజు ఉదయాన్నే వానర రాజు ఒక్క ఉదుటున నదికి ఇవతల ఉన్న పండ్ల చెట్టు నుంచి నదికి అవతల ఉన్న మరో వృక్షం మీదికి దూకింది. ఆ వృక్షం యొక్క బలమైన, పొడుగ్గా ఉన్న ఊడని పట్టుకుని ఒక కొన బలమైన కొమ్మకు ముడివేసింది. మరో కొన తన కాలికి ముడివేసుకొన్నది. తిరిగి పండ్ల చెట్టు మీదకు లంఘించి ఓ కొమ్మని పట్టుకొంది. కానీ రెండు చెట్ల మధ్య కట్టడానికి ఆ ఊడ పొడవు సరిపోలేదు. ఇప్పుడు తన జాతిని రక్షించడానికి ఒకే ఒక్క దారి ఉంది. అలాగే కొమ్మని పట్టుకొని మిగతా వానరాలన్నింటినీ తన మీద నుంచి దాటి మరో చెట్టు మీదకి దూకి వాటి ప్రాణాలు రక్షించుకోమని కోరింది. కొన్ని గంటల పాటు ఆ ఎనభైవేల కోతులన్నీ ఆ రాజు మీదుగా దూకి నదికి అవతలివైపుకు చేరుకున్నాయి. చివరి కోతి దాటుకుని వెళ్ళేంత వరకూ తన శక్తినంతా కూడదీసుకుని పట్టుకుని ఉన్న రాజు చివరికి బాధతో మూలుగుతూ కిందపడిపోయింది. బ్రహ్మదత్తుడు ఈ శబ్దాన్నంతటినీ విని మేల్కొని ఉన్నాడు. తన ప్రజల కోసం ఆ వానర రాజు పడ్డ తాపత్రయమంతా కళ్ళారా చూశాడు. అది కింద పడిపోగానే సేవకుల్ని నీళ్ళు, నూనె తెచ్చి దానికి సపర్యలు చేయడం ప్రారంభించాడు.
“నువ్వు మీ ప్రజలను రక్షించడం కోసం చేసిన త్యాగం అమోఘమైనది.” బ్రహ్మదత్తుడు వానరరాజును ప్రశంసించాడు.
“వాళ్ళు నాయందు నమ్మకముంచారు. కాబట్టి నేను వారిని కాపాడి తీరాలి. వాళ్ళందరూ సురక్షితంగా బయటపడ్డందుకు నాకు సంతోషంగా ఉంది. నేనిక నిశ్చింతగా చనిపోవచ్చు. కానీ రాజా! ప్రేమ మాత్రమే నిన్ను గొప్ప రాజును చేస్తుంది. అధికారం మాత్రం కాదు.” అని చెప్పి అది కన్ను మూసింది.
వానర రాజు చనిపోతూ చెప్పిన ఆ మాటలు బ్రహ్మదత్తుడు ఎన్నడూ మరిచిపోలేదు. తన జీవితాంతం దాన్ని గుర్తు పెట్టుకునే ఉన్నాడు. దానికోసం ఓ గుడి కూడా కట్టించాడు. అప్పటి నుంచి తన ప్రజలను కూడా అదే విధంగా పరిపాలిస్తూ గొప్ప కీర్తిని సంపాదించుకున్నాడు.

24, నవంబర్ 2013, ఆదివారం

పురందర దాసు కథ

పురందర దాసు కథ


                  పురందర దాసును ఆధునిక కర్ణాటక సంగీతానికి ఆద్యుడు అనవచ్చు. పుట్టుకతో ధనవంతుడూ, పిసినారి అయిన ఆయన పరమ భక్తుడు కావడం వెనుక ఆసక్తికరమైన కథ ఉంది. ఆయన మహారాష్ట్ర లోని పూనా సమీపంలో ఒక పురందరగడ్ అనే కుగ్రామంలో జన్మించాడు. ఇది అప్పట్లో విజయనగర సామ్రాజ్యంలో ఉండేది. ఆయన జన్మనామం శ్రీనివాస నాయక. వారి పూర్వీకులు వజ్రాల వ్యాపారం చేసే వారు. బాగా కలిగిన కుటుంబం. ఆయన కూడా అదే వ్యాపారంలో ప్రవేశించి బాగా ధనం సంపాదించాడు. ఆయన్ని నవకోటి నారయణుడు అని కూడా అనేవారు. అయితే మొదట్లో చాలా పిసినారిగా ఉండేవాడు. డబ్బు తప్ప వేరే ఆలోచన లేకుండా ఉండేవాడు. ఆయన భార్య పేరు సరస్వతీ భాయి. ఆమె పరమ భక్తురాలు. దయాగుణం కలది.  భర్త లోభ గుణం గురించి తెలిసినా ఏమీ చేయలేకపోయేది. ఇలా ఉండగా ఒక రోజు ఒక పేద బ్రాహ్మణుడు తన కుమారుడి ఉపనయనం కోసం ధన సహాయం చేయమని శ్రీనివాస నాయక దగ్గరకు వచ్చాడు. ఆయన్ని తర్వాత రమ్మంటూ పంపించి వేశాడు. అలా ఆ బ్రాహ్మణుని చాలా రోజులు తన చుట్టూ తిప్పుకుంటూనే ఉన్నాడు కానీ ధన సహాయం మాత్రం చేయలేదు. ఆ బ్రాహ్మణుడు కూడా పట్టు విడువకుండా అలా తిరుగుతూనే ఉన్నాడు.  ఆరు నెలలు గడిచాయి. చివరకు ఆ బ్రాహ్మణుడిని ఎలాగైనా వదిలించుకోవాలని తన దగ్గరున్న పనికిరాని రాని నాణేలన్నీ ఒక కుప్పగా పోసి అందులో అతనికి నచ్చిన ఒక నాణేన్ని తీసుకుని మళ్ళీ ఎప్పుడూ తిరిగి రావద్దని చెప్పాడు. ఆ బ్రాహ్మణుడు చేసేదేమీ లేక నిరాశతో అక్కడ్నుంచి వెనుదిరిగాడు.
వెళుతూ వెళుతూ సరస్వతి భాయి ధార్మిక గుణం గురించి తెలుసుకొని నేరుగా వాళ్ళ ఇంటికి వెళ్ళి, ఆమె భర్త తనను చాలాకాలం తిప్పుకుని చివరకు రిక్త హస్తాలతో ఎలా తిప్పిపంపాడో వివరించాడు. ఆమె ఆ పేద సుబ్రాహ్మణుడి పట్ల తన భర్త ప్రవర్తించిన తీరు విని చాలా బాధ పడింది. ఎలాగైనా ఆ బ్రాహ్మణుడికి సహాయ పడాలనుకుంది. కానీ తన భర్త అనుమతి లేకుండా అతని సొమ్ము చిల్లిగవ్వ కూడా ఇవ్వలేనంది. ఆ బ్రాహ్మణుడు కొద్దిగా ఆలోచించి “అయితే మీకు పుట్టింటి వారు ఇచ్చింది ఏదైనా ఉంటే ఇవ్వండి” అన్నాడు. అప్పుడామె తన ముక్కెర ను తీసి ఆయనకు ఇచ్చింది.
ఆ బ్రాహ్మణుడు అది తీసుకుని నేరుగా శ్రీనివాస నాయక దుకాణానికే వెళ్ళాడు. మళ్ళీ తిరిగి రావద్దన్నా ఎందుకొచ్చావంటూ ఆ బ్రాహ్మణున్ని కోప్పడ్డాడు శ్రీనివాస నాయక. ఆ బ్రాహ్మణుడు శాంతంగా “అయ్యా! నేను యాచించడానికి రాలేదు. ఇదిగో ఈ ముక్కెర తాకట్టు పెట్టి కొంత ఋణం తీసుకుందామని వచ్చాను” అన్నాడు.
ఆయన ఆ ముక్కెర చూడగానే తన భార్యదేనని గుర్తు పట్టేశాడు. ఆ బ్రాహ్మణుడిని అడిగితే అది ఎవరో దాత ఇచ్చిందని తెలిపాడు. ఆ బ్రాహ్మణుడిని మరలా రేపు రమ్మని, ఆ ముక్కెరను జాగ్రత్తగా ఇనప్పట్టె లో దాచి  ఇల్లు చేరాడు శ్రీనివాస నాయక. తన భార్యను పిలిచి ముక్కెర ఏదని అడిగాడు. ఆమె పొంతన లేని సమాధానాలు ఇచ్చేసరికి దాన్ని చూపించవలసిందిగా పట్టుబట్టాడు. ఆ పేదబ్రాహ్మణుడికి ఆమే తన ముక్కుపుడక దానం చేసి ఉంటుందని ఆయన అనుమానం.
సరస్వతీ భాయి కి కాళ్ళ కింద భూమి కదులుతున్నట్లయింది. నిజం చెబితే భర్త తన్ని ఖచ్చితంగా శిక్షిస్తాడని భయపడింది. మరో ప్రత్యామ్నాయం ఆలోచించక ఆమె ఆత్మహత్య చేసుకోవాలనుకుంది. ఒక చిన్న గ్లాసులోకి విషాన్ని ఒంపుకొని నోటి దగ్గరకు తీసుకోబోయింది. ఇక తాగబోతుండగా ఆమెకు ఆ గ్లాసులో ఏదో గల గల మని సవ్వడి వినిపించింది. కిందికి దింపి చూస్తే తను బ్రాహ్మణుడికి దానం చేసిన ముక్కెర కనిపించింది. ఆమె తన కళ్ళను తానే నమ్మలేకపోయింది. ఆమె హృదయం ఆనందంతో, కృతజ్ఞతతో నిండిపోయింది. తన ఇంట్లోని కృష్ణ విగ్రహం ముందు మోకరిల్లి దాన్ని తీసుకుని వెళ్ళి తన భర్తకు చూపించింది. దాన్ని చూసేసరికి శ్రీనివాస నాయక కు మతి పోయినంత పనైంది. అది అచ్చం తాను అంగడిలో దాచి వచ్చిన ముక్కుపుడక లాగే ఉంది.
వెంటనే ధృవీకరించుకోవడానికి తన దుకాణానికి వెళ్ళాడు. తను ఉంచిన చోట చూస్తే ఆ ముక్కుపుడక లేదు. ఆయన మాట పెగల్లేదు. తిరిగి ఇంటికి వెళ్ళి అసలేం జరిగిందో చెప్పమని భార్యను ఒత్తిడి చేశాడు. ఆమె జరిగిందంతా పూసగుచ్చినట్లు వివరించింది. ఇదంతా విన్న ఆయన మనసులో సంక్షోభం చెలరేగింది.
తీవ్ర అంతర్మథనం తర్వాత, ఆ బ్రాహ్మణుడెవరో కాదు, సాక్షాత్తూ ఆ విఠలుడే అని తెలుసుకున్నాడు. గత ఆరు నెలలుగా జరిగిన సంఘటనలన్నీ ఆయన కళ్ళముందు కదలాడాయి. ఆయన పిసినారితనం మీద, ప్రవర్తన మీద ఆయనకే అసహ్యం వేసింది. తన భార్య తన కన్నా అదృష్టవంతురాలని అనిపించింది ఆయనకు. తనకు ధనం మీద ఉన్న వ్యామోహం వల్లనే భగవంతుని ఈ విధంగా కష్ట పెట్టవలసి వచ్చిందని తలంచి  తన దగ్గరున్న సమస్త సంపదలూ భగవంతుని పేర దాన ధర్మాలు చేసేశాడు.
అప్పట్నుంచీ ఆయన శ్రీహరి పరమ భక్తుడయ్యాడు. నవకోటి నారయణుడు, నారాయణ భక్తుడైపోయాడు. బంగారు, వజ్రాల నగలతో అలంకరణతో అలంకరింపబడ్డ చేతులిప్పుడు తంబురను చేతబట్టాయి. వివిధ రకాల బంగారు హారాలతో వెలసిన మెడలో ఇప్పుడు తులసి మాలలు దర్శనమిస్తున్నాయి. తన దగ్గరకు దేహీ అని వచ్చిన అనేక మంచి యాచకులను తిప్పి పంపిన తను ఇప్పుడు ఉదర పోషణార్థం భిక్షమెత్తుతున్నాడు. నలుగురితో పాటు జన్మించి నలుగురితో పాటు మట్టిలో కలిసిపోవాల్సిన శ్రీనివాస నాయక పురందర దాసు అయ్యాడు. పుట్టిన కొన్ని శతాబ్దాల తర్వాత కూడా తన కీర్తనల ద్వారా ప్రజల నాలుకలపై నాట్యమాడుతూ ఉన్నాడు. పరసవేది స్పర్శతో రాయి కూడా బంగారమైనట్లు పరమ లోభి కూడా ఆ భగవంతుని కృపతో హరిదాసులకు ఆది గురువయ్యాడు.

11, నవంబర్ 2013, సోమవారం

హిందూమతం – ఓ పరిశీలన

హిందూమతం – ఓ పరిశీలన :- ఆరాధన అంటే? తాను నమ్మిన దైవాన్ని ప్రేమించడమే, ప్రేమించి సేవించడమే. దీనిచే భక్తి,విశ్వాసము,సేవానిరతి,మనోవికాశము కలుగుతాయి.
శో|| ఓం గణేశ గ్రహనక్షత్రాణి యోగినీ రాశిరూపిణీం |
దేవీం మంత్ర మయీం నౌమి మాతృకాం పరమేశ్వరీం ||
ప్రణవనాదము ఓం కార రూపమై గణ,ఈశ,గ్రహ,నక్షత్ర,రాశి, యోగినీ రూపమున మరియు మంత్ర , తంత్ర రూపమున ఏ మహత్తర శక్తి జగత్తునందంతటా మాతృకా రూపమై ఏకమనేక అగుచు పూర్ణమైనిండి యున్నదో ఆ పరమేశ్వరికి నమస్కరించుచున్నాను.
ఉ|| ఏమహనీయ శక్తి పరమేశ్వర బ్రహ్మముకుందులందు తా
సాముగ వర్తిలింగ పృధుశక్తి చరాచర విశ్వ వృత్తి సం
గ్రామ లయంబు సృష్టి పరి రక్షణ లొప్పగ వారు జేతురో . . . ?
నీమము తోడ నామె భువనేశ్వరి నే శరణంబు వేడెదన్ || ( స్వకీయము )
దైవీయ భావ చరిత్ర :- మానవావిర్భావముతో సమాంతరంగానే దైవీయభావము ఆవిర్భవించింది. చరిత్ర పుటల్లో మానవేతిహాసపు జాడలు తెలియవచ్చే నాటికే దైవీయభావ చరిత్ర ప్రాధమిక ప్రకరణాలు పూర్తిచేసుకుంది. పచ్చని చెట్లు… పరిమళించే పూలు, విరిసిన వెన్నెల, మేఘ మాలికల మాటున తళుక్కున మెరిసే మెరుపులు, చిక్కని చీకట్లో ఆశారేఖల్లా మిలమిల మెరిసే నక్షత్రాలు,ఇలా ఎన్నో ప్రకృతి మనోహర దృశ్యాలు అలనాటి ఆదిమానవుని- ఆహ్లాద పరచాయి-ఆశ్చర్య పరిచాయి. పరిశీలింప ఆలోచింపజేసాయి. ఊహ తెలిసిన మానవుడు ఉత్సాహవంతంగా నాటినుండి నేటి వరకు… ఆలోచిస్తూనే ఉన్నాడు. ఈ ప్రకృతి ఇలా క్రమ బద్ధంగా ఎలా ఉంది.
మండే ఎండలు,వడగాడ్పులు,పెను తుఫానులు,వానలు-వరదలు,భూకంపాలుఇలాంటి ప్రకృతి భీభత్సాలు మానవజాతిని భయకంపిత విహ్వలుని చేస్తూనే ఉన్నాయి. మొదట ప్రకృతి అందాలకు పులకించాడు ఆనందించాడు, ప్రకృతి ప్రసాదిత వస్తుసంచయ సమృద్ధికి గర్వించాడు.ప్రకృతి ప్రళయ కరాళా విలయాలకు నశించాడు కృశించాడు.ఎన్నో ఉత్పాతాలనుండి తాను రక్షణ పొందాలనే తలంపుతో ఏ కొద్ది సాధన చేసినా తన ఆలోచనామృతానికి పరవసిస్తూ సుఖించాడు. తన ఆలోచనలే పరిశీలనలకుపునాదిరాళ్ళుగా ప్రకృతినించి తెలుసుకుని వికృతిని కల్పించుకుని మురిసిపోయాడు. అదిగో ఆ ఆలోచనా భావ స్రవంతిలో భౌతిక సుఖవాదము-దైవీయభావము కవల పిల్లల్లా జన్మించాయి.
ప్రకృతి ప్రసాదిత వస్తులోహ సంచయముతో శీతోష్ణాదులనుండి రక్షించుకుని పర్ణశాలనుండి పదంతస్థుల భవనం వరకు నిర్మించుకునే సామర్ధ్యాన్ని పెంపొందించుకున్నాడు. మరో మాటలో చెప్పాలంటే ప్రకృతి ప్రసాదిత వస్తు సంచయానికి— స్థల-కాల-రూపోపయుక్తత కల్పించుకోవడామే మానవ విఙ్ఞానం భౌతికశాస్త్రంగా పరిఢవిల్లింది. శాస్త్రాన్వేషణా ధ్యేయం ప్రకృతి నుండి తనను తాను కాపాడుకోవడం,రక్షణ పొందడం,సుఖానుభూతి పొందడమే.ఐతే గొప్ప తిరకాసంతా ఇక్కడే ఉంది.ఆకలిబాధకి తట్టుకోలేక తిన్నాడు,దాహపు బాధకి తట్టుకోలేక తాగాడు, శారీరక సౌఖ్యాలకై తహతహపడి స్త్రీ పురుషులు సంగమించారు.బాధానివారణమే సౌఖ్యమని భ్రమించారు.భౌతిక వాదము ఇచ్చే సుఖము ఆధ్యాత్మిక వాదుల అంతరంగము వేరువేరై పేరుకున్న అభిప్రాయాల బేధాన్ని కల్పించాయి.మరి ఆధ్యాత్మికవాదుల భావనచూస్తే……..
ఈ ప్రకృతి ఇలా లయబద్ధంగా ఎందుకు నడుస్తోంది? దీనిని ఇలా నడిపిస్తున్న అదృశ్య శక్తి ఏది? భౌతిక శాస్త్రాలు ఎంత అభివృద్ధి పరుచుకున్న కాల పరిధిలో అవిఅరిగి విరిగి పోతున్నాయి.భౌతికశాస్త్ర వస్తు సంచయంతో పొందలేని రక్షణ ఆ అదృశ్యశక్తి నుండిపొందగలగాలని పరిశీలింప కృషిచేసారు.అదే దైవీయ భావనకు అంకురార్పణ అయ్యింది.
మానవ చరిత్రలో పలుమార్లు భౌతిక-ఆధ్యాత్మిక వాదాలు తమదే పైచేయంటూ పరుగు పందాలు తీసాయి.ఈ దైవీయ భావమే పలు దేశాల్లో అనేక మతాలుగా వెల్లివిరిసింది.కాబట్టే మానవ చరిత్రలో మతం కూడా అనేక కల్లోలాలుసృష్టించింది.రాజ్యాల స్థాపనలో మత యుద్ధాలు,కులాల కుమ్ములాటాలు కోకొల్లలు.చరిత్ర ఇలా ఎంత కాలమైనా అనంతంగా సాగుతునే ఉంటుంది.
శ్లో || స్త్రీ రూపం చింతయేత్ దేవీం – పుం రూపంవా విచింతయేత్ |
అధవా నిష్కళం ధ్యాయేత్ – సచ్చిదానంద లక్షణమ్||
ఆకార,వికార,విచార,విదూరము-లింగ,పురుష,వచన,విభక్తిఅభేధ్యము అగునది భగవత్ స్వరూపము. అట్టి సచ్చిదానందమూర్తి (భూమ) శబ్దోక్తము. నిరాకార సచ్చిదానంద స్వరూపముగా విరాట్ నర్చించుటయే మేలు అదే తపస్సు. దీనికి ఎంతో మనో ధృఢత్వము నిగ్రహము కావాలి కావున అందరూ తపస్సులు కాలేరు కదా.
మనో నిగ్రహం సాధించడానికే విగ్రహారాధన పరికల్పితమైనది. ఏ రూపూ చేని దేవునకు అనేక రూపములు, ఏ పేరూ లేని దేవునికి శతకోటి నామములు. మరలా మధ్యలో మన సంకల్పములు,మన కాల్పనికతకు తగ్గట్టు ముక్కోటి దేవతా మూర్తులు. విఘ్నములు కలుగకుండా విఘ్నేశ్వరుని పూజలు,ధనము కావాలంటూ లక్ష్మీ కుబేరులను,ఇలా మన కోర్కెలకు అనువైన దేవతలకు అనువుగా సృజింపబడిన ఆగమోక్తములు. ఐనా ప్రకృతిలో గల అణువణువునూమన హైందవ సంప్రదాయము దైవముగనే తలచినది.నమక చమక రుద్ర సూక్తములుసైతము పై భావనను ప్రకటించుచున్నవి.ఒక్క మాటలో చెప్పాలంటే హైందవ జీవన శైలిలో మిళితమై ఆధ్యాత్మికాభావము సర్వ పల్లవ పులకితము. మన్మతః సమ్మతః తత్ మతః అను భావముతో అనేక బోద్ధలు అనుయాయులు హైందవ ధర్మమున గలరు.హిందూ మతము అనుట తప్పు. హైందవ దేశమున ఎన్నియో మతములవారు తమ భావజాల సంచయమును యుగధర్మానుసారము మనుగడింప జేసిరి.

మ|| ధన తంత్రమ్మున గణ్యతన్ బడయగా తంత్రఙ్ఞుడన్ గాను, క
మ్మని మంత్రమ్ముల భక్తితో గొలువగా మంత్రఙ్ఞుడన్ గాను, నూ
తన యంత్రమ్ముల నిన్ను జేర జన శాస్త్రఙ్ఞుండనే గాను, నీ
యను రాగాంబుధి ముంచి తేల్చగదవో? అఙ్ఞుండ నన్ బ్రోవవో? (స్వకీయము)
శ్లో// నిర్గుణా సగుణా శ్చేతి – ద్వివిధా ప్రోక్తమనీషిభిః /
సగుణారాగి భిస్సేవ్యా – నిర్గుణాతు విరాగిభిః //
కామ్యులగు మానవులు సగుణ రూపమున, నిష్కాములు నిర్గుణ రూపమున భగవంతుని సేవించుచున్నారు. కామ్యాకామ్య సంకల్పమే కర్మ ముక్తి మార్గ ప్రేరకమై యున్నది.
వివిధారాధలు:- ౧. మనస్సున స్థిర సంకల్పముతో విశ్వసించుట మానసిక ఆరాధము.ఇందు భౌతికవస్తుచయము అనగా ధూప, దీప, నైవేద్యాదికములు నామమాత్రములు.
౨, వాక్కు:- భగవన్నామమును నోటితో పలుకుట భజించుట వాక్కు.ఈ ప్రక్రియనందు భజన,కీర్తన,మంత్రజపాదులు ప్రాధాన్యత వహించును.
౩. కాయము:- శరీరావయవములు కదల్చి, యోని ముద్రాదుల దాల్చి, ధూపదీప నైవేద్యములర్పించి జపతప హోమాదులు చేయుట ప్రాధాన్యత వహించును.
౪.కర్మలు:- పూజ,జపము,హోమము,తర్పణము,మార్జనము,బ్రాహ్మణ భోజనాదులనే షడంగములు నిర్వర్తించుట ప్రధానమై యుండును. మనోవాక్కాయ కర్మంబుల ప్రబల విశ్వాసముతో తాను నమ్మిన దైవమును కొల్చుటయే ఆరాధన.
ఉ|| శ్రీగిరిజా సరస్వతుల చిన్మయరూపిణి లోకమాతకున్
రాగిణి విష్ణు చేతనకు రాసవిలాస విహారలోలకున్
భాగవిభాగ రాశినత భాసిత సర్వగ్రహాది మూర్తికిన్
సాగిలి మ్రొక్కెదన్ జయము సౌఖ్యము గూర్పగ విశ్వశక్తికిన్ || (స్వకీయము)
హైందవ సాధనారాధన by
P.V.RADHAKRISHNA (PARAKRI ) CELL – 9966455872

31, అక్టోబర్ 2013, గురువారం

"ఆంధ్రకేశరి ఆత్మ" - వ్యాసం

                                                     * ఆంధ్రకేశరి ఆత్మ*
                                         {టంగుటూరి ప్రకాశం ఏకాపాత్రాభినయం} ------పరాక్రి
( వేషధారణ : ప్రకాశంధరించే పంచి,షర్టుగుండెకి అడ్డుగా సాలువాదానిపైనల్లకోటు,కళ్ళజోడు,వృద్ధాప్యదశ )

                                                                                -1-

                                                  ఒరేయ్....... ఏమిటర్రా అలా బిక్క మొహం వేసుకుని చూస్తారు. నన్ను గుర్తు పట్టాలా . నా పేరున ఓ జిల్లా పేట్టుకున్నారు. అన్ని జిల్లాల్లోను నా చిత్రపఠాలు పెట్టుకున్నారు అయినా నేను  గుర్తు రావడం లేదా ,
           ఒరేయ్.....ఒరేయ్..... నన్ను మీరంతా వేగం మరిచిపోలేరర్రా ! నేను
సింహాన్ని . మికో దృష్టాంతం చెబుతా వినండి.
                           ఒకప్పుడు  దేశం మొత్తం మీదా నాలుగే నాలుగు సింహాలుండేవి. అదేరా స్వాతంత్రోద్యమ కాలంలో పంజాబ్ , కర్నాటక , మహరాష్ట్రలలో మూడు  సింహాలు ఉద్యమ స్ఫూర్తితో తిరుగుతుండేవి. "లాల్- బాల్ - పాల్ " అని మీరు వినేవుంటారు. ఆ సింహాలు పేర్లు.
             జాతీయ చిహ్నంగా సింహాలు భావిస్తున్నాయి. జాతీయ చిహ్నమైన సింహాలలో కూడా కనబడని నాలుగో సింహం వెనక ఉంది,
అదేరా నేను ....., "ఆంధ్రకేశర్ని" , "నేనే నర్రా ! ఆంధ్రకేశరి ప్రకాశాన్ని "
మీరు మరచి పోలేదే. మరేంటలా చిత్రంగా నన్ను చూస్తారు. గుర్తించలేదా?
        " మీరు నన్ను గుర్తు పట్టలేక పోవడానికి కారణం ? "  ఓ హో నా ఈ వేషమా ? అవునర్రా ! నిజమే ఈ ఆంధ్రకేశరి నిజస్వరూపం మీరు నల్లకోటలో  చూడలేదు గదూ. 
                                            -2-
 " అయినా నల్లకోటును చూసి  జడుస్తారేమర్రా ?" అవును లెండి. మా వృత్తిలో కర్కశతర్కంతో కాకిని గ్రద్దగా , నందిని పందిగా మార్చేస్తామనికదా!
న్యాయం కోసం వాదించాలి మరి. ఒరేయ్... ఒరేయ్.....అన్యాయాన్ని గెలిపించలేదురా వీడు. "లయ్యర్ల " అభిజాత్యంతో నల్లకోటంటేనే అబద్ధాల 
పుట్టగా భావిస్తున్నారీ  రోజుల్లో.............. 
  "తప్పురా " అల్లాంటి అబద్దాల కోరుని, కోర్టు గుమ్మం ఎక్కనీకండి.దండించండి. కాని వృత్తికే  కళంకం కట్ట కండర్రా!
అర్ధణా కేసు నుండి ఆరుకోట్ల కేసుదాకా , బోత్ క్రిమినల్ సివిల్ కేసులో నేను న్యాయమని భావిస్తేనే వాదించామరా!"
                                                    నా చిన్నప్పటి నుండి బారిష్టరు కావాలనే కలలు గన్నను. నాకు పితృ సమానుడైన ఇమ్మనేని హనుమంతరావు నాయుడు మాష్టారు నన్నందుకే మెచ్చుకునే వారు. ఒరేయ్.... ఒరేయ్..... ఈ బ్రతుకు బడిలో అందరూ విద్యార్ధులేరా.
           గురువు మీద మీకు నమ్మకం లేక. గురువుగారికి మీ మీద నమ్మకం లేక పోతే ఇంక మీకు చదువులెందుకర్రా!
చదువు-"కొన్న" సర్టిఫికేట్టు కాల్చడానికి.
         నాయుడు గారు నా చేత నాట కాలాడించే రోజుల్లో నేను "రంగ నక్షత్రాన్ని"
     "కాని చదువు తో నాటకాలాడ లేదర్రా!"   
                                                   -3- 
                         వీధి  దీపాలు  చిత్తు కాగితాలు కూడా  నా  చదువుకు పనికి  వచ్చాయి. పట్టుదల - కృషి ఉంటే సాధించలేనిదేమిటర్రా ? " ఎందరో 
సహాయ పడతారు. దానికి నా జీవితమే సాక్ష్యం. కష్టపడాలి శ్రామించాలి. నన్ను నా జీవితాన్ని చూసైన నేర్చుకుంటారని చెబుతున్నా.
                    ప్లీడరుగా నన్ను నిలబెట్టింది నా నీతి - నిజాయితీయే అన్యాయం  చూస్తే నేను తట్టుకోలేనర్రా !
                  బ్రిటీషు అధికారుల కపటదుర్నీతి , జాత్యహంకారం , పరపీడన
నన్ను కలవర పెట్టాయి. వాళ్ళ అన్యాయానికి ’అంతం చూడాలని ’  ఆవేశం
 నన్ను తట్టిలేపింది.
                అప్పుడు స్వాతంత్రోద్యమంలో  తలదూర్చి  ఈ నల్ల కోటు విప్పేశానర్రా ! [  కోటు విప్పాను . ఇప్పుడు జాతీయనాయకుని రూపం ]
ఇప్పుడు  గుర్తించారా . మీ ప్రకాశాన్నీ"
                                             తెల్లవాడి తుపాకీ గుండుకి , గుండె ఎదురొడ్డిన ఈ టంగుటూరి ప్రకాశాన్ని ఆ......... మీ అందరికి గుర్తే. ప్లీడరు వృత్తికి స్వస్తి చెప్పి నే సంపాదించిన తృణమో  పణమో స్వాతంత్రోద్యమం లోనే ఖర్చు పెట్టా.
ఒరెయ్...ఒరేయ్.. గొప్పగురించి కాదర్రా, చెప్పుకుంటా, నే చెప్పిన మాటలు మర్చి పోకండి. 
     దేశం మీకే మిచ్చిందన్నది కాదర్రా ! దేశానికి మీరేమిస్తారో  ఆలోచించండి . అది చెప్పండి .
          ఆస్ధి-అంతస్థు ఈ రోజుంటాయి రేపు పోతాయి . డబ్బుదేముందరా- ఈ వేళ మన జేబులో రేపు ఇంకొకడి జేబులో.
         కనబడని నాలుగో సింహాం నేనని గొప్ప చెప్పుకోవడంకాదర్రా! సింహం గడ్డి తినడని చెప్పడమే నా ఉద్దేశ్యం.
                                                    -4-
నేనూ సంపాదించాను లక్షలకు లక్షలు ........ గుర్రబళ్ళ రాఠీవి , దర్పం , విలాసం , ఏ ముందిరా అందులో సుఖం !
   " పక్కవాడి ఆకలి ఎరుగని సుఖం
      తోటి వాడి బాధ చూడని సుఖం
     నా  అన్నవాడి  ఆర్తనాదం  వినిపించుకోని  సుఖం " " హు ! ...
       అందుకేరా!  ఒరేయ్ ఆసుఖాలు నాకు వద్దు అనుకున్నాను. పదవులు........ సుఖాపేక్ష కొరకు  కాదనేది నా సిద్ధాంతం. సమ సమాజ స్థాపన నా ద్యేయం. నే స్థాపించిన "గ్రామ స్వరజ్యం" పత్రికలో ప్రతి పేజిలో ఈ దృక్పథం కనిపిస్తుంది.
   ఉమ్మడి రాష్ట్రాల ప్రధమ ముఖ్యమంత్రి "జమీందిరీ ఎబాలిషన్" చట్టం తెస్తూ , ఎందరికో విరోధినయ్యాను. పార్టీ  రాజకీయాలతో ముఖ్యమంత్రి పదవినే వదులుకున్నాను. అయితేనే మర్రా!?...........
               నాగార్జున సాగర్  ప్రోజక్టులా నా కీర్తీ  శాఖరాలకు అడ్డుగోడలు కట్టేదెవరు. గోదావరి  వేద ఘోషలో కృష్ణమ్మతల్లి పయః పీయూషముతో నా 
ఆంధ్రదేశం పరితప్తమై, మళ్ళీ నా చుట్టూ సుళ్ళు తిరిగి పరవళ్ళు త్రోక్కుతూ " పదవీ - పట్టాభిషిక్తం " చెయ్యలా. పువ్వూల దండలు - నా పుట్టిన రోజున ముంచెత్తినపుడు  నేనన్న మాట గుర్తు పెట్టుకోండి. 
  "  ఒరేయ్ పువ్వులెవరైనా తింటారటర్రా !" ఈ సన్మాన పత్రాలకు బదులు - విజ్ఞాపన పత్రాలే ముఖ్యం. అదే భావంతో దేశ సేవలో అంకితమవ్వాలని కోరుకున్నా...............
                                                  -5-
          నాకు తెలుసు . ముఖ్యమంత్రి పుట్టిన రోజుకి , ప్రకాశం పుట్టిన రోజుకి చాలా తేడా  ఉంటుందని , నాకు ముందే తెలుసు మా వెంకటేశ్వర రావు బాధపడ్డాడు. పదవి లేనప్పుడు  నా పుట్టిన రోజుకి ఎవరూ రాలేదని.
                      రాజమండ్రీ  రైల్వేస్టేషన్ లో అరటిపళ్ళు కొనుక్కోడానికి కూడా డబ్బులు లేకపోతే , స్టేషన్ మాష్టర్ క్యారేజీతో నా భోజనం ముగిసిందంటే ......... దానికి కారణం
           
               నోరు మంచిదైతే ఊరు మంచిదని -
               ఏరికి పిడికేడు ధనమని- 
              " సామెతలొచ్చి  సాక్ష్యం చెప్పాలా".
            కష్టాలు మనుషులకు కాకపోతే  మానులకోస్తాయిటర్రా !
            నిలదోక్కుకున్నవాడే  నిండుమనిషి
             డా|| అక్కిరాజు రమాపతిరావు నా కధ వ్రాస్తాడని, ఇంద్రాదుమ్న మహరాజుతో నన్ను పోలుస్తాడని నే కలలు గన్నానా-
విద్యార్ధులు నా చరిత్ర చదువు కుంటారనుకున్నానా-
జరిగేవి జరగక మానవు-
ప్రాణాలు శాశ్వతం కావు-
 ఒరేయ్....ఎవరూ ఈ భూమి మీద కలకాలం ఉండి పోరర్రా!
ఉండి పోయేవి మంచి చెడ్డలే.
వ్యక్తుల కన్నా - సంస్ధలు- వ్యవస్ధలు- వాటన్నిటకన్నా
దేశం- శాశ్వతమైనవి.
ఈ దేశానికి సేచ్ఛా వాయువులు కేల్పించడానికి, మేము ఆరోజుల్లో పడ్డ శ్రమ తెలుసుకొన్న తర్వాతనైనా స్వాతంత్ర్యం-స్వచ్ఛని కాలరాంకుకండి.
రాజకీయాలు- ఈ భూమికి క్రొత్తవి కావు
ఓ సారి భారతం చదవండి-" 
              

22, అక్టోబర్ 2013, మంగళవారం

విజయ నగరం పైడి తల్లి అమ్మ వారి పండుగ - పైడిమాంబ పంచకం

                              పైడిమాంబ పంచకం
      
                        


       ( విజయనగరం పైడితల్లమ్మవారి దర్శనానంతరం  1984 లో ఈ పరాక్రి పైడిమాంబ పంచకం విరచించడమైనది. ఈ రచనకు ప్రేరణ రావణబ్రహ్మ కృతమైన శివస్తుతి.  )                         

     1. శ్లో  || సుందరాననా మరంద కుందచందనా స్వబంధు గంధసుందరీ
              ఇందిరా ప్రభాప్రసూన ఇంద్రియాణి  మందిరాసురాజ వందితా
              విద్య నాగరీ గరీయశీ విశేష మేదినీ గజేంద్ర నందినీ
              హే పురాధి దేవతా యశస్వినీ సుఖప్రదా సు పైడిమాంబికా ||

       2. శ్లో  || క్షీరసాగరోద్భవాని వాణ్యపర్ణ కంకణా కలాప నిక్వణా
             మత్కవిత్వ చిత్తకామినీ  సచిత్రరాగ రూపిణీ పరాగిణీ
             భుక్తిముక్తిదాయినీ స్వశక్తియుక్తిచారిణీ ప్రసారిణీఘృణీ
             హే పురాధి దేవతా యశస్వినీ సుఖప్రదా సు పైడిమాంబికా ||

  3. శ్లో || 
  సృష్టి పాలకే కపాలికే జ్జ్వలజ్జ్వల ప్రభాల కీల కాళికే
              యోద్ధబుద్ధివర్ధినీ  స్వరాజ్య వౄక్షకాండచారిణీ విహారిణీ
              విశ్వమోహినీ విశేష గాత్రపోషణా విశాలనేత్ర భాసురా
              హే పురాధి దేవతా యశస్వినీ సుఖప్రదా సు పైడిమాంబికా ||

     4.  శ్లో || క్షపాత వర్జితా విలక్షణ ప్రచార చక్షు దుష్టశిక్షకీ
           అక్షర ప్రమోద యక్షిణీ సుశిక్షణా క్షణక్షణ ప్రదక్షిణీ 
           మల్లికామతల్లికా ప్రఫుల్ల పల్లవీ నవీన కీర్తి వల్లకీ
           హే పురాధి దేవతా యశస్వినీ సుఖప్రదా సు పైడిమాంబికా ||

    5. శ్లో || పావనీ నమోనమో  మహద్నిరూఢకాత్మ  శాంతి క్రాంతి  కారణీ
          యోగినీ నమోనమో భవద్గుణాలవాల  హే! మదుక్త మాతృకా
          నూత్న ఛంద వైభవాంగ విక్రగంధి రూపిణీ, " పరాక్రి " పంచికా
          హే పురాధి దేవతా యశస్వినీ సుఖప్రదా సు పైడిమాంబికా ||

           ఇది పరాక్రి విక్రగంధి నూతన ఛందో పంచకం.
కృకృత్యుడనైతే ధన్యుడను.

11, అక్టోబర్ 2013, శుక్రవారం

Telangana is inevitable, predict astrologers in Times of India by P.V.RADHA KRISHNA ALSO









P.V.RADHAKRISHNA,
CELL :
+91 9966455872


Email :
parakrijaya@gmail.com

27, సెప్టెంబర్ 2013, శుక్రవారం

సమైక్యాంధ్ర లో శ్రీ మదాంధ్ర భాగోతం



సమైక్యాంధ్ర  శ్రీ మదాంధ్ర భాగోతం


 పోతన వ్రాతగాదె తలపోతల కూతల చేతనంబుతో
నీత సమైక్య రాగ ముదయించెను భావితరాల కోశమై
నూతన శీర్షికా ప్ర కట నుద్యమ భాషల భేష జంబుతో
జూతురు సమైక్యమన్న జన జృంభిత గుంభిత భావజాలమున్ //

రాజరికము పోయె రాజ్యంబు గలదేని
ప్రజల సామ్యమొచ్చె ప్రభుత కొరకు
రాజకీయమందు రాక్షస క్రీడలా 
నాడు పాడిగాదు నేడు నదియె //

తంత్రమేది గాని తాదాత్మ్యమొక్కటే
స్వేచ్ఛలేని నాడు కుచ్ఛితంబు
తుచ్ఛమైన దాని తూతూల మంత్రాన 
సాగమింతునేమి బాగుగలదె //

మూడు ముక్కలాట ముచ్చట గొల్పుచో
ఆటగానె జూతురాంధ్రులెపుడు
పాటు గల్గునాడు పాల్గొనకుందురా
తాట నిలపగలరు తపన నొడమి //

ఉన్నది ఉన్నది గానొప్పు 
కన్నుగవంటేనె రెండు గానుటకొప్పున్
తిన్నగ జూడని పక్షము 
అన్నన్నా వెతల గోడు హస్తినకొచ్చెన్  (?) //

ముచ్చటింపుగాదు ముచ్చెమటలు బట్టు
మూర్ఖ యోచనంబు మూర్కొనంగ
అచ్చతెనుగు నేల నిచ్చకంబులదేల
సాధ్యపడదు మీకు భాద్యులార //



9, సెప్టెంబర్ 2013, సోమవారం

3, సెప్టెంబర్ 2013, మంగళవారం

గుంటూరు శేషేంద్ర శర్మ గారి "షోడశి" రామాయణ రహస్యములు



గుంటూరు శేషేంద్ర శర్మ గారి "షోడశి" రామాయణ రహస్యములు  పుస్తకానికై క్రింద ఇవ్వబడిన అడ్రస్ కు సంప్రదించ వచ్చు.

Saatyaki
S/O Late.G.Seshendra Sharma
32,JanathaFlats
Kanthi Sikhara Complex
Pungagutta(Opp:Model House)
Hyderabad:A.P:INDIA
Phone:9441070985, 7702964402
Website:http://seshendrasharma.weebly.com


24, ఆగస్టు 2013, శనివారం

అప్రశిఖ కథ

అప్రశిఖ కథ

అనగా అనగా రాజ్యం లో ఇద్దరు మిత్రులు ఉండేవారు. వారిద్దరికి ఇద్దరు పుత్రులు. తమ పిల్లలు మంచి విద్యావంతులు కావలని వారికోరిక. వారికోరిక కు తగినట్లు తమ రాజ్యానికి దూరంగా మహాముని ఉన్నాడని అతడు సకల శాస్త్ర పారంగతుడని తెలుసు కున్నారు.

        పూర్వం విద్యాభ్యాసానికి గురు కులాలకు విదార్థులు వెళ్ళి విద్యను అభ్యసించే వారు. కావున తమ పిల్లలును కూడా దూర దేశాలకు పంపి విద్యావంతులని చేయాలని వాళ్ళు అకాంక్షించారు. మిత్రుల ఇద్దరి పిల్లలు "అజేయుడు - విజేయుడు" కూడా స్నేహంగా ఉండేవారు. ఏలాగైతేనేం పిల్లలకు కూడా దేశాటన చేసి విద్యా విఙ్ఞానాలను సముపార్జించాలని కోరిక కలిగింది. వారి కోరిక మేరకు వింధ్యాటవిలో విద్యా నంద స్వామి వద్ద కావ్యాలంకార తర్క మిమాంశాది అనేక శాస్త్ర విషయాలు నేర్చుకొని పెద్ద వారై "అజేయుడు - విజేయుడు" ఇంటి ముఖం పట్టారు.

       అయితే, దారిలో అనేక రాజ సంస్థానాలలో వారి ప్రతిభా పాటవములను మెచ్చు కొంటూ అనేక రాజన్యులు సత్కారములు విలువైన కానుకలు సమర్పించారు. వచ్చిన వన్నీ "విజేయునికి" మాత్రమే అజయునికి ఏమీ రాక పోవడం తో మాత్స్యర్యంతో తన మిత్రుడైన విజయుని చంపాలని నిశ్చయించు కున్నాడు.  తన మిత్రునికి విషయం చెప్పి మరీ చివరి మాటగా మీ తల్లి దండ్రులకు ఏం చప్ప మంటావ్. నువ్వు గొప్ప పండితుడివే కావచ్చు, ఈ కానుకలు నాకే వచ్చాయని చెప్పవచ్చు అయిన నువ్వు నేను ఒక చోట ఉంటే నేను నీ కంటే గొప్ప వాడిని కాలేను. చివరి సారిగా ఒక అవకాశం నీకిస్తున్నా. కాని నువ్వు చెప్పే మాటలో నేను నిన్ను చంపుతున్నాననే అర్థం ఉండకుండా చెప్పు " అని అన్నాడు అజేయుడు.

 విజేయుడు "అప్రశిఖ" అని చెప్పాడు 

 శ్లో | |  నేన తవ పుత్రస్య |
        ప్రసుప్తస్య వనాంతరే | |
        శిఖ మాక్రమ్య పాదేన | 
        డ్గేన శిరః ఖండితః | |    

 అనువాదం : -  శ్రీమతి జయ మహేశ్వరి
  య్య గురు వాఙ్ఞ నిలు జేర నరయు చుంటి |
  ప్రతిభ నోర్వక పగను కారడని మధ్య | |
  శిఖను కాలి తో త్రోక్కుచు సిగ్గు విడిచి |
  డ్గమున  మిత్రుడే నన్ను కాల పరిచె | |
  
 అజయుడు మోసు కొచ్చిన సందేశం కాల క్రమంలో అతని మోసం 
బయట పడతాయి. తెలివైన వాని మాటలు ఏ నాటికీ నిలిచిపోతాయి.
 నిజం నివురు గప్పిన నిప్పే కదా ||

4, ఆగస్టు 2013, ఆదివారం

కోడినక్కపిల్ల కథ

 కోడినక్కపిల్ల కథ
                 లోకంలో అదృష్టవంతులతో పాటు అమాయకులు ఎందరో ఉంటారు. అమాయకులతో పరాచకాలు ఆడితే  కొన్ని సందర్భాలలో  ప్రమాదాలు కూడా ఏర్పడతాయి. ఈ కథనంలో అనగనగా ఓ అమాయకుడు !
అతని పేరు "అబద్ధం"   పేరేంటి ఇలా ఉంది అనుకోకండి. అతని తల్లిదండ్రులకు ఎంతో కాలానికి లేక లేక పుట్టిన సంతానం. అబద్ధం అని పేరు పేడితే మంచి ఆయుర్ధాయం కలవాడు అవుతాడని  ఓ సాములోరు చెప్పడంతో తమ సంతానం నిలబడ్డానికి ఈ పేరే ఖరారు చేసుకున్నారు అతని తల్లిదండ్రులు అతను పుట్టడానికి ముందే.

                 అబద్ధం నిజంగానే అబద్దాలు తెలియని అమాయకుడు. పెళ్ళీడు రావడంతో అతనికి పెళ్ళిచేసి తొలి పండగకు అత్తవారింటికి పంపదలచింది అతని తల్లి.ముందుగా కొన్ని సూచనలు చేసింది.

            ఓ రేయి "అబద్ధం" నొటిలో వేలు పెడితే కొరకడం కూడా తెలియని నీ అమాయకత్వాన్ని చూస్తే జాలేస్తోంది.
దానికి తోడు మృదువుగా  మాట్లాటడం కూడా నీకు నేర్పలెమో ? నీ మాటలలో కల్మషం లేక పొయినా.............. కఠినంగా మాట్లాడకూడదురా , అత్తవారింటికి కూడా వెళుతున్నావు ఎక్కువగా మాట్లాడకుండా ముచ్చటగా మూడు మాటలు మృదువుగా మాట్లాడు. అంటూ తల్లి హితబోధలు చేసింది. నీ తండ్రి పోయి ఏడ్నార్ధం అవుతోంది. నేనెంత కాలమో........? కాస్తా తెలివిగా ఆలోచించి అన్నిపనులు చూసుకుంటూ ఉండాలి. రామాపురం వెళ్ళి నీ భార్యను తెచ్చుకుని ఇక్కడ హాయిగా జీవించు. నేనా కాశీకి పొతున్నాను. అంటే కాటికి పోవడం లాంటిదేరా! భార్యతో కూడా మృదువుగా మాట్లాడుతూ నీ పనులు చెక్కబెట్టుకోవాలి. నేను మళ్ళీ తిరిగి వస్తానని ఆశించకు.

                   అమాయకుడు అయిన అబద్ధానికి తల్లి మాటలలో మృదువుగా అన్న పదం బాగా నచ్చింది. మెత్తగా ఉండేవి ఏమిటా అని తెగ ఆలోచించాడు. అవి కూడా మూడు కావాలి కదా. ఇల్లంతా కలయ దిరిగి మొత్తానికి ఎలాగయితేనేమి మెత్తగా ఉండే మూడు పదాలను పట్టుకున్నాడు. మొదటగా తణివి చూసి మరీ ఆ..... దూది మెత్తగా ఉంది. తరవాత వెన్న మెత్తగా ఉన్నట్లు తోచింది. పెరట్లోకి వచ్చి వెతికాడు కట్టేసిన దున్నపోతు ముడ్డిమీద చెయ్యి వేసాడు అరే ఇదికూడా మృదువుగానే ఉంది. అమ్మయ్య... నాకు కావల్సిన మూడు మాటలు దొరికేసాయి. అనుకుని అత్తవారింటికి పయనమయ్యాడు.
                        రామాపురం చేరుతూనే మూడు మాటలూ నెమరు వేసుకుంటూ అత్తవారింట్లో ప్రవేశించాడు. అంతా చుట్టూ చేరారు, బాబూ బాగున్నారా!  అత్తమామలు పలకరించారు. బావా బాగున్నావా ! ముగ్గురు బామ్మర్దులు ముక్త కంఠంగా పలకరించారు. చిన్నా పెద్దా అంతా మాటాడండి బాబూ అంటూ చుట్టుముట్టారు. భార్య వైపు ఓ చూపు చూసి మిన్నకున్నాడు అబద్ధం . ఏమండి చెప్పండీ లేకపోతే నీ మొగుడు దద్దమ్మే అంటూ నన్ను వెక్కిరిస్తారంతా, ఏం చెప్పాలో తెలీక భార్య వైపు గిరుక్కున తిరిగి చురుక్కుమనేలా చూస్తూ...... ఏం చెప్పమంటావే దూది, వెన్న, దున్నపోతుముడ్డి చాలా? 
               అల్లుడు గారు ప్రయాణ బడలికలో ఉన్నారని గ్రహించి అతని మాటలు పట్టించుకోకుండా తమ ఆతిథ్యానికి మురిసిపోవాలని భావిస్తూ అంతా సపర్యలు చేసారు. బావమరుదులు కూడా అనునయంగా మాట్లాడుతూ  బిగుసుకున్న అతని బిడియాన్ని సడలించే ప్రయత్నంగా మర్నాడు సాయంత్రం వరకూ ఆగి తమ పొలానికి తీసుకెళ్ళారు. వాళ్ల పనీ అవుతుంది. బావగారికి వ్యాహ్యాళిగా ఉంటుందని వారి భావన.
                             ఆ.... ఊ..... అంటూ తప్ప అబద్ధం ఏమీ మాట్లాడలేదు. అంతా గమనిస్తున్న వాడిలా ప్రవర్తిస్తూ నేను పట్నపోడినని మీది పల్లెటూరని అనుకోపోతే ఈ విషయం చెప్పండి అని నోరు విప్పాడు. బావగారికి వ్యవసాయం గురించి తెలియదన్న సంగతి వాళ్ళు గ్రహించేసారు. ఇది శెనగ చేను అన్నారు కదా, మరి శెనక్కాయ లేవి అని ప్రశ్నించాడు అబద్ధం. కాయలు భూమిలో ఉంటాయ్ బావగారూ!నీజం చెప్పినా తనను ఆటపట్టిస్తూన్నారు అనుకున్నాడు "అబద్ధం". నేల లోన్చి కాయలు పీకి తాటికమ్మలేసి కాల్చి ఇచ్చే వరకు అతని ఆశ్చర్యనికి బావమరుదులు అబ్బుర పడ్డారు. 

                    ఇంతలో చీకటి పడడం తో బుడ్డి దీపాలు వెలిగించేరు అంతా! పట్నంలో పెరిగిన అమాయకత్వం చేత ఇవెలా వచ్చాయి అని అడిగాడు "అబద్ధం". వేళాకోళం ఆడాలనిపించి వీటిని కోడినక్కపిల్లలంటారు బావా! ఇవి మన కళ్ళం లోనే పండుతాయి. మరెక్కడా పండవు. రహస్యంగా అన్నారు. అయితే నాకోటియిద్దురు. కరెంటు పొయినప్పుడు మాకు ఉపయోగపడతాయి. అలాగే తప్పకుండా....మీరు పట్నం వెళ్ళేటప్పుడు సారేలో పెట్టిస్తాం.
నవ్వుకుంటూ ముక్తకంఠంగా అన్నారు. వాళ్ళ మాటలు ఏందుకో నమ్మబుద్ధికాలేదు "అబద్ధానికి". సరే అంటూ ఇంటికి చేరుకున్నారంతా. రాత్రి భోజనాల దగ్గర కూడా కోడి నక్కపిల్లలు "అబద్ధానికి దర్శనమిచ్చాయి. భలే బాగున్నాయి అనుకున్నాడు మనసులో. మామ గారు అనునయంగా బాబు రేపు మంగళవారం మీరేమో రేపే బయలుదేరాలంటున్నారు ఓ పని చేయండి పిల్లని కొత్త కాపరానికి పంపించడం కదా పంతులు గారి చేత మూహూర్తం పెట్టించి మేము తీసుకొచ్చి దిగబెడతాం ప్రస్తుతానికి రేపు మీరు బయలుదేరండి, సారె, చీరలు పెట్టి అమ్మాయిని మీ ఇంటికి తీసుకొస్తాం. 
                                            

                మామగారు అన్నమాటల్లో మీరు రేపు బయలుదేరండి అన్నప్పుడు అబద్ధానికి టక్కున ఓ అనుమానం మెరిసింది. సారె తెస్తారు సరే మరి కోడినక్కపిల్లనిస్తారా? బావగారు చమత్కారులే అందరూ ఫక్కున నవ్వుకున్నారు. రాత్రి పడుకున్నా నడిరేయి దాటినా అబద్ధానికి మాత్రం నిద్ర పట్టలేదు. అందరూ నవ్వుకున్నారన్న ఉక్రోషం పట్టలేక పోయాడు. వీళ్ళకి చెప్పీ పెట్టకుండా కోడినక్కపిల్లను మాత్రం పట్టుకుపోవాలని నిశ్చయించుకున్నాడు. ఎదురుగా మినుకు మినుకు మంటూ కనిపిస్తున్న కోడినక్కపిల్లని తన చేతిసంచీని భద్రంగా ఆ తాటాకుల ఇంట్లో వీధి చూరులో పెట్టి మెల్లగా ఓ రెండు గంటలు కాలక్షేపం చేసి వెళ్లి పోవాలనుకున్నాడు. ఇంతలో నిద్రా దేవత అతణ్ణి ఒడిలోకి తీసుకుంది.  

                   తెలివొచ్చేసరికి పెద్ద కేకలు హాహాకారాలు మంటలు వాటినార్పుతున్న బామ్మర్దులు. అబద్ధం మాత్రం చూరుదగ్గర నిశితంగా వెతుకుతున్నాడు. బాబూ ఏం వెతుకుతున్నారు? మామగారు ప్రశ్నించారు, అదే ఆ కోడినక్కపిల్ల ఈ చూరుక్రింద పెట్టానన్న అతని మాటలతో బిగ్గరగా కేకలేస్తూ ఒరేయ్! మీ బావ కొంపలంటిచేసాడురా, వెధవ వేళాకోళాలూ మీరూ................. ముక్కుమీద వేలేసుకుంటూ బిక్కుమనకుండా అంతా నిశ్శబ్ధం..... 
              తెలివితక్కువ తనం ఎంత ప్రాణాంతకమౌతుందో.........??? అలాగే తెలివైనవాడు మరణించినా తను మనుగడను సూచిస్తాడు." అప్రశిఖ " కథనంలో తెలుస్తుంది. మళ్ళీ ఆ కథనంతో కలుద్దాం....