అక్షరాలునేర్చి ఆశ్చర్య పడునాడు - తెలుయునెంత గలదొ తెలుసుకొనగ - వింతతరగదయ్య విఙ్ఞానికెన్నడూ - అప్రమేయ వరద హరిముకుంద (పరాక్రి)

31, జనవరి 2013, గురువారం

చాటువులు - 12

11.    సీ||    అతిలోక సుందరమ్మందురీ భాషను
                              బ్రిటను వాడౌ బ్రౌను నిటలి యనెను
              దేశ భాషలయందు తెలుగు లెస్సనుచున్న
                             మా భూమిని బుట్టి మసలు నేను
              అధ్యయనంబుచే నధ్యాపకత్వంబు
                                   చేపట్టి శిష్య ప్రశిష్యగముల
              సీస పద్యముచెప్పి శ్రీనాథు మెప్పింతు
                                   సందర్భ శుద్ధిగా ఛందమలర
||

30, జనవరి 2013, బుధవారం

చాటువులు - 11

10.   చం||  పదముల నర్తనానుగుణ పద్యములల్లెద రాసధావనీ
            కదలెడు మానసానుభవ కాంతను చింతనలందు నీ విధిన్
            ఉదయిని భావసాగరిణి నుజ్వల భాస విశేష రాశినిన్
            కధలుగ వ్రాసుకొందు మదికామిత రాణిని ప్రేమ ధోరణిన్  ~$

29, జనవరి 2013, మంగళవారం

చాటువులు - 10

 గీ ||    శంఖ కంఠిని కుచకలశాల మ్రోల
                  రేఖ శాఖియ నడుముతో లేఖనాల
                  రంభ సమభార ఊరువులందగింప
                  చేర వచ్చిన నీ పేరె చారు కవిత ||

28, జనవరి 2013, సోమవారం

చాటువులు - 9

 9.   సీ||     మది నిన్ను తలపోసి మమత రంగులు పూసి
                           దయాంతరస్థమౌ సదనమందు
                  చిందులేసెడి కాంత శ్రీకార విశ్రాంత
                                   కలనుండి ఇలలోకి కదలిరావె
                  కావ్య కళానురాగ కమనీయ రమణి
                                   వర్ణింతు పద్యాల వచనమందు
                  పద పదంబులయందు పాదానుమోదమై
                                   నర్తించి వర్తించి నడచిరావె

27, జనవరి 2013, ఆదివారం

చాటువులు - 8

8. 
 ఉ || రాధనురా ప్రభూ నిరప రాధను  రా మదినిన్నె గొల్చు  ఆ
            రాధన మగ్న మానసనురా వినయంబున విన్నవించు నీ
            రాధనురా మదీప్సితము రాజిల జేయు మరీచి వీచికా
           రాధన జేయుచుంటి నిట రాగమయీ సరసాస్వరాధనై ||

26, జనవరి 2013, శనివారం

చాటువులు - 7

7. 

 ఉ || లక్షణ సంయుతంబగుచు రంజిల జేయుటె యక్షయంబుగా
          రక్షిత దక్షతన్ వరలు రమ్యపు జీవన భావనా స్రవం
          తీక్షయనామ వత్సరము తీరని కాంక్షలు దీర్చు తానిలన్
         అక్షయనామ వత్సరమె యందురు కొందరు శ్రీక్షయంబునే ||

25, జనవరి 2013, శుక్రవారం

చాటువులు - 6

6.      గీ ||  అడవిని జరించి శాంతుడననుట కన్న
              జనుల యారణ్యరోదన జాలి గొలుపు
              శోకద్రష్టమౌ జీవన శోభలందు
              నిలిచి యుండుమ తపసివై నిబ్బరముగ ||

24, జనవరి 2013, గురువారం

చాటువులు - 5

5.      కం ||   ష్టి స్థితి లయ నేతా
                    స్రష్టలు మువ్వురి దలంచి సాగిలి మ్రొక్కన్
                    శిష్ట జనావళి బ్రోచెడి
                    నిష్టకు మూర్తి త్రయమున నీశ్వరుడెదగున్ ||

23, జనవరి 2013, బుధవారం

చాటువులు - 4

  శ్లో ||  మనస్వీ మ్రీయతేకామం కార్పణ్యంతు నగచ్ఛతి
           అపి నిర్వాణమాయాతి నానలోయాతి శీతతాం ||

4.   తెనిగింపు పద్యం :-
             గీ || మానవంతుడకట మహి( గోర్కె లుండియు
                   దైన్యమొంది తీర్ప తపన బడునె ?
                   నిప్పు రవ్వ వేడి నివురున గప్పగా
                   శీతలంబు గాదు చివరనైన ||

22, జనవరి 2013, మంగళవారం

చాటువులు - 3

శ్లో  || కుసుమ స్తమకస్యేవ ద్వయీవృత్తి ర్మనస్వినహ్
              మూర్ధ్నివా సర్వ లోకస్య శీర్యతే వనయేవవా ||

3.  తెనిగింపు పద్యం :-
         గీ ||  మానవంతుల సద్వృత్తిగాన రెండు
                 తెరగులగుచుండు పుష్పములరయ, సర్వ
                 లోక ఆరాధనా శీర్ష్యదేక గతిని
                 గాక పోయిన వాడును కానలందు ||

21, జనవరి 2013, సోమవారం

చాటువులు - 2

శ్లో  ||      ఆకారేణైవ చతురాహ్ తర్కయంతి పరేంగితం
                        గర్భస్థం కేతకీపుష్పం ఆమోదేనైన షట్పదాహ్ ||

2.   తెనిగింపు పద్యం :-
             గీ ||  మొగలి పూవును గర్భస్థ ముఖిని గనియు
                    చేరనెంచును తుమ్మెదల్ చెలిమితోడ
                    ఇంగితమ్మును గ్రహియింతు రితరులందు
                    చనగనాకృతి తర్కించి చతుర మతులు  ||

20, జనవరి 2013, ఆదివారం

చాటువులు - 1

1.    కం  ||  కందము చెబుతా వినరో
                 రందముగా నిందుభాతి యమరము గాతన్
                 వందిత వాఙ్మయ మాతకు
                 ఛందము మచ్ఛందమలరు చతురోద్గృతులన్ ||